థ్రిల్లర్ మూవీస్ కి పెట్టింది పేరు మలయాళ ఇండస్ట్రీ. మాలీవుడ్ లో ఇప్పటికి ఎన్నో అద్భుతమైన థ్రిల్లర్ మూవీస్ వచ్చినా.. వాటన్నింటిలోకీ .. ‘దృశ్యం’ ది బెస్ట్ అనిపించుకుంది. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ అభినయ కౌశలం, దర్శకుడు జీతు జెసెఫ్ బ్రిలియన్సీ ఈ సినిమాకి ప్రధాన బలం. అందుకే ఈ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేయడంతో పాటు .. విదేశాల్లో సైతం రీమేక్ చేశారు.
అయితే అలాంటి సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుందని ఎవరూ అనుకోలేదు. అసలు దర్శకుడు జీతు జోసెఫే ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ముందు అనుకోలేదట. ఏడాది క్రితం.. ఆయన మనసులో సీక్వెల్ లైన్ ఫ్లాష్ లా తట్టిందట. దాంతో లాక్ డౌన్ టైమ్ లో మొదలు పెట్టి.. కేవలం 46 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. దీనిపై ఎలాంటి భారీ అంచనాలూ కలగనీయకుండా .. థియేటర్స్ లో కాదని .. ఓటీటీలో విడుదల చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్టై.. యూనిట్ లో ఆనందాన్ని నింపింది ఆ సినిమా.
మాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాపై ఎందరో సినీ ప్రముఖులు, విమర్శకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా.. దృశ్యం సినిమాకి మూడో భాగం వస్తుందా అని దర్శకుడిని చాలా మంది అడుగుతున్నారట. అయితే ప్రస్తుతానికైతే.. తనకి ఎలాంటి ఆలోచన లేదని, భవిష్యత్తులో రెండో భాగం నుంచి ఏదైనా లైన్ ఐడియాగా తడితే.. తప్పకుండా తీస్తానని చెబుతున్నాడు. వాస్తవానికి రెండో భాగంలో .. మూడో భాగం తీయడానికి వీలున్న .. పాయింట్ అయితే ఏమీ లేదని చెప్పాలి. మరి మోహన్ లాల్ అభిమానులు డిమాండ్ మేరకు .. దర్శకుడు ఏదైనా ఆలోచన చేస్తాడేమో చూడాలి.
Must Read ;- దృశ్యం 2 రీమేక్ పై వెంకీ ఆలోచన అదేనట!











