(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలన్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం వెనుక రాజకీయాలను.. ఇతర కోణాలను ప్రస్తుతానికి పక్కన పెడదాం.. ఇలాంటి నిర్ణయం కారణంగా అటు అమరావతిలో చెలరేగిన నిరసనను.. అక్కడ ఇప్పటికే ఖర్చు చేసిన కోట్లాది రూపాయల సర్కారు ధనం గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకోవద్దు.. రాజధానిని విశాఖకు తరలించాలన్న ఆలోచన వెనుక దాగి ఉన్న రియల్ ఎస్టేట్ఇం టరెస్టులు..వ్యక్తిగత ప్రయోజనాల కోణాల జోలికి కూడా పోవద్దు..ఈ మొత్తం వ్యవహారం చుట్టూ ముసురుకుని ఉన్న రాజకీయ అంశాలు.. వ్యక్తిగత ఇ”గోల” ఊసు కూడా ఇప్పుడైతే మనకొద్దు.. ప్రస్తుతానికి సరికొత్త హాట్ టాపిక్ విశాఖ ఉక్కు కర్మాగారం.. అదే మన స్ఫూర్తి..కీర్తి..ఆర్తి..దీప్తి..ఇన్నాళ్లు మన తేజోమూర్తి..ఇప్పుడు దానిని కూడా ప్రైవేటుకు కట్టబెట్టేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఉత్తరాంధ్రవాసులు వేదనతో కుమిలిపోతున్నారు.

ఆంధ్రుల హక్కు .. విశాఖ ఉక్కు
ఆంధ్రుల హక్కును కాలదొక్కే ఈ వికృత చర్యను తెలుగువారంతా కలిసికట్టుగా ఎదుర్కొని ఇందుకోసం మరో మహోద్యమానికి సిద్ధపడాల్సిన తరుణమిదని అంటున్నారు. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం.. అసెంబ్లీలో లెక్కకు మించిన బలం, ఎంపీల బలగం మెండుగా ఉన్న వైఎస్సార్ సిపి ముందు నిలబడి పోరాటం సాగించాలని కోరుతున్నారు. వాస్తవానికి చాలాకాలంగా ఎన్నో అంశాల్లో ఆంధ్రకు అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి..ఉమ్మడిగా ఉండి 42 మంది ఎంపీలు ఉన్న కాలంలోనే బడ్జెట్ కేటాయింపులు.. కొత్త పరిశ్రమలు వంటి ఎన్నో కీలక అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చిన్నచూపు చూస్తూనే ఉన్నాయన్న విమర్శలున్నాయి.సాక్షాత్తు తెలుగుజాతి ముద్దుబిడ్డ పి వి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఈ పరిస్థితిలో మార్పు లేదు.. ఇక ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టిన సందర్భంలో కూడా వద్దంటూ అసెంబ్లీ తీర్మానం చేసినా..అప్పటికి కేంద్రంలోనూ..రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉన్నాకేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది..పోనీ అంతటితో ఆగిందా..విభజన హామీలు అంటూ బోలెడు మన నెత్తిన కుమ్మరించింది..ఆ తర్వాత కేంద్రంలో మరి కొన్నాళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం గాని,అటు పిమ్మట 2014,2019 లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ గాని ప్రత్యేక హోదా..కనీసం పాకేజీ విషయంలో చెయ్యి దులిపింది లేదు..నిలదీసిన వారు అంతకంటే లేరు..ఇప్పుడు రాష్ట్రంలో 151 ఎమ్మెల్యేలు..21 మంది లోక్‌సభ సభ్యులు..మరో ఆరుగురు రాజ్యసభ సభ్యులు గల అధికార పార్టీ ముందుండి నేతృత్వం వహిస్తే అన్ని పార్టీల వారు ఒక తాటిపైకి వచ్చి పోరాటం చెయ్యాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయంటున్నారు. ప్రత్యేక హోదా..పాకేజీ..బడ్జెట్ కేటాయింపులు..వీటికి తోడు ఎన్నాళ్ళ నుంచో ఊరిస్తున్న రైల్వే జోన్..కొత్త పరిశ్రమలు.. అవి రాకపోగా ఇప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్‌పై ప్రైవేట్ నీడ.. ఆంద్రులను మరింత ఆవేదనకు గురిచేస్తోంది.
ఎవరి రాజకీయ కోణం వారిది
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌కు ధారాదత్తం చేసే విషయంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎవరి కోణాల దృష్ట్యా వారు తమ ధోరణిని వ్యక్తం చేసే క్రమం అప్పుడే మొదలై జనాలలో అయోమయం ఆరంభమైంది… సరే..కేంద్రంలో బీజేపీకి గల బలం దృష్ట్యా మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా హడావిడి చెయ్యడం మినహా వెనక్కి తగ్గేలా చేసే పరిస్థితి ఉండదు. అయితే ఏది మంచిదో విశ్లేషించుకుని ఒక మాట అనుకుని ప్రైవేట్ పరం చెయ్యడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మంచిది కాదని నిర్ణయించుకున్న పక్షంలో ఆ మాటను స్పష్టంగా కేంద్రానికి చెప్పగలగాలి. ఇప్పుడు రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరని పని. అంతా రాజకీయ పరిస్థితులను..ప్రయోజనాలను అనుసరించే..! అయితే, రాజధానిని విశాఖకు తరలించాలనే విషయంలో పంతం మీద ఉన్న జగన్ సర్కారే ఈ విషయంలో ఖచ్చితమైన స్టాండ్ తీసుకోవాల్సి ఉంది..ఉక్కు కర్మాగారంతో పాటు రైల్వే జోన్ తదితర కీలక అంశాలపై సరైన నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. వైఎస్సార్సీపీకి అంత చిత్తశుద్ధి.. తెగింపు ఉంటాయా.. అనే సందేహాలు కూడా రాకపోవు.. మరి రాజధాని అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న జగన్ ప్రభుత్వం ఈ విషయంలో నిబద్ధంగా వ్యవహరించి రాజధాని విషయంలో తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సి ఉంటుంది..స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు..ముఖ్యంగా విశాఖ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడమే గాక అటు ప్రైవేట్‌లోనైతేనేమి.. ఇటు ప్రభుత్వ రంగంలోనైతేనేమి కొత్త పరిశ్రమలు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సి ఉంది..ఇవి చేస్తేనే విశాఖకు రాజధాని వచ్చినా తగిన సార్థకత లభిస్తుంది.











