(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ నేతల ఆస్తులపై విరుచుకుపడుతున్న వై ఎస్ ఆర్ సి పి నేతలకు ఆదివారం ఒక ఝలక్ తగిలింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రుషికొండ సర్వే నంబర్ 21 లో ఆరు సెంట్ల గెడ్డను ఆక్రమించారని సెలవు రోజైనా ఆదివారం పూట తొలగింపులు చేపట్టారు. ఈ క్రమంలో లో జరిగిన ఒక్క ట్విస్ట్.. వైసీపీ నేతల నిజాయితీపై అనేక సందేహాలను లేవనెత్తింది. ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుల ఆక్రమణలను మాత్రమే తొలగిస్తే అపవాదు మూటగట్టుకోవలసివస్తుందని భావించిన రెవెన్యూ అధికారులు.. ఆ హడావిడిలో తప్పులో కాలేశారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు చెందిన బంధువుల ఆస్తులను తొలగించేశారు.
బొత్స అల్లుడిదంట…!
శనివారం రాత్రి 12 గంటలకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందుకున్న రెవెన్యూ అధికారులు.. ఆదివారం తొలగింపులు చేపట్టేందుకు కోడి కూయక ముందే ఆయా ప్రదేశాలకు చేరుకున్నారు. ఒక బృందం ఆనందపురం.. మరో బృందం రుషికొండ లో తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది. కాగా వెలగపూడి రామకృష్ణబాబు ఆధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆనుకొని మరి కొన్ని నిర్మాణాలు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం వరకు వెలగపూడి ఆస్తుల స్వాధీనం ప్రక్రియలో బిజీగా ఉన్న అధికారులు.. మధ్యాహ్న భోజనం చేస్తూ ఏ ఆలోచన చేశారో ఏమో.. మధ్యాహ్నం నుంచి ఇతర నిర్మాణాల తొలగింపునకు ఉపక్రమించారు. టిడిపి నాయకులవి మాత్రమే తొలగించడం వల్ల చెడ్డపేరు వస్తుందని, కక్షసాధింపు అంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తాయని భయపడిన రెవెన్యూ అధికారులు పలు ఇతర నిర్మాణాలను తొలగించారు. ఈ క్రమంలో గెడ్డ స్థలాన్ని ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 19 లో 9 సెంట్ల భూమిలో నిర్మించి ఉన్న ఓ భవనం కూల్చివేత ప్రారంభించారు. సగానికిపైగా కూల్చివేత ప్రక్రియ పూర్తవుతున్న సమయంలో వాచ్ మన్ పరుగుపరుగున వచ్చి… ఇది మంత్రి బొత్స సత్యనారాయణ గారి భూములని చెప్పుకొచ్చాడు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఆ సమయంలో కొందరు విలేకరులు కూడా అక్కడ ఉండడంతో రెవెన్యూ అధికారులు ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకున్నారు.
కాసేపటి తర్వాత ఫోన్లలో సంప్రదింపులు జరిపి.. ఇవి మంత్రి బొత్స అల్లుడికి సంబంధించిన భూములనీ.. ప్రభుత్వ భూములు అప్పగించేందుకు స్వచ్ఛందంగా వాళ్లే ముందుకు వచ్చారని రెవెన్యూ అధికారులు వివరణ ఇచ్చారు. ఆ సమయంలో కవర్ చేసుకునేందుకు మరొక మార్గం రెవెన్యూ అధికారులు ముందు లేకుండా పోయింది. మరి ఈ అత్యుత్సాహం కారణంగా… విలువైన తొమ్మిది సెంట్ల భూమి చేజార్చుకున్న మంత్రి గారి బంధువు రెవెన్యూ సిబ్బంది పై కన్నెర్ర చేస్తారా? లేక కొంత కాలం అయ్యాక మళ్లీ స్వాధీనపరచుకుంటారా? అన్నది వేచి చూడాల్సిందే.
Must Read ;- బొత్స కుటుంబంలో ముసలం