(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎక్కువుగా వెలమ, కాపు సామాజిక వర్గాలు ప్రభావితం చేస్తుంటాయి. ఏ పార్టీలో చూసినా ఈ కులాల పెత్తనం అదే స్థాయిలో ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో అయితే ఎప్పటి నుంచో ఈ రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇరువురినీ బ్యాలెన్స్‌డ్‌గా మెయింటెన్ చేస్తుంటారు. ఉత్తరాంధ్ర టీడీపీలో ఇప్పుడు ఈ సమీకరణల్లో మార్పులు వచ్చాయని కొందరు సీనియర్లు వేడెక్కిపోతున్నారు. పార్టీలో ఒక్క సామాజిక వర్గానిదే పెత్తనం నడుస్తోందనే ఆగ్రహంతో ఊగి పోతున్నారు.
వెలమలకు ప్రాధాన్యత
ఉత్తరాంధ్రలో మొదటి నుంచీ చంద్రబాబు వెలమలకు కొంత పెత్తనం ఇస్తూ వచ్చారు. అప్పుడప్పుడు తూర్పు కాపులకు అవకాశం ఇచ్చినా వెలమలదే రాజ్యాంగా కొనసాగుతోంది. అది మంత్రి వర్గం కూర్పు అయినా పార్టీ సంస్థాగత పదవులు అయినా చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఈ రెండు బలమైన సామాజికవర్గాలను కలుపుతూ వచ్చారు. కానీ గత ఎన్నికల్లో ఓడిన తరువాత బాబు తన ఆలోచనను మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనూ ఇప్పుడు వెలమలకే టీడీపీ అగ్రపీఠం వేసినట్లు కనిపిస్తోంది.
అధ్యక్షునిగా అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం జిల్లా వెలమ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడును ఏకంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్‌ను చేశారు. అంతేకాకుండా ఆయన అసెంబ్లీలో పార్టీ తరఫున ఉప నాయకుడుగా కూడా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకైతే అచ్చెన్న రైట్ హ్యాండ్ అని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలోనూ రాష్ట్రంలో ఏది జరిగినా అచ్చెన్న నాయకత్వంలోనే విచారణ కమిటీని వేసే వారు. ఇప్పుడూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక విశాఖలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా సీనియర్ నేతగా పొలిట్ బ్యూరోలో ఉన్నారు. మరో నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి కూడా బాబు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక అదే సామాజికవర్గానికి చెందిన సబ్బంహరిని కూడా బాబు బాగానే ప్రోత్సహిస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా చంద్రబాబు నియమించడంతో ఆ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read ;- అసందర్భం ఎఫెక్ట్.. విశాఖలో సాయిరెడ్డి రాజీడ్రామా
కాపుల్లో ఆగ్రహం
ఈ నేపథ్యంలో ఇప్పుడు కాపులు రగిలిపోతున్నారు. తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన కళా వెంకటరావు ఏ తప్పూ చేయకున్నా ఆయన్ని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి నుంచి ఎందుకు తప్పించారని ఆ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన కాపు నేత గంటా శ్రీనివాసరావుకి ఏ పదవి ఇవ్వకపోవడంలో ఆంతర్యమేంటనే చర్చ విస్తృతంగా కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలో బలమైన కాపు నేతగా ఉన్న గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడిని పక్కన పెట్టడానికి కారణమేంటనే ప్రశ్న లేవదీస్తున్నారు. జిల్లాలో మహిళా నాయకురాలిగా ఉన్న విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు కనీసం విజయనగరం అసెంబ్లీ ఇన్‌ఛార్జి పదవి అయినా ఇవ్వకపోవడం పట్ల ఆ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు కాపుల పట్ల చూపుతున్న వివక్షగా భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలో సుమారు 38 లక్షల మంది తూర్పు కాపులు ఉన్నారని, తమపట్ల ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నిస్తూ వారంతా కలిసి వేరే కుంపటి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు భోగట్టా.
ఈ పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం ముఖ్యంగా చంద్రబాబు వీరికి ఎలా సర్దిచెపుతారో వేచి చూడాలి.
Also Read ;- ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ శోభానాయుడు