YSRTP Chief YS Sharmila Meets Majlis Party Supporters In Hyderabad
భాగ్య నగరి హైదరాబాద్‌లోని పాత బస్తీ అంటేనే.. రాజకీయంగా మజ్లిస్ పార్టీకి పెట్టని కోట. తెలుగు నేలలో ఏ పార్టీలు అధికారంలో ఉన్నా.. పాతబస్తీలో ఏడెనిమిది అసెంబ్లీ సీట్లతో పాటు హైదరాబాద్ ఎంపీ సీటు కూడా మజ్లిస్ పార్టీదే. అందుకే మజ్లిస్ పార్టీని పాతబస్తీ పహిల్వాన్ అని కూడా రాజకీయ విశ్లేషకులు వర్ణిస్తూ ఉంటారు. ఇలాంటి పాతబస్తీలో పాగా వేసే దిశగా తెలంగాణలో ఇటీవలే వైఎస్సార్టీపీ పేరిట కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా కదులుతున్నారా? అన్న దిశగా సరికొత్త విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ విశ్లేషణలు నిజమేనన్నట్లుగా షర్మిల తరచూ పాతబస్తీలో పర్యటిస్తున్నారు. అక్కడి ముస్లిం మత పెద్దలు, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలగిన వారితో పాటు మజ్లిస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న నేతలనూ కలుస్తున్నారు.
తబ్లీగీ పెద్దలతో భేటీ
ఇప్పటికే ఓ దఫా పాతబస్తీలో పర్యటించిన షర్మిల.. రాజశేఖరరెడ్డితో సన్నిహితంగా మెలగిన పలువురు ముస్లిం నేలను కలిశారు. తాజాగా బుధవారం నాడు మరోమారు పాతబస్తీ బాట పట్టిన షర్మిల.. తబ్లీగీ జమాత్ మత పెద్దలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్ద మౌలానా ముఫ్తీ గ్యాజుద్దీన్‌తో భేటీ అయ్యారు. గ్యాజుద్దీన్‌తో పాటు ఆయనతో సన్నిహితంగా ఉండే పలువురు నేతలు కూడా షర్మిలతో భేటీలో పాలుపంచుకున్నారు. గ్యాజుద్దీన్‌తో పాటు షర్మిలతో భేటీ అయినవారంతా మజ్లిస్ పార్టీకి మద్దతుదారులేనట. ఈ సందర్భంగా వారితో సుదీర్ఘంగానే మంతనాలు సాగించిన షర్మిల.. తన తండ్రిని ఆదరించినట్లుగానే తన పార్టీకి కూడా మద్దతుగా నిలవాలని వారిని కోరారు. షర్మిల ప్రతిపాదనలకు గ్యాజుద్దీన్ వర్గం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదు గానీ.. షర్మిలను వారు సాదరంగానే ఆహ్వానించారు. షర్మిలతో ఏమాత్రం భేషజాలు లేకుండానే మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే.. షర్మిల విజ్ఞప్తికి గ్యాజుద్దీన్ సానుకూలంగానే స్పందించినట్లుగా తెలుస్తోంది.
YSRTP Chief YS Sharmila Meets Majlis Party Supporters In Hyderabad
తండ్రి ఆదరిస్తే.. కూతురు దెబ్బేస్తారా?
షర్మిల పాతబస్తీ పర్యటనలను చూస్తుంటే.. మజ్లిస్ పార్టీ, ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అసద్ సోదరుడు అక్మరుద్దీన్ ఓవైసీలతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవహరించిన తీరే గుర్తుకు వస్తోంది. మజ్లిస్ పార్టీ వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఓవైసీతోనూ మంచి సంబంధాలు నెరపిన వైఎస్సార్.. అసద్, అక్బర్‌లతోనూ అదే సంబంధాలను నెరపారు. ఈ లెక్కన పాతబస్తీలో మజ్లిస్ పార్టీకి వైఎస్ గట్టి మద్దతు ఇచ్చినట్లే లెక్క. అయితే ఇప్పుడు షర్మిల మంత్రాంగం చూస్తుంటే.. తన పార్టీని బలోపేతం చేసుకునేందుకు షర్మిల మజ్లిస్ పార్టీ మద్దతుదారులపైనే ఆధారపడ్డారని చెప్పాలి. ఈ దిశగా సాగితే.. తన తండ్రి ఆదరించిన మజ్లిస్ పార్టీకి షర్మిల గండి కొట్టినట్టే కదా. అయినా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లతో కాని మజ్లిస్ బలహీనం షర్మిలతో అవుతుందా? అన్న మాట కూడా కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది.
Must Read ;- షర్మిల బండారమూ బయటపడిందే











