ఏ పార్టీ అయినా.. ఏ నేతకు అయినా.. పదవి ప్రకటించిందంటే.. వెంటనే ఆ పదవిలో ఆ నేత కూర్చుండిపోతారు. ఇక అధికారంలో ఉన్న పార్టీలు పదవులు ప్రకటిస్తే.. వాటికి ఎంపికైన నేతలు ఫుల్ ఖుషీ అయిపోతారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీఆర్ఎస్ కు సహకరించేలా వ్యవహరించిన హుజూరాబాద్ కు చెందిన యువ నేత పాడి కౌశిక్ రెడ్దికి మాత్రం పదవి ప్రకటన వచ్చినా.. ఖుషీ మాట దేవుడెరుగు.. అసలు ఆ పదవి తనకు దక్కుతుందా? లేదా? అన్న ఆందోళన తప్పడం లేదు. నిజమే మరి.. కౌశిక్ రెడ్డికి గవర్నరన్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్ తీర్మానం కూడా చేశారు. ఆ వెంటనే గవర్నర్ ఆమోదం కోసం ఆ ఫైల్ రాజ్ భవన్ కు వెళ్లింది. అంతే.. ఇక ఈ విషయం ఏమైందో కూడా అత్తాపత్తా లేదు. అసలు ఆ ఫైల్ ను గవర్నర్ ఆమోదించారా? లేదా? అన్న దానిపై క్లారిటీ లేదు. గవర్నర్ ఆమోదం తెలపకుంటే.. సీఎంగా కేసీఆర్ కల్పించుకోవాలి కదా. సీఎం కల్పించుకుంటే.. గవర్నర్ నిమిషాల్లో ఫైల్ ను క్లియర్ చేసేస్తారు కదా. వెరసి పాడికి ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్న జాప్యం వెనుక కేసీఆర్ వ్యూహం ఉన్నట్టే కదా. ఆ వ్యూహం ఏమిటన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
18 రోజులైనా క్లియర్ కాలేదే
పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించి.. ఈ నెల 1న జరిగిన కేబినెట్ భేటీలో తీర్మానం చేశారు. ఆ వెంటనే ఆ ఫైల్ ను ఆమోదించాలంటూ గవర్నర్ తమిళిసై వద్దకు పంపారు. ఇదంతా ఆగస్టు 1ననే జరిగిందనే చెప్పాలి. సాధారణంగా అధికారంలోని పార్టీ ఎంపిక చేసే అభ్యర్థులకు గవర్నర్ పెద్దగా అభ్యంతరం చెప్పరు. ఒకవేళ ఆయా నేతలపై కేసులు గట్రా ఉన్నా.. సీఎం వివరణ తీసుకుని ఒకటి రెండు రోజుల్లోనే ఆ ఫైళ్లకు క్లియరెన్స్ ఇస్తారు. అయితే ఎందుకనో గానీ.. సీఎంఓ నుంచి రాజ్ భవన్ వెళ్లిన ఆ ఫైల్ ఇప్పటిదాకా అక్కడే ఉండిపోయింది. ఇలాగే తాను ఎంపిక చేసిన నలుగురు ఎమ్మెల్సీల జాబితాకు గవర్నర్ ఆమోదం తెలపలేదని.. మూడు రోజులకే ఏపీ సీఎం జగన్ విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లి మరీ ఆ ఫైల్ కు క్లియరెన్స్ ఇప్పించుకున్నారు. ఇదంతా రోటీన్ గా జరిగే వ్యవహారమే. జగన్ మాదిరే ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక్కసారి రాజ్ భవన్ తలుపు తడితే క్షణాల్లో పాడికి ఎమ్మెల్సీ పదవికి ఓకే చెబుతూ తమిళిసై సంతకం పెట్టేస్తారు. మరి కేసీఆర్ ఎందుకు వెళ్లడం లేదు? గవర్నర్ తమిళిసై ఆ ఫైల్ ను ఎందుకు ముట్టుకోవడం లేదు? అన్నవే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్నలు.
కేసీఆర్ వ్యూహంపై భిన్న వాదనలు
టీఆర్ఎస్ లోని చాలా మంది కీలక, సీనియర్ నేతలు ఎమ్మెల్సీ పదవి కోసం.. అది కూడా సులువుగా మండలిలో అడుగుపెట్టించే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం చాలా కాలం నుంచి కాసుక్కూర్చున్నారు. అయితే కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టేలా వ్యవహరించిన పాడికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ప్రకటించారు. ఈ నిర్ణయంపై పార్టీ సీనియర్ల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోందట. కనీసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని.. 36 ఏళ్ల వయసు ఉన్న కౌశిక్ కు ఎమ్మెల్సీ ఇస్తే.. తమ పరిస్థితి ఏమిటని సీనియర్లంతా పోరుతున్నారట. దీంతో కొంతకాలం పాటు ఈ ఫైల్ అలాగే రాజ్ భవన్ లోనే పెండింగ్ లో ఉండేలా కేసీఆర్ వ్యూహం రచించారట. ఇక మరో విశ్లేషణ ప్రకారం..హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసమే కౌశిక్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని, హుజూరాబాద్ ఉప బరి ముగిశాక.. పలితాలు వెలువడ్డాక మాత్రమే ఈ ఫైల్ పై నిర్ణయం తీసుకునేలా కేసీఆర్ వ్యూహం రచించారని చెబుతున్నారు. అంటే.. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తేనే కౌశిక్ కు ఎమ్మెల్సీ పదవి.. లేదంటే ఆ ఫైల్ లో కౌశిక్ పేరును తీసేసి మరో నేతను ఎక్కించేస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ లెక్కన హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తేనే పాడికి ఎమ్మెల్సీ అన్న మాట. ఈ వ్యూహాల్లో దేనిని బేస్ చేసుకుని కేసీఆర్ ఈ జాప్యాన్ని ఆశ్రయించారో గానీ.. తనకు ప్రకటించిన ఎమ్మెల్సీ పదవి ఎప్పుడు దక్కుతుందా? అని కౌశిక్ రెడ్డి ఎదరుచూస్తున్నారట.
Must Read ;- దళిత బంధు ఎదురు తన్నడం గ్యారెంటీ!