Bumper Offer To Padi Koushik Reddy :
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నమ్మక ద్రోహం చేసి టీఆర్ఎస్ కు ఆయాచిత లబ్ధి చేకూరేలా యత్నించిన యువ రాజకీయ నేత పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే హుజూరాబాద్ బైపోల్ లో ఎలాగైనా విజయమే సాధించి తీరాలన్న టీఆర్ఎస్ వ్యూహం కారణంగా.. కౌశిక్ రెడ్డికి బంపర్ ఆఫర్ దక్కిందనే చెప్పాలి. హుజూరాబాద్ బైపోల్ లో టీఆర్ఎస్ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలవాలని కౌశిక్ రెడ్డి భావించారు. ఈ లెక్కన ఓ రెండేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగాలని, ఆ తర్వాత అదృష్టం బాగుంటే మరింతకాలం పాటు చట్టసభ సభ్యుడిగా కొనసాగాలని అనుకున్నారు. అయితే ఆయన ఊహించని విధంగా రెండేళ్ల ఎమ్మెల్యే పదవిని కాదని, ఏకంగా ఆరేళ్ల కాలం ఉండే ఎమ్మెల్సీ పదవిని గులాబీ పార్టీ ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చింది. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ కేసీఆర్ ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్‌లో ఉంటూనే టీఆర్ఎస్ తో దోస్తానా
పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ అరంగేట్రంలోనే తనదైన ఎత్తులు జిత్తులతో తన రాజకీయ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలని యత్నించారు. ఈ క్రమంలోనే ఓ వైపు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూనే.. టీఆర్ఎస్ తో దోస్తానా మొదలెట్టారు. మంత్రి పదవి ఊడిన తర్వాత ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేయగానే.. టీఆర్ఎస్ కార్యాధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన కౌశిక్.. కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురి చేశారు. ఆ తర్వాత కూడా తాను కాంగ్రెస్ పార్టీ నేతనే అంటూ బుకాయించిన కౌశిక్.. టీఆర్ఎస్ తో దోస్తానా ఏమీ లేదన్నట్లుగానే బయటకు మాట్లాడారు. అయితే అనుకోకుండా ఓ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడిన కౌశిక్.. ఆ ఆడియో లీక్ కావడంతో అడ్డంగా బుక్కైపోయారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణ వేటు పడుతుందని భావించిన కౌశిక్.. హస్తం పార్టీకి రాజీనామా చేశారు. కౌశిక్ రాజీనామా చేస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయనను బహిష్కరించింది. మొత్తంగా ఎన్నికలకు రంగం సిద్ధం కాకముందే కౌశిక్ టీఆర్ఎస్ లో చేరిపోక తప్పలేదు.
టీఆర్ఎస్ భయం కారణంగానే కౌశిక్ కు పదవి
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరినా కౌశిక్ కు హుజూరాబాద్ టికెట్ దక్కదన్న వాదనలు బాగానే వినిపించాయి. ఎందుకంటే.. ఈటల బీసీ నినాదం ఎత్తుకోవడంతో టీఆర్ఎస్ కూడా అక్కడ బీసీ అభ్యర్థినే బరిలోకి దించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి చెందిన టీ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణను పార్టీలోకి ఆహ్వానించింది. ఈ విషయం తెలుసుకున్న కౌశిక్.. హుజూరాబాద్ టికెట్ దక్కకపోతే తన పరిస్థితి ఏమిటన్న ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో కౌశిక్ కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకున్నా బైపోల్ లో పార్టీ పుట్టి మునగడం ఖాయమేనన్న భయంతో కౌశిక్ కు ఏదేనీ పదవిని అయితే ఇవ్వాల్సిందేనన్న కోణంలో ఆలోచించింది. ఈ క్రమంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి తప్పించి మరే పదవి ప్రస్తుతం అందుబాటులో లేదు. దీంతో ఏదైతే అది అయ్యింది.. ముందు హుజూరాబాద్ బరిని గెలవాలన్న ప్లాన్ లో భాగంగా కౌశిక్ కు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని టీఆర్ఎస్ తీర్మానించింది. ఈ లెక్కన రెండేళ్ల ఎమ్మెల్యే పదవిని కౌశిక్ ఆశిస్తే.. ఆయనకు ఏకంగా ఆరేళ్ల కాలం ఉండే ఎమ్మెల్సీ పదవి దక్కిందన్న మాట.
Must Read ;- పాడి, స్వర్గం.. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?