కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి, మాజీ దౌత్యాధికారి శశిథరూర్ కు నిజంగానే ఇప్పుడు పెద్ద ఊరటే లభించిందని చెప్పాలి. తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో శశిథరూర్‌పై ఉన్న అన్ని అభియోగాలను ఢిల్లీ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సునంద పుష్కర్ మృతికి శశిథరూరే కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. సునందది ఆత్మహత్యే అయినా కూడా అందుకు ప్రేరేపించింది మాత్రం థరూరేనన్నది పోలీసుల వాదన. అయితే ఆ వాదనలకు బలం చేకూర్చే ఆధారాలను మాత్రం పోలీసులు సేకరించలేకపోయారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కోర్టు.. థరూర్ పై అభియోగాలను నిరూపించే ఆధారాలేమీ లేవని వ్యాఖ్యానించింది. ఈ కేసు హైప్రొఫైల్ కేసు అయిన నేపథ్యంలో ఆధారాలను ముందుగానే నాశనం చేశారా? లేదంటే.. పోలీసులు వాటిని సేకరించడంలో అనాసక్తి చూపారా? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
కేసు నేపథ్యమేంటంటే..?
2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్‌లో సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఓ రకంగా శశిథరూరే కారణమయ్యారని 2018లో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఆమె మృతి చెందడానికి ముందు ఆమె చేసిన మెయిల్స్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో ఆమె చేసిన పోస్టులను పోలీసులు అప్పట్లో పరిశీలించారు. తనకు బతకాలని లేదని, మృతి చెందడానికి వారం రోజుల ముందు శశిథరూర్‌కి ఆమె ఓ మెయిల్ పంపారని అప్పట్లో పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆమె అప్పట్లో బస చేసిన హోటల్‌లో పోలీసులకు 27 అల్‌ప్రాక్స్ మాత్రలు కూడా లభ్యమయ్యాయి. శశిథరూర్, సునంద పుష్కర్‌కు 2010లో వివాహం జరిగింది. గొడవల కారణంగా సునంద పుష్కర్ యాంటీ-డిప్రెషన్ మాత్రలు తీసుకునే వారని అప్పట్లో పోలీసులు తెలిపారు. ఈ కారణాల వల్ల శశిథరూర్‌పై అభియోగాలు నమోదు చేశారు. చివరకు ఆయనకు సెషన్స్ కోర్టులో ఊరట లభించింది.
థరూర్ స్పందన చూశారా?
సునంద మృతి కేసులో తాను నిర్దోషిగా తేలిన నేపథ్యంలో థరూర్ తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఏడున్నరేళ్లుగా నేను అనుభవిస్తున్న నరకానికి ఎట్టకేలకు ముగింపు దొరికింది. జడ్జిలు గొప్ప తీర్పు ఇచ్చారు. సునంద పుష్కర్ ఆత్మ ఇప్పుడే శాంతిస్తుంది. నా భార్య సునంద మరణం తర్వాత ఎంతో కాలం నా చుట్టూ అలముకున్న కారు చీకట్లు ఈ తీర్పుతో తొలగిపోయాయి. ఆమె మరణంపై నా మీద ఎన్నెన్నో నిరాధారపూరితమైన ఆరోపణలను మోపారు. మీడియా ఎన్నో అభాండాలను వేసింది. అయితే, ఇప్పుడు వచ్చిన తీర్పు న్యాయవ్యవస్థపై నా నమ్మకాన్ని మరింత పెంచింది. తప్పు చేస్తే మన న్యాయవ్యవస్థ కచ్చితంగా శిక్షిస్తుంది. ఏది ఏమైనా న్యాయం జరిగింది’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Must Read ;- రమ్య తరహా ఘటనల లెక్క ఇది