( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విద్యను ప్రవేశపెట్టాలని అత్యుత్సాహంతో ఉన్న ప్రభుత్వానికి కొద్దిరోజుల్లోనే విద్యార్థుల సత్తా ఎంతో తేలిపోనుంది. ఎవరు అంగీకరించినా అంగీకరించక పోయినా… అనేక పాఠశాలల్లో విద్యార్థులు తెలుగులో తప్పులు లేకుండా మూడు వాక్యాలు కూడా చదవలేని దుస్థితి ఉంది. మాతృ భాష తెలుగులో తప్పుల్లేకుండా చదవలేని విద్యార్థులతో ఆంగ్ల మాధ్యమంలో అన్ని సబ్జెక్టులు ఎలా కొనసాగిస్తారో ? ప్రభుత్వానికే తెలియాలి.
విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు..
పాఠశాల విద్యార్థుల్లో పఠనాసక్తి, నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం గురువారం నుంచి ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. చాలా మంది విద్యార్థులు కనీసం చదవడం, రాయడం రాకుండానే ఉన్నత తరగతుల్లోకి ప్రవేశం పొందుతుండటంతో వారిలో కనీస విద్యా సామర్థ్యాలు కరవవుతున్నాయి. ఎట్టకేలకు ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం 1 నుంచి 9 తరగతుల వారికి బేస్‌లైన్ పరీక్ష నిర్వహించి, ఫలితాల ఆధారంగా ప్రత్యేక శిక్షణ ప్రారంభిస్తారు. తద్వారా వారిలో పఠన, విశ్లేషణ సామర్థ్యాలు, సృజనాత్మకత పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పుస్తకాలను చదివించడం ద్వారా పాఠశాల విద్య అనంతరం జీవ, వృత్తి నైపుణ్యాలను సాధించే ఆస్కారం ఉంది.
డిసెంబర్ 7 వరకు ప్రత్యేక కార్యక్రమాలు
రోజుకో కార్యక్రమం చొప్పున పాఠశాలల్లో నిర్వహించేలా షెడ్యూలు ఖరారు చేశారు. అందులో భాగంగా గురువారం పాఠశాలలో పుస్తకాలను శుభ్రపరిచి, ఒక క్రమపద్ధతిలో అమర్చారు. శుక్రవారం తరగతులు, విద్యార్థుల స్థాయిని బట్టి పుస్తకాలను విభజించే కార్యక్రమం చేపట్టారు.28న పుస్తకాలను తరగతి గదుల్లో బోర్డుకు ఎడమ పక్కన కప్‌బోర్డులో లేదా అల్మారాలో పెట్టాలి. 30న గ్రామంలో ర్యాలీలు నిర్వహించి పుస్తకాలను సేకరించాలి. అలాగే పాఠశాల, గ్రామస్థాయుల్లో కథలు చెప్పేవాళ్లను, పఠన సామర్థ్యం గల వాలంటీర్లను, సెలవుల్లో సామాజిక పఠన కేంద్రాలను గుర్తించాలి. బేస్‌లైన్ పరీక్ష, గ్రంథాలయ కమిటీల ఏర్పాటు, 7న పఠన స్థాయిని బట్టి బాలలను విభజించి దత్తత తీసుకోవడం.. వంటి కార్యక్రమాలు దశలవారీగా పూర్తి చేయాలి.
ప్రత్యేక కమిటీ..
ప్రతి తరగతిలో ఇద్దరు బాలురు, మరో ఇద్దరు బాలికలతో గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేస్తారు. వీరి నుంచి తరగతిలోని విద్యార్థులందరూ పుస్త్తకాలు తీసుకోవాల్సి ఉంటుంది. బేస్‌లైన్ పరీక్ష ఆధారంగా విద్యార్థులను విభజించి వారి స్థాయిని బట్టి ఉపాధ్యాయులు పుస్తకాలను అందజేయాలి. తెలుగు, ఆంగ్ల పుస్తకాలను చదివేందుకు ప్రతిరోజూ రెండు( 3, 6) పీరియడ్లు కేటాయించాలి. ప్రతి శుక్రవారం ఆఖరి పీరియడ్‌లో మాత్రమే గ్రంథాలయ పుస్తకాలను ఇళ్లకు తీసుకెళ్లే సౌలభ్యం ఉంటుంది.
పుస్తకాలే కానుకలు..
విద్యార్థులు తమ జన్మదినం రోజున పాఠశాలకు పుస్తకాలను బహుమతిగా ఇచ్చే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. చాక్లెట్లు, కేకులు ఇతర వస్తువుల కన్నా పుస్తకం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని విద్యార్థులు సైతం గుర్తించే లాగా ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు.
గ్రామాల్లో భారీ సంఖ్యలో పుస్తకాలను సేకరించి పాఠశాల గ్రంథాలయాలను బలోపేతం చేయాలి. ఈ లక్ష్యాన్ని అనుకున్నట్టుగా ఉపాధ్యాయులు నెరవేర్చే గలిగితే… రానున్న రోజుల్లో విద్యార్థులకు భాషపై పట్టు వచ్చే అవకాశం ఉంటుంది.
Must Read ;- డేంజర్ బెల్స్ : పాఠశాలలపై కోవిడ్ పడగ











