(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
‘పదును చూసి దుక్కి దున్నాలి .. అదును చూసి రాజకీయాలు చేయాలి’ అనేది వెనుకటికో సామెత . అదును చూసి రాజకీయాలు చేయడంలో అత్యంత నేర్పరి .. అపర రాజకీయ చాణక్యుడు .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అని చెప్పడానికి ఎవరూ సందేహించరు. అటువంటి వ్యక్తి ఇప్పుడు విజయనగరం రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, ఒకే షాట్‌లో ఇద్దరు రాజకీయ ఉద్ధండులను మూలకు చేర్చే ప్రయత్నంలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
స్థిరమైన ఓటు బ్యాంకుతో ..
చారిత్రక ప్రసిద్ధి గాంచిన విజయనగరంలో పూసపాటి వంశీయులకు స్థిరమైన ఓటు బ్యాంకు ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఓటు బ్యాంకుతోనే పూసపాటి వంశీయుడైన అశోక్ గజపతి రాజు నాలుగు దశాబ్దాలుగా అప్రతిహతమైన రాజకీయ జీవితం కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీలో నెంబర్ -2 స్థాయికి ఎదుగగలిగారు అనేది నిస్సందేహం. వయస్సు పైబడటం, అనారోగ్యం ఆవరించటం తదితర కారణాల వల్ల తాను ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుని తన కుమార్తె అదితికి రాజకీయ వారసత్వం అందించే దిశగా ఆలోచిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.
Must Read :- మంటగలుస్తున్న ’మహారాజా‘ ప్రతిష్ట
రాజకీయ లౌక్యంతో ..
వేరొక పక్క అశోక్ గజపతిని రాజకీయంగా ధీటుగా ఎదుర్కోగలిగిన శక్తిమంతుడు, విజయనగరంలో అందరిచేత ‘అన్న” అనిపించుకునే రాజకీయ లౌక్యం తెలిసిన వ్యక్తి, ప్రస్తుత విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి కూడా వయసు మీరడం, శారీరక సమస్యల నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి తన రాజకీయ వారసురాలుగా కుమార్తె శ్రావణిని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
తెరపైకి సంచైత ..
జిల్లా కేంద్రమైన విజయనగరంలో పట్టు కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న బొత్స ఇదే అదునుగా చిరకాల రాజకీయ ప్రత్యర్థి పూసపాటి అశోక్ గజపతిరాజును, అత్యంత సన్నిహితుడు, ఒకే పార్టీలో, ఒకే చోట ఉంటున్న అంతర్గత రాజకీయ ప్రత్యర్ధి కోలగట్ల వీరభద్ర స్వామికి చెక్ పెట్టేందుకు విజయనగరం పూసపాటి వంశీయుల సంస్థాధీశురాలిగా సంచైత గజపతిరాజుని రంగంలోకి తెచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీయేతర రాజకీయానికి ఆమెను ఆయుధంగా చేసుకోవాలని వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
నాలుగు దశాబ్దాలుగా విజయనగరం రాజకీయాలను టీడీపీ ప్రభావితం చేయడానికి కారణం పూసపాటి వంశీయులేననేది నిర్వివాదాంశం. అశోక్ గజపతిరాజు చంద్రబాబుకు కుడి భుజంగా ఉంటూ విజయనగరం జిల్లాను తమ వైపు తిప్పుకోవడంలో కీలకపాత్ర వహించారనేది జగమెరిగిన సత్యం. ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్లి స్థానికంగా అశోక్ గజపతిని, తద్వారా చంద్రబాబును రాజకీయంగా అణగదొక్కే అవకాశం ఉందని చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో విజయనగరం నుంచి సంచైతను ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ తరఫున పోటీకి దించాలని ప్లాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి ముందస్తు ప్రణాళికగా ఆమెను విజయనగరం మాన్సాస్ ఛైర్ పర్సన్ గా నియమించినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఇదే నిజమైతే ‘బొత్స’ రాజకీయ వ్యూహం మరోమారు సక్సెస్ అవుతుందనే చర్చ జిల్లా వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Also Read :- పార్టీ తీరుపై నోరు జారుతున్న సొంత ఎమ్మెల్యేలు.. ఇరకాటంలో వైసీపీ











