రానా కథానాయకుడిగా ‘విరాటపర్వం‘ రూపొందుతోంది. వేణు ఉడుగుల ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సాయిపల్లవి ఒక కీలకమైన పాత్రలో నటించింది. ‘మహాభారతం’లో ‘విరాటపర్వం’ భాగానికి ఒక ప్రత్యేకత ఉంది. పాండవుల ‘అజ్ఞాతవాసం’ అధ్యాయం అది. ఈ సినిమాలో నక్సలైట్ నాయకుడైన రానా .. తన బృందంతో కలిసి అజ్ఞాతవాసంలో ఉంటూ, ఆశయసాధన దిశగా పోరాడే పాత్రను చేస్తున్నాడు. అందువలన ఈ సినిమాకి ‘విరాటపర్వం’ అనే టైటిల్ ను సెట్ చేశారు. ‘సంక్రాంతి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో రానా నక్సలైట్ నాయకుడిగానే కనిపిస్తున్నాడు. అతని చేయిపట్టుకుని సరదాగా కబుర్లు చెబుతూ నడుస్తూ సాయిపల్లవి కనిపిస్తోంది. ఈ ఫోటో సినిమాలో భాగమా? లేదంటే షూటింగు సమయంలో సరదాగా ‘క్లిక్’ మనిపించారో తెలియదుగానీ, ఆ స్టిల్ నే పోస్టర్ గా వదిలారు. మొత్తానికి ఈ స్టిల్ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర ఎలా ఉండనుందనే ఆసక్తి మాత్రం అభిమానులను వెంటాడుతూనే ఉంది. ఇటీవలే షూటింగు పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
తను ఇంతవరకూ చేసిన పాత్రలకు భిన్నంగా ఈ పాత్ర ఉంటుందని రానా చెబుతున్నాడు. ఈ సినిమాలోని తన పాత్ర తనకి మరింత మంచి పేరు తీసుకొస్తుందని సాయిపల్లవి అంటోంది. దాంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ప్రియమణి .. నివేదా పేతురాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా కోసం రానా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Must Read ;- పుట్టిన రోజు సందర్భంగా భార్యకు సర్ ప్రైజ్ ఇచ్చిన రానా