తెలుగు చిత్ర సీమకి సంబంధించిన పలువురు ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ ఇటీవల వార్తల్లో నిలిచిన సునీత బోయను పోలీసులు అరెస్టు చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనను లైంగికంగా వాడుకున్నాడంటూ ఆమె పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్యూలు ఇచ్చింది. దీంతో బన్నీ వాసు కూడా ఆమెపై చట్ట పరంగా చర్యకు ఉపక్రమించారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెపై విచారణ జరిపారు. ముఖ్యంగా సీఐడీ అధికారులు పలువురిని తమ కార్యాలయానికి పిలిపించి విచారించారు. ఆమె ఫోన్ నుంచి ఎవరికి కాల్ వెళ్లినా వారందరినీ సీఐడీ కార్యాలయానికి పిలిపించారు.
ఆమె మానసిక పరిస్థితిపై ఆరా తీశారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే ఈ రకమైన ఆరోపణలు చేస్తోందని నిర్దారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమెను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనందున ఎర్రగడ్డ మానసిక చిక్సిత్సాలయానికి తరలించి తగిన వైద్యం చేయించాల్సిందిగా తీర్పు ఇచ్చినట్లు సమాచారం. సునీత బోయ విషయంలో గతంలో కూడా ఇదే రీతిలో కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఆమెకు ఎర్రగడ్డ మానసిక చిక్సిత్సాలయంలో వైద్యం చేయించారు.
ఆ తర్వాత ఆమె కోలుకుందని విడుదల చేశారు. బయటికి వచ్చాక కూడా మళ్లీ ఇదే తరహా ఆరోపణలు చేయడంతో మళ్లీ పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చిందంటున్నారు. సునీత బోయను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్చి ఆమె కోలుకునేవరకూ ఆమెకు చికిత్స అందించాల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. రెండో సారి ఆమెకు ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స అందించాల్సి వస్తోంది.
ఆమె ఎందుకిలాంటి ఆరోపణలు చేస్తోంది?
సునీత బోయకు నిజంగానే మానసిక పరిస్థితి సరిగా లేదా? చాలా మందికి దీని మీద అనుమానాలు ఉన్నాయి. అన్ని ఇంటర్వ్యూలోనూ ఆమె మామూలుగానే మాట్లాడుతోంది. కాకపోతే కాస్త అతిగా స్పందిస్తోంది. అసలు ఆమె ఆరోపణల్లో నిజముందా లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరిపారా లేదా అన్నది కూడా తెలియడం లేదు. తన దగ్గర ఉన్న ఆధారాలన్నిటినీ మాయం చేశారని కూడా ఆమె ఆరోపిస్తోంది. ఈ విషయంలో పోలీసులు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఫోన్ నంబర్ నుంచి ఎవరికి కాల్ వెళ్లినా వారందరినీ పిలిపించి విచారించారు. అందులో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వారు కూడా ఉన్నారు.
సాధారణంగా ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు ఆమె మానసిక స్థితి సరిగా ఉందా లేదా అని ఎవరూ చూడరు. ఓ ఆడకూతరు ఆపదలో ఉందని వచ్చినప్పుడు స్పందించడం మీడియా సంస్థల ధర్మం. అలానే ఆమె ఇంటర్వ్యూలు చేసి ఉండొచ్చు. తరచూ ఇలా వార్తల్లో నిలిచి సెలబ్రిటీలు కావాలన్న ఆలోచనతోనూ కొందరు ఈ తరహా ఆరోపణలు చేసేవారూ ఉన్నారు. ఏదేమైనా సునీత విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన చందంగా ఉందంటున్నవారూ ఉన్నారు.
Must Read ;- శిల్ప భర్త వెబ్ చిత్రాల వెనక పెద్ద గబ్బు