ఇప్పటికే రెండు వేవ్ లతో పెను నష్టాన్ని మిగిల్చిన ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి శాంతించలేదు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని బలి తీసుకున్న ఈ వైరస్.. ఇప్పుడు థర్డ్ వేవ్ ను మొదలెట్టేసింది. అయితే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌ల అనుభవంతో కరోనా థర్డ్ వేవ్ ను మెరుగ్గానే నియంత్రించగలం అన్న భావన చాలా దేశాల్లో ఉంది. అయితే ఆ ధైర్యాన్ని పటాపంచలు చేస్తూ.. ఇప్పుడు పలు దేశాల్లో థర్డ్ వేవ్ పేరిట కరోనా వైరస్ తనదైన శైలి ప్రతాపాన్ని చూపుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా కూడా వణికిపోతోంది. ఇక మన దేశం విషయానికి వస్తే.. కరోనా సెకండ్ వేవ్ లో నమోదైన మాదిరి కేసులు ఇప్పుడు నమోదు కాకున్నా.. కేసుల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. రోజూ 35 వేల నుంచి 40 వేల మధ్యలో కొత్తగా కేసులు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కేసులు బాగా తగ్గిపోయినా.. ఏపీలో మాత్రం కొత్త కేసులు తగ్గుతూ,.. పెరుగుతూ పోతున్నాయి. మొత్తంగా కరోనా పట్ల ఏమాత్రం అజాగ్రత్త వహించినా వైరస్ మళ్లీ విరుచుకుపడటం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అక్టోబర్ లో విశ్వరూపమేనా?
ఇలాంటి నేపథ్యంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (ఎన్ఐడీఎం) సోమవారం నాడు హడలిపోయే వార్త చెప్పింది. కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైనా.. అక్టోబర్ నెలలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని సంచలన నివేదికను విడుదల చేసింది. ఏమాత్రం జాగ్రత్త లేకున్నా.. దేశాన్ని కరోనా థర్డ్ వేవ్ చుట్టేయడం ఖాయమని, ఈ నస్టం సెకండ్ వేవ్ లో నమోదైన దాని కంటే కొన్ని రెట్లు అధికంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా.. ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన డెల్టా వేరియంట్.. అక్టోబర్ నాటికి వివిధ రూపాలతో విరుచుకుపడే ప్రమాదం లేకపోలేదని డేంజర్ బెల్స్ మోగించింది. థర్డ్ వేవ్ విరుచుకుపడేందుకు ఇంకా నెల మాత్రమే వ్యవధి ఉందని, ఈలోగా వైరస్ ను నియంత్రించే దిశగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
పిల్లలపైనే అధిక ప్రభావం
ఇప్పటిదాకా విరుచుకుపడ్డ ఫస్ట్, సెకండ్ వేవ్ లు ప్రధానంగా పెద్దలపైనే ప్రభావం చూపగా.. ఇప్పుడు ముంచుకువస్తున్న థర్డ్ వేవ్ చిన్న పిల్లలనే లక్ష్యంగా చేసుకుని విలయం సృష్టించనుందని ఎన్ఐడీఎం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు సెకండ్ వేవ్ లో ఆక్సిజన్, ప్రత్యేక బెడ్ల ఏర్పాట్లు ఎలా అయితే జరిగాయో.. ఇప్పుడు చిన్న పిల్లలకు చికిత్స అందించేలా ఆసుపత్రుల్లో మార్పులు చేయాలని, చిన్న పిల్లలు ఒక్కసారిగా కరోనా బారిన పడితే.. తక్షణమే చికిత్స అందేలా అన్ని ఏర్పాట్లను ముందుగానే రెడీ చేసుకోవాల్సి ఉందని కూడా ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది.
Must Read ;- ఆరో వ్యాక్సిన్.. ఇక పిల్లలూ సేఫే!











