ఏపీలో జగన్ 2024 ఎన్నికల టీం ఏర్పాటుకు కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో లాగానే కొందరు సీనియర్లను సైతం పక్కన పెట్టనున్నట్లు సమాచారం. పార్టీ తరువాతనే ఎవరైనా అంటూ ఇప్పటికే జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కొందరు సీనియర్ మంత్రులకు సైతం ఉద్వాసన తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. కొత్త సమీకరణాలు పార్టీ కోసం పని చేస్తున్న వారిలో జోష్ నింపుతున్నాయి. మొత్తానికి జగన్ 2024 టీం సీనియర్లు, యూత్, ఫైర్ బ్రాండ్లతో కలగలిపిన కేబినెట్ కానుందన్న వార్తలొస్తున్నాయి.
రెండున్నరేళ్లు కావస్తుండటంతో..
కాగా, రెండున్నరేళ్ల పాలన తర్వాత కేబినెట్ ప్రక్షాళన తప్పదని స్వయంగా ఏపీ సీఎం జగన్ మొదట్లోనే వెల్లడించారు. ఈ సమయం సమీపిస్తున్న కొద్దీ మంత్రులు టెన్షన్ పడుతున్నారు. ఎవరెవరు పదవులు కోల్పోతారన్న దానిపై ఇప్పటికే పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు తమకేమి కాదన్న ధీమాలో ఉన్న కొందరు సీనియర్ మంత్రులు సైతం సీఎంకు అత్యంత సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారంతో ఆందోళన చెందుతున్నారు.
మోదీలాగా నేనా..
కేంద్ర కేబినెట్ విస్తరణలో మోదీ-షా ద్వయం ఎవరూ ఊహించని విధంగా చాలా మంది సీనియర్లను పక్కన పెట్టారు. గడ్కరీ, రాజ్ నాథ్ మాత్రమే సీనియర్లుగా ఉన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి, విద్యావేత్తలు, యువతకు ప్రాధాన్యమిచ్చి మోదీ 2024 టీంను సిధ్దం చేశారు. తాము లేకుంటే పార్టీ లేదు, ప్రభుత్వం లేదనే విధంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్న మంత్రులను మోదీ పక్కన పెట్టారంటున్నారు. జగన్ కూడ ఇదే విధంగా కేబినెట్‌లో మార్పులతో 2024 ఎన్నికల టీం సిద్ధం చేయనున్నట్లు సమాచారం.
దీంతో కొందరు సీనియర్ల పైనా వేటు తప్పదని భావిస్తున్నారు. మంత్రులుగా ఉన్న కొందరిని పార్టీ సేవలకు వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా పదవులు పొందని సీనియర్లు కొందరు మంత్రులుగా అవకాశం పొందనున్నారు. ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్న వారిలో ఇద్దరు సీనియర్లు మినహా మిగిలిన వారిని పార్టీ సేవలకు పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్ మంత్రి, రాయలసీమకు చెందిన మరో మంత్రి, దక్షిణ కోస్తాలోని మరో సీనియర్ మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి. వారి స్థానంలో అవకాశం దక్కని సీనియర్లకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.
నిఘా వర్గాల ద్వారా సమాచార సేకరణ
సీఎం జగన్ ఇప్పటికే 13 జిల్లాలకు సమన్వయ కర్తలను నియమించారు. వారే కాకుండా ఇన్‌ఛార్జి మంత్రులు కూడ ఉన్నారు. ప్రస్తుతం వారు పార్టీ కార్యక్రమాలు చూస్తున్నా క్షేత్ర స్థాయిలో పార్టీ వ్యవహారాలు మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదనే సమాచారం ముఖ్యమంత్రికి చేరింది. నిఘా వర్గాలు, సర్వే సంస్థల ద్వారా సీఎం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా మొత్తం కేబినెట్‌లో 18 మందిని మారుస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. వారి స్థానాల్లో పక్కాగా సామాజిక, ప్రాంతీయ సమీకరణాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంచనాలు మొదలయ్యాయి. అయితే, మహిళల సంఖ్య మాత్రం మూడు నుంచి నాలుగుకు పెరగనున్నట్లు తెలుస్తోంది.
ఎస్సీ వర్గంలో డిప్యూటీ సీఎం పదవి కోస్తాకు దక్కనుంది. సీమకు బీసీ కేటగిరీలో డిప్యూటీ సీఎం, ఉత్తరాంధ్రకు ఎస్టీ కేటగిరీలో, గోదావరి జిల్లాలకు కాపు కేటగిరీలో డిప్యూటీ సీఎం పదవులు కేటాయించనున్నట్లు సమాచారం. జగన్ తన తొలి కేబినెట్‌లో సామాజిక సమీకరణాలను పక్కాగా పాటించడంతో ఈ సారి కూడ అదే పాలసీ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. సొంత బాబాయ్ ఎస్వీ సుబ్బారెడ్డి రాజ్యసభ కోరినా పార్టీ వ్యవహారాలు చూడాలని జగన్ స్పష్టం చేశారని, తద్వారా పార్టీ తర్వాతనే ఎవరైనా అనే సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.
Must Read ;- ప్రజలకే కాదు.. నేతలకూ జగన్ ఝలక్!










