(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
మహా విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల్లో తొలిసారిగా అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఇది అధికార పార్టీ వ్యతిరేకతతో నమోదైన శాతమా.. లేక అభిమానంతో పెరిగిన శాతమా ఉన్నది ఆదివారం తేలనుంది. విశాఖ ఉక్కు ఉద్యమం నేపథ్యంలో గెలుపు తమదే అన్న ధీమా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. కాగా, ఊహించిన రేటు పెట్టి కొన్న ఓట్లు తమ ఖాతాలోనే పడతాయని అధికార పార్టీ అంచనా వేస్తోంది.
50 వార్డులు వస్తే చాలు..
మొత్తం 98 వార్డులకు గాను, 50 వార్డులు గెలుచుకున్న పార్టీకి మేయర్ పీఠం వసమవుతుంది. బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకూ నగర పరిధిలో 56.01 శాతం ఓటింగ్ నమోదైంది. కానీ అప్పటికే పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన ఓటర్లకు టోకెన్లు ఇచ్చి ఓటు సద్వినియోగం చేసే అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ శాతం 59.41 శాతంగా నమోదయింది. కానీ కొన్ని వార్డుల్లో అభ్యర్థులు ఆశించిన మేరకు పోలింగ్ నమోదు కాలేదు. భీమిలి నియోజకవర్గంలో అనేక వార్డుల్లో ఇదే పరిస్థితి కనిపించింది. గాజువాక నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెరిగినా ప్రతిష్టాత్మక వార్డులలో మాత్రం 50 శాతం కూడా నమోదు కాకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. తూర్పు, పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాల్లో పోలింగ్ సాధారణంగా నమోదయింది.
రూ.కోటిపైనే ఖర్చయినా..
అనూహ్యంగా స్థానిక ఎన్నికల్లో కోటి రూపాయలకు పైనే అభ్యర్థులకు ఖర్చు అయినా ప్రశాంతంగా గెలుపును ఆశించలేని పరిస్థితి ఈ ఎన్నికల్లో కనిపిస్తోంది. అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లకు డబ్బులు పంచడంతో.. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న వ్యత్యాసం రాకుండా పంపిణీ జరగటంతో ఓటర్ ఎవరిని ఆదరించాడు అన్న నాడి అభ్యర్థులకు చిక్కడం లేదు. పోలింగ్‌నకు రెండు రోజుల ముందు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చేసిన ప్రకటన అధికార పార్టీ అభ్యర్థులకు మైనస్‌గా మారింది. దానిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని చెప్పాలి. అనేక వార్డులలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేశారు. పార్టీ ఫండ్ విషయంలో అధికార పార్టీ అభ్యర్థులకు భారీగానే చేతికి రావడంతో పంపిణీకి ఏమాత్రం వెనకడుగు వేయలేదు. 2007లో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా పాతిక లక్షలు ఖర్చు చేసిన అభ్యర్థుల విజయం సునాయాసంగా పూర్తయింది. ఈ పర్యాయం చూస్తే… ఖర్చు కోటి దాటిన అంతా దేవుడిపైనే భారం వేయాల్సి వస్తోంది. అయితే ఈ వార్ వన్ సైడ్ గా జరుగుతుందని అధికార పార్టీ భావిస్తూ వచ్చినా… అనేక వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గట్టిపోటీని ఇచ్చినట్టు విశ్లేషకుల పరిశీలనలో తేలింది.
ఏడాది నుంచి పట్టు కోసం అభ్యర్థులు..
గత ఏడాది నామినేషన్ల ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి ఓటర్లను తమ ఆధీనంలో ఉంచుకునేందుకు అభ్యర్థులు చేయని ప్రయత్నాలు లేవు. అనూహ్యంగా ఎన్నికలు వాయిదా పడడంతో.. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత లేకపోవడంతో ఓటర్లు చేజారిపోకుండా పట్టు కోసం అభ్యర్థులు చాలానే ఖర్చు చేశారు. ఇక కరోనా వైరస్ కష్టకాలంలో ఓటర్ల ఇళ్లకు నిత్యావసర సరుకుల పంపిణీ పేరిట లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. ఆ ఖర్చు అంతా కలిపి తడిసి మోపెడు అయింది.
మేయర్ స్థానం చేజారితే..
విశాఖను పరిపాలనా రాజధానిగా అధికార పార్టీ ప్రకటించడంతో మేయర్ స్థానం దక్కించుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. “మీరు ఏం చేస్తారో తెలియదు.. విశాఖ మేయర్ స్థానం మన ఖాతాలో పడకుంటే.. విశాఖలో ఒక్క నాయకుడు కూడా భవిష్యత్తులో తిరగలేరు. ఎమ్మెల్యేలైనా మంత్రులైనా హోదాలు, పదవులు కోల్పోవాల్సిందే” అని ముఖ్య నేత ఆదేశాలు జారీ చేయడంతో వలంటీర్ల మొదలు… ఆర్‌పిలు, రెవెన్యూ, పోలీస్, జివిఎంసి ఇలా అన్ని వ్యవస్థలను ఏకం చేయడంలో అధికార పార్టీ సఫలమైందని చెప్పాలి. ఎవరి స్థాయిలో వారికి దక్షిణలు సమర్పించి ఎన్నికల క్రతువును తమకు అనుకూలంగా పూర్తి చేయడంలో నాయకులు విజయం సాధించారు. ఇంత చేసినా అంతిమంగా ఓటర్ల అభిప్రాయం ఎటువైపు ఉంది అన్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నారు. దీంతో కౌంటింగ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అప్పటివరకు గుళ్ళు, గోపురాలు తిరుగుతూ భగవంతుడు సేవలో తరిస్తున్నారు.
Must Read ;- విశాఖ స్టీల్, పోలవరంపై సెల్ప్ గోల్.. వైసీపీ పవర్ ఫుల్ డ్రామా