(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 5న తలపెట్టిన రాష్ట్ర బంద్ రోజున రాష్ట్ర ప్రభుత్వం రంగు బయట పడనుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ గత నెల ఆరవ తేదీ నుంచి అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని కొనసాగిస్తున్న ఉద్యోగులు ఉద్యమ తీవ్రతను దశల వారీగా పెంచుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ విజయవంతం కావాలంటే అందుకు ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం.
స్వచ్ఛంద బంద్‌కు సహకరిస్తారా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఆంధ్రుల సెంటిమెంట్‌ను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టబోమని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని, జేఏసీతో కలిసి కార్మికులకు అండగా నిలుస్తామని.. ఒక్కటేంటి ఎన్నో ప్రకటనలు చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు. అందులో భాగంగా పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దఫదఫాలుగా స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ నాయకులతో కమ్యూనిస్టు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తాము సాయశక్తులా ప్రయత్నిస్తామని ప్రకటించారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖ గురించి ప్రస్తావించని రోజంటూ లేదు. విశాఖ విమానాశ్రయంలో ట్రేడ్ యూనియన్ నాయకులతో గంటన్నరపాటు ముఖ్యమంత్రి చర్చలు జరిపి ‘ నేనున్నా’ అంటూ హామీ ఇచ్చారు. మరి అటువంటి రాష్ట్రప్రభుత్వం బంద్ విజయవంతం చేసేందుకు ఏ మేరకు సహకరిస్తుందో శుక్రవారం తేటతెల్లం కానుంది. ప్రభుత్వ కార్యాలయాలను, ఆర్టీసీ బస్సులను, ఇతర వ్యవస్థలను ఆరోజు నడవకుండా ప్రభుత్వం చేయగలిగితే బంద్ సంపూర్ణం అవుతుంది. బంద్ ఎంత విజయవంతం అయితే.. ఆంధ్రుల సెంటిమెంట్ అంత బలంగా కేంద్రానికి చేరుతుంది. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తుందా? లేక కార్మికుల తరఫున నిలుస్తుందా అన్నది తేలిపోనుంది.
స్పందించని కేంద్రం..
రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఎన్ని రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. పైగా పరిశ్రమ బిడ్డింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రాబోయే రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా కమిటీని నియమించింది. దీంతో కార్మిక సంఘాలు ఉద్యమ తీవ్రతను మరో స్థాయికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. మార్చి 5న బంద్ నిర్వహించాలని అందుకు ప్రజలు, అన్ని వర్గాలు సహకరించాలని కమిటీ సభ్యులు అన్ని వర్గాల మద్దతును కూడగడుతున్నారు. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇతర పరిశ్రమలలాగే చూస్తోందని, దానిని కాపాడుకునేందుకు ఎంతటి త్యాగాల కైనా సిద్ధమని, పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖులంతా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు.
వైఎస్సార్సీపీ నేతలు రోడ్లపైనే ఉంటారా?
అధికార పార్టీ వైఎస్ఆర్సీపి నేతల మనసుల్లో ఈ ఏముందో తెలియదు కానీ.. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు పదే పదే చెబుతున్నారు. అదేవిధంగా ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్రను రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కూర్మన్నపాలెం జంక్షన్ వరకు నిర్వహించారు. అయితే ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారా? లేక ప్రజల పక్షాన నిలబడి ముందుకు వెళ్తున్నారా అన్నది బంద్ రోజున స్పష్టం కానుంది. సాధారణంగా బంద్ రోజున తెరిచే దుకాణాలను మూసి వేయించడం, రవాణా వాహనాలు రోడ్లపై తిరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు పని చేయకుండా ఆందోళనలు నిర్వహించడం, ఈ క్రమంలో రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాలు చేయడం బంద్ విజయవంతం కావడంలో కీలకంగా మారుతాయి. బంద్ లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ఎంతమంది ముందుకు వస్తారు అన్న విషయాన్ని పక్కన పెడితే, బలవంతపు చర్యలు సర్వసాధారణం.
ఎన్నికల క్యాంపెయిన్‌గా..
కాగా విజయసాయిరెడ్డి చేసిన పాదయాత్ర ఎన్నికల క్యాంపెయిన్‌గా నిలిచిందని అనేక విమర్శలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ, ప్రతిపక్షంపై విమర్శలు చేస్తూ సాగిన పాదయాత్ర , బహిరంగ సభ ఈ వాదనకు బలం చేకూర్చింది. మరి అటువంటి డ్రామాలే బంద్ రోజున ఆడతారా లేక చిత్తశుద్ధితో బందుకు సహకరిస్తారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు విశాఖలో ప్రారంభమైన ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగించాలని పిలుపునిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోనూ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
బంద్ విజయవంతమైతే..
ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే రవాణా వాహనాలు నిలిచిపోతే.. ఆ ప్రభావం ఇతర రాష్ట్రాలపైనా పడుతుంది. ఈ ఉద్యమం గురించి ఇతర రాష్ట్రాల్లోనూ చర్చ మొదలవుతుంది. అక్కడి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశంపైన ఆందోళనలు తీవ్రతరం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. వేలాది ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు ఎక్కడికక్కడ ఆగితే ఉద్యమ సెగ కేంద్ర ప్రభుత్వాన్ని తాకుతుంది అనడంలో సందేహం లేదు. ఇక ఆర్థికపరంగా రాష్ట్రానికి నష్టం వాటిల్లే అవకాశం ఉన్నప్పటికీ, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే గాని విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునే పరిస్థితులు కనిపించడం లేదు.
బీజేపీ రోజుకో ప్రకటన..
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూనే, ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తమ వంతు ప్రయత్నిస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రైవేటీకరణ అంత సులభం కాదని స్పష్టం చేశారు. సోమ, మంగళ వారాల్లో విశాఖలో పర్యటించిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రెండు విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ వచ్చారు. ప్రైవేటీకరణ వల్ల స్టీల్ ప్లాంట్ బాగుపడుతుందని, ఆ సంస్థ మనుగడ కోసమే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. మరుసటి రోజే మరో వ్యాఖ్య చేశారు. ప్రైవేటీకరణ అంత త్వరగా అయ్యే ప్రక్రియ కాదని, స్టీల్ ప్లాంట్ కంటే ముందుగా మరో 34 సంస్థలను ప్రైవేటీకరించాల్సి ఉందని, అది పూర్తయ్యాక స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించాల్సి ఉంటుందని సెలవిచ్చారు. తెలుగుదేశం, వైఎస్సార్సీపి నాయకులు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో బీజేపీ పై ప్రజల్లో పూర్తిగా విశ్వాసం సన్నగిల్లింది.
Must Read : ఆందోళనలు చేస్తున్నా.. విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం