( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించారు. ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, తమ నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించడమే కాకుండా అమలు చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరి అంత దమ్మున్న ప్రభుత్వం ఇప్పటి వరకు విశాఖ మేయర్ అభ్యర్థి పేరును కూడా ప్రకటించలేని నిస్సహాయ స్థితికి కారణం ఏంటన్నది విశ్లేషకులకు సైతం అంతుచిక్కడం లేదు.
బీసీ జనరల్‌కు కేటాయింపు..
విశాఖ మేయర్ స్థానం బిసి జనరల్‌కు రిజర్వేషన్ ఖరారయింది. దీంతో ఆశావహులైన అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీలు జల్లెడ పడితే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు క్లీన్ చిట్ ఉన్న అభ్యర్థులు తెరపైకి వచ్చారు. వారిలో ఒకరిని ఖరారు చేస్తూ పీలా శ్రీనివాస్ పేరును ఐదు రోజుల క్రితమే పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాతో పాటు విడుదల చేశారు. అనంతరం శుక్రవారం చంద్రబాబు రోడ్ షోలో బహిరంగంగా ప్రకటించారు. సాధారణంగా తెలుగుదేశం పార్టీకి బీసీల మద్దతు అధికంగా ఉంటుంది. దీంతో ఆశావహుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉన్నప్పటికీ, ఎటువంటి మచ్చ, అవినీతి ఆరోపణలు లేని వ్యక్తులతో కూడిన జాబితాను చంద్రబాబు పరిశీలించి తుది నిర్ణయం ప్రకటించారు.
Also Read ;- వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే కుక్కలు, గాడిదలపైనా పన్ను: చంద్రబాబు
వైసీపీకి ఎందుకంత భయం..
సాధారణంగా రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటన విషయంలో ఎదుటి పార్టీ ప్రకటించే అభ్యర్థి పేరు, అతని బలాలు, బలహీనతలు ఆధారంగా ప్రత్యర్థిని బరిలోకి దింపుతూ ఉంటారు. మరి టీడీపీ తన అభ్యర్థిని ఐదు రోజుల క్రితమే ఖరారు చేసినప్పటికీ శనివారం వరకు వైసీపీ తమ మేయర్ అభ్యర్థి పేరును ప్రకటించ లేకపోవడం వెనుక అంతర్గత కలహాలు హెచ్చుమీరుతాయని ఆందోళన చెందుతూ ఉండవచ్చని, అది పరోక్షంగా టీడీపీకి లబ్ధి చేకూరుస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
క్యారెక్టర్ ఉన్న వ్యక్తి దొరకలేదా?
ప్రస్తుతం పోటీకి సిద్ధపడుతున్న అభ్యర్థుల్లో టిడీపి మేయర్ అభ్యర్ధి అంత మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి వైసీపీకి దొరకలేదని చెబుతున్నారు.30 ఏళ్లుగా ఒకే పార్టీలో కొనసాగిన సీనియారిటీ, సౌమ్యుడు, వివాదరహితుడిగా ఉన్న ఇలాంటి వ్యక్తి వైసీపీలో లేకపోవడం వెలితిగా ఆ పార్టీ భావిస్తున్నట్టు టీడీపీ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సీనియర్ నేతలకు అవకాశం దక్కుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఉన్నత విద్యనభ్యసించిన బీసీ మహిళను ఆస్థానంలో కూర్చోబెట్టాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వంశీకృష్ణ పేరు విస్తృతంగా ప్రచారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ కన్నా ముందుగా 98 వార్డులకు కార్పొరేటర్ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం, మేయర్ అభ్యర్థి పేరు ప్రకటించడంలో మాత్రం జాప్యం చేస్తోంది.
ప్రధానంగా 21 వ వార్డు అభ్యర్థి సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, పెందుర్తి ప్రాంతానికి చెందిన శరగడం చిన అప్పలనాయుడు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వంశీకృష్ణ పేర్లు కూడా ఈ రేసులో ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ మహిళా నేతకే ఈ అవకాశం దక్కితే, తొమ్మిదో వార్డు నుంచి పోటీ చేస్తున్న వెంకటరత్నం స్వాతితో పాటు, 12వ వార్డు నుంచి పోటీ చేస్తున్న రోహిణి, 75వ వార్డు నుంచి పోటీ చేస్తున్న తిప్పల జ్వాల పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. పోలింగ్‌కు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో శనివారం సాయంత్రానికి వైసీపీ మేయర్ అభ్యర్థి ఎవరన్నది స్పష్టమవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా అభ్యర్థి పేరు ప్రకటిస్తే, రెబల్స్, అసంతృప్తుల వల్ల లేనిపోని తలనొప్పులు వస్తాయని, తెలుగుదేశం పార్టీలో ఉన్నంత క్రమశిక్షణ వైసీపీలో లేకపోవడమే ఈ జాప్యానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Must Read ;- టీడీపీ దూకుడు, వైసీపీలో తడబాటు.. హాట్ హాట్‌గా విజయవాడలో ఎన్నికల ప్రచారం