( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ మేయర్ బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తులు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా జరగనున్న గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు రెండు ప్రధాన పార్టీలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపి కన్నా ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అడుగు ముందు ఉంది. అధికార పార్టీలో ఆ పదవిని ఆశించే వారి సంఖ్య చాంతాడంత ఉండడంతో ఎందుకొచ్చిన తలనొప్పి అని ఆ పార్టీ నేతలు ఎవరి పేరును తెరపైకి తీసుకు రావడం లేదు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఖరారు చేసే ప్రక్రియను ముమ్మరం చేసింది.
నలుగురి అభిప్రాయాల సేకరణ
తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిపై, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్‌ఛార్జి నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో దసపల్ల హోటల్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. మేయర్ అభ్యర్ధిత్వాన్ని ఆశిస్తున్న పీలా శ్రీనివాస్, గండి బాబ్జి, కాకి గోవింద్ రెడ్డి, మహమ్మద్ నజీర్ ల అభిప్రాయాలను అచ్చెన్నాయుడు అడిగి తెలుసుకున్నారు. వీరి నలుగురు పేర్లను చంద్రబాబు నాయుడుకి పంపి ఒకటి, రెండు రోజులలో మేయర్ అభ్యర్దిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే వీరితో పాటు మరికొందరు రేసులోకి వచ్చే అవకాశం ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.
Must Read ;- విజయవాడ టీడీపీలో రచ్చ కెక్కిన విభేదాలు.. అరికట్టక పోతే దిగులే











