విజయవాడ, గుంటూరు నగరాల పరిధిలో రాజధాని సెంటిమెంట్ బలంగా ఉంది. అక్కడ వైసీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అధికార పార్టీ సరికొత్త వ్యూహానికి తెరలేపింది. అందులో భాగంగానే విజయవాడలో ఎంఐఎం ఎంట్రీ ఇచ్చిందనే చర్చ తాజాగా ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది. విజయవాడ, కర్నూలు కార్పొరేషన్లు, ప్రొద్దుటూరు మున్సిపాల్టీలో ఎంఐఎం నామినేషన్లు దాఖలు చేసింది. కాగా శుక్రవారం ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కర్నూలులో పర్యటించి తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. హిందూపురంలోనూ ఆ పార్టీముఖ్యులు పర్యటించి ప్రచారం చేయనున్నారు. గతంలోనూ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసినా.. స్వయంగా ఓ ఎమ్మెల్యే వచ్చి ప్రచారం చేయడం ఇటీవలి కాలంలో జరగలేదు. విజయవాడలోని 50, 54 డివిజన్లలో ఎంఐఎం అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వారి తరఫున నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. ముస్లిం ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో మైనార్టీ వర్గాల ప్రాబల్యం
విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో మైనార్టీ వర్గాల ప్రాబల్యం ఉంటుంది. గతంలోనూ ఉంది. అయితే ఈ స్థాయి ఎంట్రీ ఎప్పుడూ జరగలేదు. ఉమ్మడి ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పొత్తుల కారణంగా హైదరాబాద్, ఆదిలాబాద్‌తోపాటు కొన్ని ఎంపీ స్థానాల పరిధిలోనే పరిమితమైంది. రాష్ట్ర విభజన తరువాత కూడా ఏపీలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఈ సారి ఎంట్రీ ఇచ్చింది. అందులోనూ వైసీపీకి ఏకగ్రీవాలు ఎక్కువగా లేని చోట్ల, హోరాహోరీ పోరు ఉన్న చోట్ల ఎంఐఎం పోటీ చేయడం, వైసీపీ శ్రేణులు నోరు మెదకపోవడంపైనా చర్చ నడుస్తోంది.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కు మద్దతు
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చంద్రబాబుని డైరెక్ట్‌గా టార్గెట్ చేశారు. ఆయన కూడా రిటర్న్ గిప్ట్ ఇస్తామని చెప్పారు. జగన్‌కు మద్దతు ప్రకటించారు. వైసీపీకి ఓటు వేయాలని తమ వర్గానికి సూచించారు. అప్పటి నుంచి వైసీపీతో స్నేహంగానే ఉంటున్నారు. అలాంటిది ఇప్పుడు ఏపీలో ఎంట్రీ వెనుక కేవలం టీడీపీని ఓడించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. విజయవాడలో రాజకీయంగా వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి ఉంది. అమరావతి ప్రభావం విజయవాడ, గుంటూరు తదితర నగరాలపై గణనీయంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి తన పార్టీ ఓటు బ్యాంకు తప్ప ఇతర వర్గాలు, తటస్తులు ఓటు వేసే పరిస్థితి లేదన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ ఓట్లు చీల్చితే తమకు విజయం సులువు అవుతుందనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా ఎంఐఎంని రంగంలోకి దింపినట్టు చర్చ నడుస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో CAAకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఓవైసీ విజయవాడలో సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు.
కీలక ప్రాంతాలు వదిలేసి..
తెలంగాణలో హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఏపీలో గుంటూరు, కడప, కర్నూలు ఎంపీ స్థానాల పరిధిలో ఎంఐఎం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండేది. గతంలో ఆయా చోట్ల ఆ పార్టీ పోటీ కూడా చేసింది. హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తోపాటు పలుచోట్ల పోటీకూడా చేసింది. అయితే రాష్ట్ర విభజన తరువాత ఏపీలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఆ పార్టీకి కొద్దోగొప్పో ఓటు బ్యాంకు ఉన్న కర్నూలు, కడప పార్లమెంటు పరిధిలోని కొన్ని స్థానాలను వదిలేసి కర్నూలు నగరానికే పరిమితం కావడం, విజయవాడలో పోటీ దిగడం ఏంటనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. వైసీపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్న చోట మాత్రమే ఆ పార్టీ బరిలోకి దిగి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి..తద్వారా వైసీపీకి లబ్ధిచేకూర్చే కార్యక్రమమే అనే విమర్శలూ వస్తున్నాయి.
Must Read ;- ఏపీ డిప్యూటీ సీఎం మామ.. వైసీపీకి రాజీనామా!