ఉద్యోగుల పని వేళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెచ్చింది. ప్రస్తుతం ఉన్న వారానికి 5రోజుల పనిదినాలను 4కి కుదించే ఐచ్చిక అంశాన్ని కంపెనీలకు వదిలేస్తూ చట్టం తేనుంది. అయితే నిబంధనల ప్రకారం పనిగంటలు 48కి తగ్గకుండా కంపెనీలు నిబంధనల్లో మార్పులు చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఈ ప్రకారం చూస్తే ఐదురోజుల పనిదినాలకు 9.6గంటల సగటు పని వేళలు ఉండగా నాలుగురోజుల పనిదినాలకు గాను రోజుకు 12గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. చాలా కంపెనీలు 4రోజుల పనిదినాలకు అంగీకరించాయని, కొన్ని కంపెనీలు మాత్రం 5రోజుల పనిదినాలు కోరాయని, ఈ విషయంలో చట్టాల్లో మార్పులు తెస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ప్రకటించారు.
ఈ నిర్ణయం వెనుక..
కాగా కేంద్రం తీసుకున్న నిర్ణయానికి పలు అంశాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. యువత తక్కువగా ఉండి జనాభా తగ్గుదల ప్రమాదకర స్థాయికి పడిపోయిన జపాన్‌లోని పరిస్థితిని పలు దేశాలు గమనించాయి. పండుగ రోజులు, జాతీయ దినోత్సవాలకు అక్కడ సెలవులు పెట్టకుండా రెట్టింపు పనిచేసే విధానం ఉంది. అదే సమయంలో ఉద్యోగులు ఎక్కువ ఆదాయం కోసం ఆరోగ్య సమస్యలను గమనించకుండా ఎక్కువ పనిచేస్తుండడంతో ఉద్యోగుల్లో 30శాతం ప్రొడక్టివిటీ తగ్గుతోందని తేలింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. 2019లో జపాన్‌లో వారానికి నాలుగు రోజుల విధానాన్ని అమలు చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల్లో ప్రొడక్టివిటీ 40 శాతం పెరిగిందని తేలింది. మూడు రోజులు కుటుంబంతో గడపడంతో ఉద్యోగుల్లో ఉల్లాసం నెలకొందని, మిగతా నాలుగు రోజులు ఉత్సాహంతో పనిచేశారని తేల్చింది. కేవలం నాలుగు రోజులే పని దినాల కారణంగా కార్యాలయాల నిర్వహణ (ఉద్యోగులకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలైన తాగునీరు, ఏసీ, లైటింగ్, స్నాక్స్, టీలాంటివి), విద్యుత్తు ఛార్జీల భారం కూడా తగ్గిందని పేర్కొంది.
జర్మనీలో కార్మిక సంఘాలు..
కార్మిక హక్కుల కోసం పోరాడే జర్మనీలోని అతిపెద్ద కార్మిక సంఘం ఐజీమెటాల్ కూడా ఇప్పటికే ఆ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. దీంతోపాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదిక ప్రకారం నాలుగు రోజుల పని విధానం అమలైలే మొత్తం టర్నోవర్‌లో 2 శాతం ఆదా అవుతుందని తేల్చింది.
ఇబ్బందులూ ఉన్నాయి..
దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్నవారి పనివేళలు, పనిదినాలు వేర్వేరుగా ఉంటాయి. సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్ రంగాల పరిస్థితితో పోల్చితే.. ఉత్పత్తి రంగం, అసంఘటిత రంగం కూడా దేశంలో ప్రధానమైనవే. ఈ నేపథ్యంలో 4రోజుల పనిదినాల విధానం అమలైతే..ఇతర రంగాల ఉద్యోగులపైనా ప్రభావం చూపుతోంది. నాలుగు రోజుల పనితో వినియోగదారుల అంచనాలకు తగినట్టుగా అవుట్‌పుట్ రాని పక్షంగా కంపెనీలపై ప్రభావం చూపుతుందని చెప్పేవారూ ఉన్నారు. ఇక నాలుగు రోజుల పనిదినాలు అమలైతే అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ ప్రమాణాల అమలు సాధ్యం అవుతుందని చెప్పేవారూ ఉన్నారు.
హక్కులు ఉంటాయా..
ఇక ఇదే అంశంపై మరో అభిప్రాయం కూడా కార్మిక సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. జపాన్ లాంటి చోట్ల కార్మిక హక్కుల పోరాటాన్ని, మన దేశంలో కార్మిక హక్కుల పోరాటాన్ని పోల్చలేమని చెబుతున్నారు. అక్కడి పని విధానం వేరని, ఇక్కడి పని విధానం వేరని చెబుతున్నారు. జపాన్‌లో ఉద్యోగుల హక్కుల విషయంలో కంపెనీల కంటే..ప్రభుత్వమే కఠినమైన నిబంధనలను రూపొందించిందని, అంతా వాటికి లోబడి పనిచేయాలని చెబుతున్నారు. ఎవరైనా ఉద్యోగి లేదా కార్మికుడు కంపెనీ నుంచి మానేసిన తరవాత.. వేరే చోట చేరాలంటే.. సదరు పాత కంపెనీ క్లియరెన్స్ ఇవ్వాలనే నిబంధన ఉంది. మన దేశంలో ఇది చాలాచోట్ల సాధ్యం కాదని, సాఫ్ట్ వేర్ కంపెనీల నెట్ వర్క్ ఉంది కాబట్టి వాళ్లకు ఇది సాధ్యం అవుతుందని, మిగతా రంగాల్లో చాలా చోట్ల ఈ పరిస్థితి ఉండదని చెబుతున్నారు. నాలుగు రోజుల పని విధానం అమలైతే..ఉద్యోగులతో పాటు కంపెనీలకు కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయని, అందులో ప్రధానమైనది సమ్మెకాలానికి నోటీసులతో పాటు ఉద్యోగం మానేయాలనుకునే వ్యక్తి కంపెనీకి ఇవ్వాల్సిన నోటీసుల సమయం ముఖ్యమని చెబుతున్నారు. అయితే కేంద్రం ఇంకా దీనిపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ విధానం అమలు కావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం
Must Read ;- అగ్రిమెంట్‌తో పోస్కో ఎంటర్.. 2019 నుంచే ‘విశాఖ ఉక్కు’పై స్కెచ్..