యువత ఎన్నో ఆశలతో.. మరెన్నో ఆశయాలతో ఏదో చేద్దామని, ఇంకేదో సాధిద్ధామనుకొని రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్నారు. కానీ ఇక్కడ ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల మధ్య ఇమడలేక అర్ధాంతరంగా వారు తనువు చాలిస్తున్నారు. ఇలాంటి విషాదకరమైన ఘటనే ఒకటి రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కాశగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఓ 27 ఏళ్ల యువ సర్పంచి తన గ్రామాన్ని అభివృద్ధి చేసి మంచిగా తీర్చిదిద్దాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా అభివృద్ధి పనులను గ్రామంలో మొదలు శ్రీకారం చుట్టాడు. రూ.25 లక్షల ప్రోత్సాహక నిధులు వస్తాయన్న ధీమాతో పనులను మొదలు పెట్టాడు. బిల్లులు మంజూరు కాలేదు. నిధులు రాలేదు. ఆర్థిక ఇబ్బందులు తన మెడకు చుట్టుకోవడంతో ఆ యువ సర్పంచి అర్ధాంతరంగా తనువు చాలించాడు.
తెలిసిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని కాశగూడెం 2019లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఎన్నికలు నిర్వహించకుండా గ్రామస్తులందరూ షేక్ అజారుద్ధీన్(27)ను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పట్లో రూ.15 లక్షల ప్రోత్సాహక నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలుసుకుని ఆ నిధులు వస్తాయన్న ధీమాతో ఆ యువ సర్పంచి అప్పుచేసి గ్రామంలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాడు. డంపింగ్ యార్డు, నర్సరీ, శ్మశానవాటిక, మజీద్ అభివృద్ధి ఇతర పనులు శ్రీకారం చుట్టాడు. అంతకు ముందు కూలి పని చేసుకుని కుటుంబాన్ని అతను పోషించుకునేవాడు. సర్పంచిగా ఎన్నికయ్యాక తనకు ఉపాధి కరువైంది. దీంతో అతనికి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఇటు ఉపాధి లేక అటు ఖర్చు పెట్టిన నిధులు రాక ఇబ్బందులకు గురయ్యాడు. దీనికి తోడు భార్యభర్తల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. గురువారం కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆర్ధిక కష్టాలు, ఇంట్లో తగాదాలు కారణంగా మనస్తాపం చెందిన అజారుద్ధీన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అజారుద్ధీన్‌కు భార్య ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఫాతిమా, రసూల్ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నో ఆశయాలతో గ్రామ సర్పంచిగా సేవలందించాలనుకున్న అజారుద్ధీన్ ఇలా తనువు చాలించడం ఆ గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. గ్రామాల అభివృద్ధి పనులకు వచ్చే నిధులను పంది కొక్కులా మింగే వారిని మనం చూశాం. కానీ ఇలా తన దగ్గర లేకున్నా కానీ గ్రామం అభివృద్ధి కోసం అప్పు చేసి నిధులను తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకునే అజారుద్ధీన్ లాంటి యువ సర్పంచిలు చాలా అరుదుగా ఉంటారు.