జస్టిస్ ఎన్వీ రమణతో పాటు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై ఫిర్యాదులు చేస్తూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా రాసిన లేఖను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు బుధవారమే అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీం కోర్టు ఎన్వీ రమణ లపై అనేక రకాల ఆరోపణలతో ముఖ్యమంత్రి గత ఏడాది అక్టోబరు 6వ తేదీన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బోబ్డేకు లేఖ రాశారు. ‘ఆ లేఖను అంతర్గత నిబంధనల ప్రకారం పూర్తిగా పరిశీలించామని, డిస్మిస్ చేశామని’ సుప్రీం కోర్టు అధికారికంగా ప్రకటించింది.
ఇది తాజాగా జరిగిన వ్యవహారం. అయితే.. న్యాయమూర్తులమీద వ్యక్తిగతంగా కక్ష కట్టినట్టుగా.. వారిని అపప్రధ పాల్జేయడమే లక్ష్యం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి.. ఈ లేఖను బనాయించిన తీరు ఉన్నదంటూ అప్పట్లో అనేకానేక విమర్శలు వచ్చాయి. న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై ప్రజల్లో సందేహాలు రేకెత్తించడం ద్వారా జగన్ తాను అనుచితంగా లబ్ధి పొందాలని అనుకుంటున్నట్టుగా కూడా విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు ఊతం ఇచ్చేలా.. జగన్ తరఫున.. సలహాదారు అజేయకల్లం.. ఈ లేఖ ప్రతిని ప్రెస్ మీట్ పెట్టి మరీ.. మీడియాకు విడుదల చేశారు. న్యాయమూర్తులపై, వారి అవినీతి ఆరోపణలపై ప్రజలందరూ చర్చించుకునే అవకాశం కల్పించారు.
ఇప్పుడు జగన్ ఫిర్యాదు డిస్మిస్ కావడం.. అప్పట్లో ఆయన ఫిర్యాదును అనుచరులే బయల్పరచడం.. రెండు అంశాలను సమన్వయం చేసుకుని చూసినప్పుడు.. జగన్ కోటరీ ఉద్దేశపూర్వకంగానే.. ఆ లేఖను బయటపెట్టారని అనిపిస్తోంది.
న్యాయమూర్తుల మీద తాము చేసిన నిరాధార ఆరోపణలు విచారణకు, పరిశీలనకు నిలబడేవి కాదని జగన్‌కు ముందే తెలుసు. తాను చేసిన ఫిర్యాదు.. పరిశీలన అనంతరం ఇప్పుడు డిస్మిస్ అయినట్టే.. బుట్ట దాఖలు అవుతుందే తప్ప.. దానివలన మరో ప్రయోజనం ఈడేరదని ఆయనకు ముందే తెలుసు అని పలువురు విశ్లేషిస్తున్నారు. తన ఫిర్యాదుతో ఒరిగేదేమీ లేదు గనుకనే.. కనీసం న్యాయమూర్తుల మీద వీలైనంత బురద చల్లే ఉద్దేశంతోనే లేఖను బహిరంగ పరచారనే వాదన కూడా వినిపిస్తోంది.
ఇప్పుడు డిస్మిస్ చేసిన తర్వాత కూడా సుప్రీం కోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ‘లేఖలో పరిశీలించే అంశాలన్నీ గోప్యమైనవి అయినందున వాటిని బహిర్గతం చేయడంలేదు’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇది ఇలా జరుగుతుందని జగన్‌కు ముందే తెలుసా అనే అభిప్రాయం కూడా పలువురిలో వ్యక్తం అవుతోంది.
ఎందుకంటే.. న్యాయమూర్తుల మీద ఫిర్యాదు వచ్చినా… టీవీ డిబేట్ లాగా ఓపెన్ గా ఎంక్వయిరీ జరగదు. తను లేఖలో చేసిన ఆరోపణలు నిరాధారాలు గనుక.. అది నిలబడదని జగన్ కు ముందే తెలుసు. ఇప్పుడు అలాగే జరిగింది. ఇలా జరుగుతుంది గనుకనే.. దాన్ని ప్రెస్ కు ఇవ్వడం ద్వారా.. న్యాయమూర్తుల మీద తాను అనుకున్నంతగా బురద చల్లేయడం కోసమే జగన్ అలా చేశారనే వాదన వస్తోంది. ఫిర్యాదు లేఖ డిస్మిస్ అయిపోయింది. కానీ.. ఆ లేఖ ద్వారా.. వారి మీద బురద చల్లాలని ఏ లక్ష్యాన్నయితే జగన్ పెట్టుకున్నారో.. ఆ లక్ష్యం నెరవేరిపోయింది.
అందుకే.. ఇలా లేఖను లీక్ చేసినందుకు గాను.. జగన్ మీద, ఆయన సలహాదారు అజేయకల్లం మీద చర్యలు తీసుకోవాలని అప్పట్లో అనేక మంది న్యాయనిపుణులు గట్టిగానే డిమాండ్ చేశారు. నిజానికి అప్పటినుంచి (ఆ ప్రెస్ మీట్ తర్వాత) అజేయకల్లం బయట ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు లేఖ కూడా డిస్మిస్ అయిన తర్వాత.. గోప్యంగా ఉండవలసిన లేఖను బహిరంగ పరచిన నేరానికి… సుప్రీం కోర్టు వారి మీద ఎలాంటి చర్యలకైనా ఉపక్రమిస్తుందో లేదో చూడాలి.
Must Read ;- జగన్ ఎంత విషం కక్కినా.. ఆయన ‘సుప్రీం’ హీరోనే!