ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో గెలవడం కోసం జగన్ మోహన్ రెడ్డి పన్నిన కుయుక్తులకు అడ్డుకట్ట పడింది. ఎన్నికల సంఘం ఈ విషయంలో జోక్యం చేసుకొని వైసీపీకి గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తనకు ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అందుకోసం జీవో ఇచ్చి మరీ.. టీచర్లకు బోధనేతర విధులను అప్పగించబోమని చెప్పారు. టీచర్లకు అనవసర బాధ్యతలు అప్పజెప్పడం వల్ల వారు ఒత్తిడికి లోనవుతున్నారని సుద్దులు పలికారు. అందుకే ఎన్నికల విధుల బాధ్యతల నుంచి ఉపాధ్యాయులను తప్పిస్తే వారు బోధనపై ఫోకస్ చేయగలుగుతారని జగన్ ప్రభుత్వ పెద్దలు అప్పుడు చెప్పారు.
ఎన్నికల విధుల కోసం టీచర్ల స్థానంలో సచివాలయ సిబ్బందిని వాడుకోవాలని ప్రభుత్వం భావించింది. వారైతే ఎన్నికల్లో తమకు లబ్ధి కలిగేలా చూసి చూడనట్లు వ్యవహరిస్తారని ప్రభుత్వ దురుద్దేశం. ఇలా జగన్ రెడ్డి చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలకు ఈసీ అడ్డుకట్ట వేసింది. టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాల్సిందేనని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. దీంతో టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రారంభించారు. ఆయన ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను ఇప్పటికే జిల్లా విద్యాధికారులు సేకరిస్తున్నారు. ఈ వివరాలను నేడు ఎన్నికల ప్రధాన అధికారికి పంపారు.
ఇటీవల కేంద్ర ఎన్నికల అధికారులతో జరిగిన భేటీలో ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని సీఈసీ భేటీలో ప్రస్తావించారు. దీంతో అసలు సిబ్బందిపై చర్చ జరిగింది. సచివాలయ ఉద్యోగుల్ని తీసుకోవద్దని విపక్షాలు డిమాండ్ చేస్తున్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. వారిని తీసుకున్నా సిబ్బంది సరిపోరని తేలడంతో టీచర్లను నియమించాలని కేంద్ర అధికారులు ఆదేశించారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా టీచర్లనే నియమించాల్సి ఉంది. సచివాలయ సిబ్బందిని ఆ స్థాయిలో నియమించడానికి అవకాశం లేదు. టీచర్లే ఇంచార్జులుగా ఉంటారు కాబట్టి జగన్ రెడ్డి ప్లాన్ పూర్తి రివర్స్ అయినట్లవుతుంది.
ప్రస్తుతం ఏపీలో ఒక్క టీచర్లే కాకుండా ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా సంతోషంగా లేని సంగతి తెలిసిందే. జీతం పెంపుదల, డీఏలు, ఇతర అంశాల విషయంలో అందరూ ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు. అందుకే టీచర్లు ఇంకా ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారు. అంత వ్యతిరేకత ఉన్నవారిని పోలింగ్ అధికారులుగా నియమిస్తే తమకు నష్టం చేకూరుతుందని జగన్ భావించారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా వారిని పోలింగ్ విధులకు దూరంగా ఉంచాలని చాలా కాలంగానే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అందుకోసం చట్టం కూడా తీసుకు వచ్చారు. ఈ చట్టం ఎన్నికల సంఘానికి వర్తించదు కాబట్టి.. చివరికి టీచర్ల చేతుల్లోకే ఎన్నికల విధులు వెళ్లాయి. దీంతో జగన్ ప్రభుత్వ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది.











