(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ కట్టు, ఆ బొట్టు , ఆ యాస, ఆ భాష అంతా డిఫరెంట్ స్టయిల్. దేశంలో ఆ మాట కొస్తే ప్రపంచంలో ఏ మూలనున్నా ఉత్తరాంధ్ర వ్యక్తిని అట్టే పసిగట్టేయొచ్చు. పరిస్థితులు మారడం, నవీన పోకడలు చోటుచేసుకోవడం ముఖ్యంగా పాత తరం కాలం చేస్తుండటం వల్ల ఉత్తరాంధ్ర స్టయిల్ కొద్దిరోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
కల్లా కపటం తెలియనోళ్లు ..
మన అవ్వలు, తాతలు, తల్లిదండ్రులు కల్లా కపటం తెలీనోళ్లు. ఇంట్లోనూ, పొలాన ఒంటి దీరా కష్టపడటమే తప్ప కుళ్లు కుతంత్రాలు ఎరుగరు. కాపురానికి ప్రత్యేక పడక గదులు వారికి తెలీవు. సిజేరియన్ ఆపరేషన్ లేకుండా 10-12మంది పిల్లలను కని పోషించేవారు. ఆరు గాలం శ్రమించి హాయిగా నిద్రించే ఉక్కు లాంటి శారీరక, మానసిక ఆరోగ్యానికి సజీవ తార్కాణాలు. వెళ్లిపోతున్నారు.. వారు ఒకరికొకరుగా. మనల్ని విడచి.. విశ్రమిస్తున్నారు. రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా కూడబెట్టి, మడికి మడి ఆస్తులు కూడగట్టి మనకిచ్చేసి మరీ.. స్వర్గధామానికి దారితీస్తున్నారు.. ఆ నాటి నిజ జీవిత కథానాయికలు… నాయుళ్లు .. నాయిరాలమ్మలు.. సమష్టి కుటుంబ రథ సారథులు మనల్ని ఒంటరి చేస్తూ విడిచిపెడుతున్నారు.
Also Read ;- పునాది పడకముందే రాద్ధాంతం..!
మరి కనిపించబోరు..
ఆ కట్టూ బొట్టు.. మెట్ట..
నాగరము..జడగంటలు..
నాను ..పట్టిడి
అడ్డు కమ్ములు .. కాన పర్సలు..
దండగడియాలు.. కొప్పులు .. వెండి కడియాలు .. తమ్మిట్లు..
ఎత్తు గొలుసులు ..
శునబగాయలతో కూడిన సుందర మనోహర రూపాలు మటుమాయమవుతున్నాయి.
నెత్తిమీది తట్ట.. అడ్డ పొగ చుట్ట..
బిందెలతో నీల మోత ..
పొయ్యిలోకి కట్టికర్రలు ..
ఆకులు, అలములు,
కారుబిడకలు, చెరుకు మొజ్జులు,
పిడకలు, తూటుబొడ్లు.
రెండు ఆయిలాల పొయ్యి తయారీదారుల తరం అంతరించిపోతోంది.
కావుళ్లు, గంపలు, కుండ, ఆరిగిం, అగ్గి బెంటు, కత్తిపీట, గోకిరి, దాక, దోకి, దాగర, జిబ్బి,గోలెం, బోను పెట్టి, దివ్వ గూడు, గీట్రు కంప, సిట్టుపరక, ఒట్టిగడ్డి, కుడితి గోలెం, కుక్కి మంచం, పేడకళ్ళు, ముంతలబల్ల అన్నీ మనకి అప్పజెప్పి… ఒక జోగులమ్మ, అచ్చియ్యమ్మ, రాములమ్మ..నారాయణమ్మ, సుభద్రమ్మ, సిమ్మాలమ్మ, జానకమ్మ, రత్నాలమ్మ, గౌరమ్మ, పారమ్మ, ఎల్లమ్మ, ఎరుకులమ్మ, తవిటమ్మ, అసిరమ్మ, పైడితల్లమ్మ మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు.
అంతేకాదు వారితోనే ఆ వస్తువులను, ఆ వస్త్రధారణను తీసుకుపోతున్నారు.
Must Read ;- లియో ఎఫెక్ట్ : గిరిజనుల సమస్యపై కదిలిన అధికారులు