కర్నూలు విజయాడైరీ ఎన్నిక వివాదాస్పదంగా మారింది. గడచిన 25 సంవత్సరాలుగా భూమా నాగిరెడ్డి కుటుంబీకులే విజయాడైరీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. ఎలాగైనా విజయాడైరీ ఛైర్మన్ ఎన్నికల్లో గెలవాలని ఈ సారి వైసీపీ నేతలు మంచి పట్టుదలతో ఉన్నారు. అయితే నిజాయితీగా, ప్రశాంతంగా డైరీ ఎన్నికలు జరిగితే వైసీపీ నేతలు గెలిచే అవకాశాలు లేవు. అందుకే టీడీపీ నేతలను బెదిరించి విజయాడైరీ ఛైర్మన్ పదవిని కైవశం చేసుకోవాలని ఎత్తుగడలు అమలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
బెదిరింపులు, అక్రమకేసులు
టీడీపీ మద్దతుదారులుగా విజయ డైరీ డైరెక్టర్ గా పోటీ చేస్తున్న వై.మల్లికార్జున ని గత నాలుగు రోజుల నుండి వైసీపీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అనుచరులు బెదిరించి హైకోర్టులో స్టే విత్ డ్రా చేయించారనే విమర్శలు వస్తున్నాయి. దురుద్దేశపూర్వకంగానే మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, డైరీ చైర్మన్ అభ్యర్థి భూమా నారాయణ రెడ్డి, అతని కొడుకు భూమా వీరభద్రారెడ్డి, ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్న బాల ఈశ్వర్ రెడ్డి లపై 365, 384, 344, 506 సెక్షన్ల కింద కేసులు పెట్టించారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
అఖిలప్రియ హౌస్ అరెస్ట్
మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మిగిలిన భూమా కుటుంబసభ్యులపై అక్రమ కేసులు బనాయించారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విజయాడైరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని చూస్తున్నారని అఖిల ప్రియ విమర్శించారు. కర్నూలు విజయా డైరీ ఎన్నికలు భూమా కుటుంబానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. గడచిన 25 సంవత్సరాలుగా విజయాడైరీ భూమా కుటుంబసభ్యుల చేతుల్లోనే ఉంది. ఒక్కసారి చేజారిపోతే ఇక విజయాడైరీ ఛైర్మన్ పదవిని దక్కించుకోవడం కష్టమేనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
సీఎం ఆదేశాల మేరకే పోలీసుల కేసులు
ఎలాగైనా విజయాడైరీ ఛైర్మన్ ఎన్నికల్లో గెలిచి తీరాలని సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా వారు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. భూమా అఖిలప్రియ మేనమా ఎస్వీ జగన్మోహన్ రెడ్డి టీడీపీ నుంచి ఛైర్మన్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అయితే ఎన్నికలు సజావుగా సాగితే టీడీపీ నేతలు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే టీడీపీ వారిపై కేసులు బనాయించి వారు ఎన్నికలు జరిగే ప్రాంతాలకు రాకుండా చేసి డైరెక్టర్లను బెదిరించి ఛైర్మన్ పదవిని దక్కించుకోవాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు.
Must Read ;- వైసీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ.. పోలీసు స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే బైఠాయింపు