ఏపీ సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. హఠాత్తుగా సీఎం హస్తిన బాట పట్టడంపై అనేక రాజకీయ విశ్లేషణలు హల్‌చల్ చేస్తున్నాయి. సీఎం హస్తిన టూర్ పెట్టుకున్నారా? లేదంటే ఢిల్లీ పెద్దలే సీఎంను ఢిల్లీ రావాలని ఆదేశించారా? అనే అనుమానాలు ప్రజల్లో వక్తం అవుతున్నాయి. అకస్మాత్తుగా సీఎం ఢిల్లీ టూర్ ను షెడ్యూల్ లో లేకుండానే ప్రకటించడంపై అనేక సందేహాలు చుట్టుముడుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఢిల్లీ చేరుకునే సీఎం జగన్మోహన్ రెడ్డి, ముందుగా కేంద్ర హో మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఆ తరవాత ఒకరిద్దరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
దేవాలయాల ధ్వంసంపై కేంద్రం సీరియస్
ఏపీలో 145 దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై కేంద్రం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రామతీర్థం కోదండరాముని ఆలయంలో దుండగులు రాముని శిరస్సు చేధించడంపై కేంద్ర బీజేపీ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా, దుండగులను పట్టుకునేందుకు ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించలేదనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వానికి తెలియజేశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు హిందూ దేవాలయాలపై వరుస దాడుల పట్ల హిందువుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం వస్తోంది.
వీటిపై కేంద్రం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఏపీ సీఎంను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీకి పిలిపించినట్టు తెలుస్తోంది. అందుకే సీఎం హడావుడిగా ఢిల్లీ టూర్ ప్రకటన చేయాల్సి వచ్చింది. షెడ్యూల్ లో కూడా కేవలం కేంద్ర హోం మంత్రితో భేటీ మాత్రమే ప్రకటించారు. ఇతర మంత్రులను కలిసే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. ఎందుకంటే అందుబాటులో ఉండి, అపాయింట్ మెంట్ ఇచ్చిన కేంద్ర మంత్రులను సీఎం కలిసే అవకాశం లేకపోలేదు.
Must Read ;- విగ్రహాల ధ్వంసం కేసులు.. కేంద్రం ఏడాదిగా నిర్లక్ష్యం!
హైకోర్టు కర్నూలుకు తరలిస్తారా?
అమరావతిలో కొనసాగుతున్న హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అవుతున్నారనే సమాచారం కూడా వస్తోంది. మార్చి తరవాత సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముందుగా విశాఖకు తరలించాలని వైసీపీ అధినేత పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అగ్రనేతలు ఇప్పటికే ప్రకటించారు. మరోమూడు నెలల్లో రాజధాని విశాఖకు వస్తుందంటూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయని కూడా వారికి సంకేతాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే రాజధానితో పాటు హైకోర్టును కూడా అమరావతి నుంచి తరలించి, ఇటు వైపు చూసే పనిలేకుండా చేయాలని వైసీపీ అధినేత భావిస్తున్నారనే అనుకోవాల్సి వస్తోంది.
పోలవరం నిధులు రాబడతారా? లేదా?
ఏపీ జీవనాడిగా చెప్పుకుంటోన్న పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే గ్రావిటీతో కాలువలకు నీరు విడుదల చేయాల్సి ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం పోలవరం పనులను అంత సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. ఒక వేళ ప్రధాన ప్రాజెక్టు పనులు పూర్తి చేసినా, పునరావాసం, పరిహారం ప్రధాన సమస్యలను అధిగమించాల్సి ఉంది. ప్రధాన ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే రూ.15000 కోట్లు ఖర్చు చేశారు. పునరావాసం, పరిహారం చెల్లింపులకు మరో రూ.30 వేల కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ మొత్తం కేంద్రం విడుదల చేస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలవరం అంచనా వ్యయం దాదాపు రూ.55వేల కోట్లు ఈ మొత్తం కేంద్రం భరిస్తుందా? లేదా? అనే విషయంపై కూడా ఏపీ ప్రభుత్వానికి స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం మొత్తం వ్యయం అంటే రూ.55 వేల కోట్లు మేమే భరిస్తామని ఈ మధ్య కాలంలో ప్రకటించిన దాఖలాలు లేవు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేపట్టారు, కాబట్టి మొత్తం వ్యయం కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ విషయంపై కూడా ఏపీ సీఎం అమిత్ షాతో పాటు, కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్ తో చర్చించే అవకాశం ఉంది.
ఏపీ బీజేపీ నేతలకు కళ్లెం వేస్తారా?
ఏపీ బీజేపీ నేతలు ఇటీవల బాగా స్వరం పెంచారు. రామతీర్థం ఘటన తరవాత అధికార పార్టీతో అంటకాగిన బీజేపీ నేతలు కూడా దూరంగా జరిగినట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలపైనే కేసులు పెట్టడంపై ఆయన డీజీపీపై కూడా విరుచుకుపడ్డారు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయకుండా, బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంపై ఏపీ బీజేపీ నేతలు సీరియస్ గా ఉన్నారు. ప్రభుత్వ తీరును వారు తప్పు పడుతున్నారు. అంతర్వేదిలో చర్చిపై ఒక్క రాయి వేసి నందుకు 40 మంది బీజేపీ, వీహెచ్ పీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన పోలీసులు 145 దేవాలయాలను ధ్వంసం చేసినా ఇప్పటికీ బాధ్యులను అదుపులోకి తీసుకోకపోవడంపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది.
Also Read ;- ఉగాది నాటికి రాజధాని విశాఖకు తరలింపు