తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు మణిహారంగా నిలుస్తున్న హైటెక్ సిటినీ చూస్తే.. ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గణనీయ వృద్ధి నమోదు కానుందన్న విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు.. ఉమ్మడి రాష్ట్రానికి తాను సీఎంగా ఉన్న సమయంలో హైటెక్ సిటీకి రూపకల్పన చేశారు. నాడు విపక్షాల నుంచి ఎన్నెన్ని విమర్శలు వినిపించినా పెద్దగా పట్టించుకోని చంద్రబాబు.. హైటెక్ సిటీ నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. కళ్లు మూసి తెరిచేలోగానే కొండలు, గుట్టలు ఉన్న మణికొండలో హైటెక్ సిటీ రూపుదిద్దుకుంది. అందరి నోళ్లు మూతలు పడిపోగా.. ఐటీ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు మైక్రోసాఫ్ట్ కూడా హైటెక్ సిటీలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా చంద్రబాబు సత్తా చాటారు. వెరసి హైటెక్ సిటీ నిర్మాతగా.. హైదరాబాద్‌ను అభివృద్ధి బాట పట్టించిన సీఎంగా చంద్రబాబు రికార్డుల్లోకి ఎక్కారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన సందర్భంగా చంద్రబాబు మానస పుత్రిక హైటెక్ సిటీ తెలంగాణకు వెళ్లిపోగా.. కనీసం రాజధాని కూడా లేని 13 జిల్లాల నవ్యాంధ్రలోనూ ఐటీ రంగం పరుగులు పెట్టేలా చంద్రబాబు ప్లాన్ రచించారు. ఏటేటా ఏపీ నుంచి ఎగుమతి అవుతున్న ఐటీ ఉత్పత్తుల పెరుగుదలే ఇందుకు నిదర్శం.
వేల నుంచి వందల కోట్లకు..
నవ్యాంధ్రకు తొలి సీఎంగా చంద్రబాబే పదవీ బాధ్యతలు చేపట్టారు. నాడు ఏపీలో ఎలాంటి అవకాశాలు లేకున్నా గానీ.. తనదైన శైలి కార్యదక్షతతో ముందుకు సాగిన చంద్రబాబు.. ఏపీ నుంచి ఏటా రూ.1,500 కోట్ల మేర విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేలా ప్లాన్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏటా రూ.1,500 కోట్ల ఎగుమతులు నమోదు కాగా.. ఆ ఎగుమతులు 2017 నాటికి ఏకంగా రూ.2 వేల కోట్లకు చేరాయి. అంటే.. అవకాశాలు లేకున్నా.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీలో ఐటీ వృద్ధి చెందింది. అయితే ఇప్పుడు అదే అభివృద్ధి కానరాకపోగా.. చంద్రబాబు కష్టార్జితం వల్ల కనిపించిన అభివృద్ధి ఇప్పుడు జీరో దిశగా పయనిస్తోంది. జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక.. ఏపీలో అభివృద్ధి అన్న మాటే వినిపించడం లేదు కదా. ఈ క్రమంలో ఐటీ ఎగుమతుల్లోనూ ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు. అంతేకాకుండా గతేడాది ఏపీ నుంచి ఎగుమతి అయిన ఐటీ ఉత్పత్తుల విలువ రూ.838 కోట్లు మాత్రమే. అంటే.. చంద్రబాబు హయాంలో కోట్లాది రూపాయల విలువైన ఐటీ ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అయితే.. జగన్ జమానాలో ఆ విలువ వందల కోట్లలోకి వచ్చేసింది. జగన్ రెండేళ్ల పాలనలోనే ఈ తరహా మార్పు కనిపిస్తే.. ఆయన పాలన మరో రెండున్నరేళ్ల పాటు ఉంది కదా. ఆలోగా వేల నుంచి వందల కోట్లలోకి దిగిన విలువ.. జీరోకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మూడో స్థానంలో తెలంగాణ
చంద్రబాబు పుణ్యంతో అందుబాటులోకి వచ్చిన హైటెక్ సిటీని తెలంగాణలోని కేసీఆర్ సర్కారు బాగానే సద్వినియోగం చేసుకుంటోంది. ఫలితంగా దేశంలోనే అత్యధిక మొత్తంలో ఐటీ ఎగమతులను నమోదు చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ కంటే ముందు కర్ణాటక, మహారాష్ట్రలు మాత్రమే ఉన్నాయి. గతేడాది లెక్కలను తీసుకుంటే.. మూడో స్థానంలోని తెలంగాణ రూ.84,775 కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తే.,. తొలి స్థానంలో ఉన్న కర్ణాటక రూ.2,05,131 కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. వాస్తవానికి చంద్రబాబు మాదిరిగా జెట్ స్పీడును కంటిన్యూ చేసి ఉంటే.. తెలంగాణ ఎప్పుడో ఈ జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకుని ఉండేది. కర్ణాటకను దాటేస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలుమార్లు ఈ దిశగా ప్రకటనలు కూడా చేశారు. అయితే ఆచరణలో మాత్రం తెలంగాణ సర్కారు.. చంద్రబాబు మాదిరిగా దూకుడును ప్రదర్శించలేకపోయింది. అయితే జగన్ మాదిరిగా కేసీఆర్ సర్కారు మరీ దిగజారుడు పనితీరును అయితే కనబరచలేదన్న మాటే కాస్తంత ఊరటనిచ్చే అంశమని చెప్పక తప్పదు.
Must vRead ;- రాజన్న రాజ్యం కాదు దోపిడీ రాజ్యం