తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం సరైన సమయంలో తీసుకోలేదని, అప్పుడే దేశంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. తాజాగా దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూర్చే విధంగానే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను విముఖమని ప్రణబ్ తన ఆత్మకథలో స్పష్టం చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నేనైతే అంగీకరించేవాడిని కాదు..’ అని ఆయన సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్: 2012-2017’ పేరిట తాజాగా విడుదలైన ఆయన ఆత్మకథలో తెలంగాణ ఏర్పాటు గురించి కీలక వ్యాఖ్యలున్నాయి. తనచేతుల మీదుగా రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతుందని తాను ఊహించలేకపోయానని ఆయన పేర్కొన్నారు.
పార్టీ పతనానికి మూలం..
తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్పై రాష్ట్రపతి హోదాలో సంతకం చేసిన ప్రణబ్ ముఖర్జీ.. ఆంధ్రప్రదేశ్ను విభజించిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఊహించిన విధంగా మెరుగుపడకపోగా, ప్రతికూల రాజకీయ వాతావరణం ఏర్పడిందని రాశారు. నాటి నుంచి పార్టీ పరిస్థితి నానాటికీ క్షీణించిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్కు అత్యంత బలమైన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక లోక్సభ స్థానాలు లభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ కు సంప్రదాయమైన, బలమైన ఓటు బ్యాంకు ఉన్న రాష్ట్రాల్లో ఓటమి చెందడం వల్లే అధికారానికి దూరమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
Must Read ;- తెలంగాణలో దూకుడుకు డైరెక్షన్.. ఆపరేషన్ కమలంలో రవి ప్రకాశ్
తనను రాష్ట్రపతిని చేసిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం వైఖరిలో అనేక మార్పులు వచ్చాయని, కీలక నిర్ణయాల్లో తడబాటు స్పష్టంగా కనిపించిందని ప్రణబ్ వ్యాఖ్యానించారు. పార్టీని నడిపించడంలో సోనియా విఫలమయ్యారని, దీనికి అప్పటి పరిస్థితులే కారణమని అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని, బీజేపీ 195 నుంచి 200 స్థానాలతో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని అంచనా వేశానని ఆయన చెప్పారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా పరాజయం చెందడంతో ఆ ప్రభావం ఫలితాలపై పడిందని ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో పేర్కొన్నారు.
ఓట్లు వేయని వారి అంతర్గతం తెలుసుకోవాలి..
నోట్ల రద్దు వ్యవహారం గురించి తనతో ప్రధాని మోడీ చర్చించలేదని తన ఆత్మకథలో పేర్కోన్నారు ప్రణబ్. మోడీ నోట్ల రద్దు గురించి ప్రకటించిన తర్వాతే తాను కూడా తెలుసుకున్నానని, కానీ అది తనని ఏ మాత్రం ఆశ్చర్యానికి గురి చేయలేదని రాసుకొచ్చారు. 2014-19 పరిపాలనా కాలంలో పార్లమెంట్ సజావుగా నడిపించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ఒక ప్రధాని పార్లమెంట్‌లో ఉన్నప్పుడు దాని పనితీరు వేరుగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికైనా తన ముందు వారు పార్లమెంట్‌ను నడిపిన తీరును చూసి నేర్చుకోవాలని చెప్పారు. ప్రజా సమస్యల క్షేత్రం.. ప్రజాస్వామ్య దేవాలయం వంటి పార్లమెంట్ పట్ల నిర్లక్ష్యం మోడీలోని అతిపెద్ద లోపమని తన ఆత్మకథలో పేర్కొన్నారు ప్రణబ్.
దేశంలోని ఎక్కువమంది ప్రజలు కోరుకున్న వారే పదవులు చేపడతారు. ఎక్కువమంది ప్రజలు కోరుకోవడం వల్లే మోడీ ప్రధాని కాగలిగారనేది అక్షరసత్యం. కానీ, తనకు ఓట్లు వేయని వారి పరిస్థితిని కూడా చక్కబెట్టాల్సిన బాధ్యత, వారి గోడు వినాల్సిన అవసరం కూడా ఉందని మోడీ గుర్తుంచుకోవాలని ప్రణబ్ పేర్కొనడం విశేషం. ప్రధానిగా పదవి చేపట్టిన తర్వాత అన్ని వర్గాల వ్యక్తులను కాపాడడం ఒక ప్రధాని బాధ్యత అనే విషయాన్ని మరవకూడదు.
అన్నాహజారే అడిగినవి న్యాయబద్దమైనవి..
అన్నాహజారే డిమాండ్ చేసిన ‘లోక్ పాల్’ బిల్ ఆమోదయోగ్యమైనదని పొగిడారు ప్రణబ్. వారుచేసిన మూడు డిమాండ్స్ ఒప్పుకోదగినవని రాశారు. అన్నాహజారే లేవనెత్తిన ప్రతి విషయం ఎంతో నిజాయితితో కూడుకున్నవని.. అలాగే ఎంతో ముఖ్యమైనవని చెప్పుకొచ్చారు.
Also Read ;- సంపాదకీయం : కేంద్రం ఈ డ్రామాలు కట్టిపెట్టాలి