విజయవాడలో గడచిన వారం రోజుల్లో శానిటైజర్ తాగి ఎనిమిది మంది మరణించినట్టు తెలుస్తోంది. విజయవాడ వన్ టౌన్ ఏరియాలో రోజు వారీ కూలీలు మద్యం కొనలేక శానిటైజర్లు తాగినట్టు తెలుస్తోంది. శానిటైజర్ తాగడం వల్లే పాత బస్తీకి చెందిన పణుగు అప్పారావు, యార్లగడ్డ నాగరాజు, భానునగర్‌కు చెందిన వెంకటస్వామి, బొమ్మ సెంటర్‌కు చెందిన సత్యనారాయణ చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ధృవీకరించడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా వారి అంత్యక్రియలు జరిపించేశారు. పాతబస్తీకి చెందిన పణుగు అప్పారావు సోమవారం నాడు శానిటైజర్ తాగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. కానీ వైద్యులు మాత్రం కనీసం పోస్టు మార్టం కూడా నిర్వహించలేదని ఆరోపిస్తున్నారు.
మరో ముగ్గురు కూడా..
అమ్మ హోటల్ సెంటర్ ప్రాంతానికి చెందిన మధు, పంజా సెంటరుకు చెందిన వెంకటస్వామి కూడా శానిటైజర్ తాగి చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వీరి మరణంపై పోలీసులు అనుమానాస్పదంగా మృతి చెందినట్టు కేసు నమోదు చేశారు. చనిపోయిన వారంతా రోజువారీ కూలీలే. మద్యం ధరలు విపరీతంగా పెంచడం వల్ల కొనుగోలు చేయలేక, శానిటైజర్‌లో కూల్ డ్రింక్ కలుపుకుని తాగారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం శానిటైజర్ మరణాలను ధృవీకరించడం లేదు.
Must Read ;- జగన్ అన్నా.. మద్యం పాత బ్రాండ్లే అమ్మన్నా..!










