ఏపీలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మరోమారు మొదలైపోయింది. గతంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా… కోవిడ్ విలయం నేపధ్యంలో వాటిని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా… అధికార పార్టీ తన కండబలంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులను బెదిరింపులకు గురి చేసి చాలా సీట్లను ఏకగ్రీవం చేసుకుంది. దీనిపై పెద్ద దుమారమే రేగగా… విపక్ష టీడీపీ అధికార పార్టీ దమన నీతిపై తనదైన శైలి పోరాటం చేసింది. అయితే కరోనాతో మొత్తం ఎన్నికల ప్రక్రియే వాయిదా పడిపోవడంతో ఆ వివాదం అప్పటికి సద్దుమణిగిపోయింది. అయితే పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తేనే… ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుందని కూడా టీడీపీ వాదిస్తోంది.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే..
నిమ్మగడ్డ పదవీకాలం బుధవారంతో ముగియడం… ఆ స్థానంలో మాజీ సీఎస్ నీలం సాహ్నీ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయింది. ఇప్పుడు తమకు అనుకూలంగా ఉంటుందన్న భావనతో పాత నోటిఫికేషన్ ప్రకారమే పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా వైసీపీ సర్కారు పావులు కదిపింది. దీనిపై టీడీపీ భగ్గుమంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అత్యున్నత నిర్ణయాక విభాగం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తాజాగా మీడియా ముందుకు వచ్చారు. పరిషత్ ఎన్నికల్లో ఇప్పటిదాకా ఏం జరిగింది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే ఏం చేయాలి? అందుకు టీడీపీ డిమాండ్లేమిటి? అన్న అంశాలపై సవివరంగా మాట్లాడారు. అంతేకాకుండా పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరతను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖను కూడా ఆయన విడుదల చేశారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా..
ఈ సందర్భంగా వర్ల రామయ్య ఏమన్నారంటే… ఎంపీటీసీ. జడ్పీటీసీ ఎన్నికలకు ప్రెష్ నోటిఫికేషన్ జారీచేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 2020 మార్చిలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఎంపీటీసీల్లో 24 శాతం, జడ్పీటీసీల్లో 19 శాతం సీట్లను వైసీపీ తన కండబలంతో ఏకగ్రీవం చేసుకుందని ఆయన ఆరోపించారు. తద్వారా ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడినట్టేనని కూడా ఆయన ధ్వజమెత్తారు. ఇదే విషయాన్ని గత ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్వయంగా కేంద్ర హోం సెక్రటరీకి సైతం లేఖ రాశారని తెలిపారు. కొంత మంది పోలీసులతో అధికార పార్టీ కుమ్మక్కై బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్న వైనాన్ని కూడా ఎస్ఈసీ కేంద్రానికి నివేదించిన వైనాన్ని ఆయన ప్రస్తావించారు. పోలీసులే పోటీదారుల చేత బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింప జేసిన విషయాన్ని కూడా వర్ల ప్రధానంగా పేర్కొన్నారు.
పోటీకి సమాన అవకాశాలు కల్పించాలంటూ..
అధికారం చేతిలో ఉంది కదా అని వైసీపీ బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేసిన వర్ల… నిజమైన ప్రజాస్వామ్యమంటే ఎన్నికల్లో పోటీచేసే ప్రతీ పోటీదారుడికి, అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరతను ప్రధానంగా ప్రస్తావించారు. అయితే అందుకు విరుద్ధంగా గత మార్చిలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో వైసీపీ దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు సంబంధించి ప్రజాస్వామ్యం మళ్లీ ఫరిడవిల్లాలంటే… పరిషత్ ఎన్నికలకు సంబంధించి పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతో పాటుగా కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read:లోకల్ నోటిఫికేషన్ రెడీ.. జగన్ సర్కారు సహకరించేనా?











