ప్రపంచాన్ని వణికిస్తున్న లక్షలాది మంది మరణానికి కారణమైన కోవిడ్‌కు అడ్డుకట్ట వేసేందుకు అన్నిమార్గాల్లో పరిశోధనలు జరుగుతున్న వేళ.. ఆ వైరస్‌ను వేగవంతంగా అరికట్టే ఔషధ ఆవిష్కరణకు కీలక అడుగు పడింది. ప్రస్తుతం కోవిడ్‌పై డైరెక్ట్‌గా పనిచేసే ఔషధాలు లేవు. ముందు జాగ్రత్త చర్యలుగా విటమిన్ టాబ్లెట్లు, యాంటీబాడీస్‌ని పెంచే మందులు, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్, కోవాగ్జిన్, కొవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటికి కూడా కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. మరోవైపు రోజురోజుకూ మరణాలు పెరుగుతున్నందున భారత్ లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వైరస్‌పై శరవేగంగా పోరాడే మందు రానుందన్న విషయం బయటకు రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జార్జియా నుంచి..
జార్జియా స్టేట్ యూనివర్సిటీ సహకారంతో, అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్), బ్రిటన్‌లోని ప్లైమౌత్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల సమన్వయంతో తుది ప్రయోగ దశల్లో ఉన్న మోల్నుపిరావిర్(ఎంకే-4482) ఔషధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర అంశంగా మారింది. కోవిడ్‌ను అరికట్టేందుకు ప్రతిపాదిస్తున్నఈ యాంటీ వైరల్ మందును నోటి ద్వారా వేసుకోవచ్చు. పలు రకాల వైరస్‌లు (ఇన్ ఫ్లూయెంజా)కోసం దీన్ని అభివృద్ధి చేస్తుండగా కోవిడ్ పైనా ఇది ఎలా పోరాడుతుందనే అంశంపై ప్రయోగాలు మొదలయ్యాయి. ఎలుకలపై ప్రయోగాలు పూర్తి కాగా అనుకూల ఫలితాలు వచ్చాయి. తరువాతి దశలో ఇతర జంతువులపై ప్రయోగాలు చేయనున్నారు. ఇప్పటి వరకు రోగనిరోధక శక్తి పెంచే టాబ్లెట్లు, యాంటీ వైరల్ టాబ్లెట్లు మినహాయిస్తే..కోవిడ్ లాంటి ప్రాణాంతక వైరస్‌లపై పోరాడేందుకు ప్రత్యేకంగా రూపొందించిన టాబ్లెట్‌గా ఇది నిలవనుంది. శ్వాసకోశ వ్యవస్థలో ఉన్న వైరస్‌పై పోరాడడంతో పాటు రక్తాన్ని పలుచన చేసే పనిలో ఈ టాబ్లెట్ సమర్థంగా పనిచేస్తుందని జార్జియా యూనివర్సిటీ వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకడానికి 12 గంటల ముందు, కరోనా వచ్చిన 12 గంటల తర్వాత మోల్నుపిరావిర్ మందును ఎలుకలకు ఇచ్చి చూడగా వైరస్ నుంచి వాటికి ఈ మందు రక్షణ కల్పించినట్టు గుర్తించారు. అంతేకాదు.. ఈ ఒక్క మందు ఇచ్చినా, ఇతర యాంటీ వైరల్ మందులతో కలిపి ఇచ్చినా.. సైడ్ ఎఫెక్ట్‌లు లేని విధంగా తయారు చేయనున్నారు. మరో దశ దాటాక మనుషులపై ప్రయోగాలు చేయనున్నారు. మూడు దశల్లో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. తరువాత ఆయా దేశాలు ఈ ఔషద ప్రభావం, ఫలితాలు, దుష్ఫలితాలపై పరిశీలన చేసి అనుమతించనున్నాయి. ఇప్పటి వరకు బయటకు వస్తున్న సమాచారం ప్రకారం.. తొలి దశ ప్రయోగాల తరహాలోనే సానుకూల ఫలితాలు మనుషులపైనా చేయనున్న ఈ ప్రయోగాల్లో వస్తే కోవిడ్‌పై పోరాడేందుకు మరో బలమైన అస్త్రం దొరికినట్టు శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌లో FBL దరఖాస్తు..
కాగా మహారాష్ట్రకు చెందిన ఫెర్మెంటా బయోటెక్ లిమిటెడ్ (ఎఫ్‌బీఎల్) అనే సంస్థ దేశీయంగా అదే ఫార్ములాతో బయోకేటలైసిస్ తయారీ పద్ధతిని అభివృద్ధి చేసింది. పేటెంట్‌కు దరఖాస్తు చేసింది. తక్కువ ఖర్చుతో ఔషధాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు పర్యావరణహితమైన టెక్నాలజీ అని సంస్థ సీఈవో ప్రశాంత్ నగరే మీడియాతో వ్యాఖ్యానించారు.
వ్యాప్తికి అడ్డుకట్ట..
ఈ మందుకు సంబంధించి మరో విషయాన్ని నేచర్ మైక్రోబయాలజీ మేగజైన్ ప్రచురించింది.ఈ ఔషధాన్ని తీసుకున్నాక వైరస్ నియంత్రణ కావడంతో పాటు వైరస్ వ్యాప్తి కూడా తగ్గుతుందని పేర్కొంది. ఈ ప్రయోగాలు కూడా జరిగాయని సదరు మేగజైన్ వెల్లడించింది. 24గంటల్లోనే ఈ ఔషధం ప్రభావం చూపుతుందని తేల్చింది.
Also Read ;- ఆక్సిజన్ అందక 22 మంది మృతి

రెమ్‌డెసివిర్ నోటి ద్వారా ఇచ్చేందుకు..
ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ నియంత్రకు వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌కు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్ కూడా జరుగుతోంది. ప్రభుత్వాలు ఈ ఇంజెక్షన్ ధరపై నియంత్రణలు విధించినా పలు చోట్ల అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే రెమ్‌డెసివిర్‌ను హైదరాబాద్‌లోని హెటిరో సంస్థ రోజుకు సుమారు 34 వేల డోసులు, మైలాన్ సంస్థ రోజుకు 37 వేల డోసులు ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే రోజుకి గరిష్టంగా 71వేల ఇంజెక్షన్లు మాత్రమే ఉత్తత్తి అవుతున్నాయి. అయితే ఇతర రాష్ట్రాలకు కూడా ఈ ఇంజెక్షన్లు పంపాల్సి రావడంతో తెలుగు రాష్ట్రాలకు గరిష్టంగా రోజుకు 8వేల లోపు మాత్రమే ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ ఇంజెక్షన్‌ను తయారు చేసేందుకు ప్రస్తుతం క్యాడిలా హెల్త్‌కేర్, సింజిన్ ఇంటర్నేషనల్, రెడ్డీస్ ల్యాబోరేటరీస్, సిప్లా, జుబిలాంట్ జనరిక్స్‌లకూ అనుమతి ఉంది. అన్నీ కలిపి 38.8లక్షల ఇంజెక్షన్ల తయారీకి ప్రణాళికలు వేశారు. వీటిలో 10లక్షల ఇంజెక్షన్లు (వయల్స్)ను అత్యవసర పద్ధతి (ఫాస్ట్ ట్రాక్స్) అనుమతులు ఇచ్చారు. అదే సమయంలో భారీగా డిమాండ్ ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.
తాజాగా నోటి ద్వారా ఇచ్చే రెమ్‌డెసివిర్‌ను అభివృద్ధి చేసినట్లు జుబిలంట్ ఫార్మా ప్రకటించింది. ఐదురోజుల పాటు ఈ ఓరల్ మెడిసిన్ వేసుకునేలా రూపకల్పన జరిగింది. ఇప్పటికే ఇది భద్రతకు సంబంధించిన పరీక్షల్లో సక్సెస్ అయిందని సదరు కంపెనీ వెల్లడించింది. అదనపు అధ్యయనాల కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి కోరింది. ఈ ప్రయోగాలు సక్షెస్ అయితే నోటి (ఇన్‌హెలర్ మోడల్) ద్వారా మందు ఇచ్చేందుకు వీలుంటుంది. అదే సమయంలో ఇంజెక్షన్ల కొరత కూడా తీరుతుందని జుబిలంట్ చైర్మన్ శ్యామ్ భార్తియా, కో-చైర్మన్ హరి భార్తియా మీడియాకు వెల్లడించారు.
Must Read ;- కరోనా పేరిట కొత్త దందా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విజిలెన్స్ అధికారులు











