జర్నలిస్టు గంజి రఘును వెంటనే విడుదల చేయాలని కోరుతూ పలువురు ప్రజాప్రతినిధులు, జర్నలిస్టు సంఘాల నాయకులు తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. తాజాగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో సహా ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, సామాజిక ఉద్యమకారుడు, విద్యావేత్త చుక్కా రామయ్య, సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి, తెలంగాణ జేఏసీ ఛైర్మన్, టీజేఎస్ ప్రసిడెంట్ ప్రొ.కోదండరాం తదితరులు తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
కవరేజీ చేసినందుకు అరెస్టు
‘సూర్యాపేట జిల్లా గుర్రంబోడులో భూములకు సంబంధించి జరుగుతున్న ఆందోళనను కవర్ చేసేందకు రాజ్ న్యూస్ ఛానెల్ తరఫున జర్నలిస్ట్ రఘు వెళ్లిన కారణంగా అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేశారు. గుర్రంబోడు సంఘటన జరిగిన సమయంలో జర్నలిస్ట్ రఘు రాజ్ న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు తొలివెలుగులో పనిచేస్తున్నాడు. సమాజంలో జరుగుతున్న ఘటనలను కవరేజీ చేసే విధి జర్నలిస్టులది. కవరేజీ చేయడానికి వెళ్లినందున ఆ ఘటనలకు కారణమని చూపుతా కేసు పెట్టడం సరికాదు.
జర్నలిస్టు రఘును అరెస్టు చట్ట విరుద్దంగా జరిగింది. గతంలో DK Basu Vs State of West Bengal (1996) కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును పరిశీలించవచ్చు. జూన్ 3న తన ఇంటికి సమీపంలో మార్కెట్‌లో ఉన్న జర్నలిస్టు రఘుని నెంబరు ప్లేటు లేని వాహనంలో వచ్చి అపహరించారు.తరువాత జర్నలిస్టు రఘును అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. పోలీసులు అరెస్టును ప్రకటించిన సమయంలో, మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చిన సమయాన్ని పరిశీలిస్తే 190 కిలోమీటర్లు రెండున్నర గంటల్లో ప్రయాణించినట్టు భావించాల్సి ఉంటుంది.
అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ఘటనలు జరిగేందుకు కారణం కావడం లాంటి సెక్షన్లు నమోదు చేసి జర్నలిస్టు రఘును అరెస్టు చేశారని, ఆ సమయంలో ఓ రాజకీయ పార్టీ ర్యాలీ నిర్వహించిందని, ప్రజలతో బహిరంగ సభ నిర్వహించిందని, అయితే ఆ సందర్భంలో అక్రమంగా నిర్మించారని చెబుతున్న ఓ షెడ్డును నిరసన కారులు ద్వంసం చేశారని, ఈ సమాచారం ముందుగానే పోలీసులకు నిరసన కారులు ఇచ్చారని, ఈ ఘటనలో జర్నలిస్టు రఘుకు ఎలాంటి సంబంధం లేకున్నా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసునని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని, హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, జర్నలిస్టు రఘు అక్రమ అరెస్టును తాము ఖండిస్తున్నామని, వెంటనే విడుదల చేయాలని కోరారు.
డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు..
కాగా జర్నలిస్టు రఘుపై తెలంగాణ డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గంజి రఘుపై నమోదైన కేసుల వివరాలు వారి కుటుంబ సభ్యులకు ఈనెల 14లోగా ఇవ్వాలని ఆదేశించింది. ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతున్నారని, ఓ కేసులో బెయిల్ పొందితే మరో కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతూ జర్నలిస్టు రఘు భార్య గంజి లక్ష్మీ ప్రవీణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణను జూన్ 16కు వాయిదా వేశారు. కాగా జర్నలిస్టు రఘును పోలీసులు తీసుకెళ్లిన తీరు కిడ్నాప్‌ను తలపించేలా ఉందని చెబుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. జర్నలిస్టు రఘు అరెస్టును ఖండించడంతోపాటు అరెస్టు తీరుపై జాతీయ మీడియా కూడా పలు వార్తలను ప్రసారం చేసింది.











