నిజమే.. మన నేతాశ్రీలు ఇప్పుడు మంచి స్పీడు మీదున్నారు. ఒక్క క్షణం కూడా వృథా చేయట్లేదు. అటు పదవీ ప్రమాణం ముగిసిన వెంటనే నేరుగా కార్యరంగంలోకి దిగిపోతున్నారు. ఏమాత్రం ఆలస్యం చేసే ఉద్దేశం లేని నేతలు అటు పాలనలో.. ఇటు పార్టీ వ్యవహారాలకు సంబంధించి తమదైన శైలి జోరును కొనసాగించాలని భావిస్తున్నారు. వెరసి అన్నింటా దూకుడు మనస్తత్వమే కనిపిస్తోంది. ఈ తరహా దూకుడు మంచిదే అయినా.. మరీ ఇంత స్పీడేమిటి సామీ అన్న వ్యాఖ్యలు జనం నుంచి వినిపిస్తున్నాయి.
యాక్షన్ లోకి రేవంత్..
గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ పీసీసీ) అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. భారీ ర్యాలీ చేపట్టిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. పార్టీలో అసంతృప్త గళాలను వినిపించిన వారిలో చాలా మంది నేతలు అలక మాని రేవంత్ ప్రమాణానికి హాజరయ్యారు. ఈ క్రమంలో తనదైన శైలిలో ప్రసంగం చేసిన రేవంత్.. పార్టీకి లక్ష్యమేమిటన్న విషయంపై శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. ఆ వెంటనే ఇంటికెళ్లిపోయిన రేవంత్ గురువారం తెల్లవారగానే గాంధీ భవన్ కు వచ్చేశారు. పీసీసీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పదవీ ప్రమాణం చేసిన మరునాడే టీపీసీసీ తొలి సమావేశాన్ని నిర్వహించిన రేవంత్.. తన స్పీడు ఏ రేంజిలో ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.
కొత్త బాధ్యతల్లోకి కిషన్ రెడ్డి..
ఇక అటు ఢిల్లీలో బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ ను పునర్వవస్థీకరించారు. 12 మంది సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలికిన మోదీ.. ఏకంగా 36 మంది కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకున్నారు. మరో ఏడుగురికి ప్రమోషన్ ఇచ్చారు. వీరిలో చాలా మంది గురువారం ఉదయమే తమకు కేటాయించిన శాఖల బాధ్యతలను స్వీకరించారు. బుధవారం దాకా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. ఇప్పుడు కేబినెట్ ర్యాంకులో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా మారిపోయారు. ఈ మేరకు గురువారం ఉదయమే పర్యాటక శాఖ కార్యాలయానికి వెళ్లిన కిషన్ రెడ్డి.. ఆ శాఖ బాధ్యతలను స్వీకరించారు. మొత్తంగా నేతల స్పీడుతో జనంలో ఆసక్తి రేకెత్తుతోంది.
Must Read ;- రెండేళ్లలో కాంగ్రెస్ కు అధికారమే లక్ష్యం: రేవంత్











