సత్యదేవ్ నటుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ పదేళ్లలో ఆయన చేయవలసినన్ని సినిమాలు చేయలేదనే చెప్పాలి. అందుకు కారణం తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలు వస్తేనే ఆయన అంగీకరిస్తున్నాడు .. లేదంటే లేదు. అలా ఆయన వెయిట్ చేయడం వలన సినిమాల సంఖ్య తగ్గినా, ఫలానా తరహా పాత్రలు సత్యదేవ్ బాగా చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. నిజంగా ఆయన అలా పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే, ప్రేక్షకులకు గుర్తున్నాడు. చిన్న చిన్న పాత్రల నుంచి హీరో స్థాయి వరకూ చేరుకోగలిగాడు.
‘బ్లఫ్ మాస్టర్’ .. ‘బ్రోచేవారెవరురా‘ .. ‘రాగల 24 గంటల్లో’ సినిమాలు ఆయన నటనలోని ప్రత్యేకతకు అద్దం పడతాయి. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా ఆయన నటనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఇలా ఒకదానికి ఒకటి ఏ మాత్రం పోలికలేని వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ఈ సారి కూడా ఆయన కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన ‘తిమ్మరుసు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతోంది. ఇప్పటికే వదిలిన ప్రచార చిత్రాల వలన ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రస్తుత్త పరిస్థితులలో చాలా సినిమాలు ఓటీటీ వైపు అడుగులు వేస్తుంటే, ‘తిమ్మరుసు‘ థియేటర్లకు వస్తుండటం విశేషం. ఈ కథపై మేకర్స్ కి గల నమ్మకానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాను కూడా సత్యదేవ్ రెడీ చేస్తున్నాడు. ఇది కూడా విభిన్నమైన కథాకథనాలతో నడిచేదే. ఇక ‘రామసేతు‘ .. ‘స్కైలాబ్’ సినిమాలు కూడా ఆయన హీరోగా రూపొందుతున్నవే. ఈ జోరు చూస్తుంటే, గతంలో కంటే సత్యదేవ్ ఇప్పుడు దూకుడు చూపిస్తున్నట్టుగానే ఉంది. ఇక ఈ జోరుకు సక్సెస్ తోడైతే, ఆ తీరే వేరుంటుంది మరి.
Must Read ;- రాజ రాజ చోర’ మనసులు దొంగిలించేనా?











