ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే ఏ రకమైన చర్య అయినా శిక్షార్హమే. తమకు ఓటు వేయాలంటూ డబ్బో, మద్యమో, లేదంటే.. ఇంకే ఆభరణమో, ఇంకే తాయిలమో చూపడం మన ప్రజాప్రతినిధులకు అలవాటుగా మారిపోయింది. అంతేకాకుండా ప్రజా ప్రతినిధుల నుంచి అలాంటి తాయిలాలు లేకుండా ఓటు వేసేందుకు ఆసక్తి చూపని ఓటర్లు కూడా మనకు కొత్తేమీ కాదు. అయితే ఓటుకు నోటు ఇవ్వడంతో పాటు నోటు స్వీకరించడం కూడా నేరమే కదా. అయితే లక్షల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో నోటు ఇవ్వజూపిన ప్రజాప్రతినిధిని గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు గానీ.. ప్రజా ప్రతినిధి నుంచి లబ్ధి పొందిన ఓటరును గుర్తించడం మాత్రం కాస్తంత కష్టమే. దృష్టి పెడితే ఇది కూడా పెద్ద కష్టమేమీ కాకున్నా.. ఓటుకు నోటు ఇవ్వజూపడాన్నే తీవ్రంగా పరిగణిస్తున్నాం.
ఓటర్లను ప్రలోభపెట్టారు..
2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దాదాపుగా అన్ని చోట్లా నోట్లు విచ్చలవిడిగా పంపిణీ అయ్యాయి. మద్యం ఏరులై పారింది. అయితే కొందరిపై మాత్రమే పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అలాంటి వారిలో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్తిగా బరిలోకి దిగిన మాలోత్ కవితపై కూడా ఉన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేలా కవిత వ్యవహరించారన్న ఫిర్యాదుతో బూర్గంపహాడ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ తరహా కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల కోర్టుకు ఈ కేసు బదిలీ అయిపోయింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఆమెను దోషిగా తేల్చడంతో పాటుగా ఆరు నెలల జైలుతో పాటు రూ.10 వేల జరిమానాను విధించింది.
శిక్ష ఖరారు ఆ వెంటనే బెయిలు
ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. హైదరాబాద్ లోని ఈ కోర్టు నుంచి తీర్పు వెలువడిన వెంటనే రూ.10 వేల జరిమానాను మాలోత్ కవిత చెల్లించేశారు. అంతేకాకుండా అక్కడికక్కడే తనకు బెయిల్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆమెపై వచ్చిన ఫిర్యాదును విచారించేందుకు ఏళ్ల తరబడి టైం పట్టగా.. ఆమెకు శిక్ష పడిన తర్వాత బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ మాత్రం వెనువెంటనే విచారణకు వచ్చేసింది. అంతేకాకుండా ఆమె కోరినట్లుగానే ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ.. అదే కోర్టు అకకడికక్కడే నిర్ణయం వెలువరించింది. వెరసి ఓటర్లను ప్రలోభపెట్టిన కేసులో దోషిగా తేలిన ఎంపీ.. ఓ రూ.10 వేలు కోర్టుకు చెల్లించి.. మిగిలిన శిక్షకు సంబంధించి బెయిల్ పై ఫ్రీగా బయటకు వచ్చేశారు.
Must Read ;- నేల విడిచి సాము.. ఇన్‌సైడర్ లో జగన్ చేసిందిదేగా











