ED Raids On The illicit Shipment Of Hair In Telugu States :
వెంట్రుకలను మనం ఈజీగా అలా తీసి పారేస్తాం గానీ.. వీటినే ఆధారంగా చేసుకుని అక్రమ దందా నడుస్తున్న వైనం తెలుసా? ఈ దందాలో మన దేశం నుంచి.. ఇంకా చెప్పాలంటే.. మన తెలుగు నేల నుంచి తల వెంట్రుకలు విదేశాలకు తరలిపోతున్నాయట. అదేదో.. విదేశాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా మన దేశానికి తరలివస్తున్న బంగారాన్ని నిత్యం మన ఎయిర్ పోర్టుల్లో పోలీసులు పట్టుకుంటున్నట్లుగానే.. మన దేశం నుంచి మన తల నుంచి రాలిపోయిన వెంట్రుకలు విదేశాలకు అక్రమ మార్గాల్లో తరలిపోతున్నాయట. ఇదేదో చిన్న వ్యవహారమనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఈ వ్యవహారంపై ఇప్పుడు తీవ్ర ఆర్థిక నేరాలకు చెందిన కేసులను దర్యాప్తు చేసే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విస్తృత సోదాలు జరుపుతున్నారు. ఈ సోదాలన్నీ కూడా తెలుగు నేలకు చెందిన హైదరాబాద్, గుంటూరుల్లో కొనసాగుతున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.
9 చోట్ల దాడులు..
తెలుగు నేల కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పలు కంపెనీలు తల వెంట్రుకలను విదేశాలకు అక్రమ మార్గాల్లో తరలిస్తూ స్మగ్లింగ్ కు పాల్పడుతున్న వైనంపై గతంలోనూ ఓ సారి వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత ఈ విషయంలో పెద్దగా కదిలిక లేకపోవడంతో దానిని అందరూ మరిచిపోయారు. అయితే తాజాగా మంగళవారం నాడు అటు తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు ఇటు ఏపీలోని గుంటూరుల్లో ల్యాండైన ఈడీ అధికారులు ఏకంగా 9 ప్రాంతాల్లో విస్తృత సోదాలు ప్రారంభించడంతో ఈ వ్యవహారంపై మరోమారు కలకలం రేపింది. ఈడీ సోదాలు జరుపుతున్న కంపెనీల విషయానికి వస్తే.. వికాస్ ఎంటర్ ప్రైజెస్, నరేష్ హెయిర్ ఎక్స్ పోర్టర్స్, హ్రితిక్, ఎక్సలెంట్ హెయిర్ కంపెనీల్లో ఈ ఈడీ సోదాలు కొనసాగిస్తోందట. విశ్వసనీయ సమాచారాన్ని విశ్లేషించుకున్న మీదటే ఈడీ దాడులు చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒకేసారి ఏకంగా 9 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తున్నదంటే.. ఈ వ్యవహారంలో వందలు, వేల కోట్ల మేర అక్రమాలు చోటుచేసుకున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదో పెద్ద దందా!
మన తలపై హెయిర్ పెరిగితే మనకు చిరాకే. అదే ఆ హెయిర్ ను మనం కటింగ్ చేయించుకుంటే హెయిర్ స్మగ్లర్లకు పండుగే. సముద్ర తీరానికి సమీపంలో ఉన్న నెల్లూరు జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాకు పొరుగునే ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లాలోని ఇతర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని అక్రమార్కులు తల వెంట్రుకలను స్మగ్లింగ్ చేస్తున్నారని ఈడీ భావిస్తోంది. ఈ విషయంపై తనకు అందిన ఫిర్యాదుపై చాలా రోజులుగా రహస్య విచారణ చేపట్టిన ఈడీ.. ఈ దందా ద్వారా ఏటా రూ.6 వేల కోట్ల నుంచి 8 వేల కోట్ల మేర చేతులు మారుతున్నట్లుగా కూడా ఓ నిర్ధారణకు వచ్చింది. అయితే అధికారులకు స్మగ్లింగ్ పై ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరిస్తున్న ఈ కంపెనీలు.. హెయిర్ కటింగ్ సెలూన్లనే కేంద్రంగా చేసుకుని.. చైనా, యమన్మార్, బంగ్లాదేశ్ లకు తల వెంట్రుకలను తరలిస్తున్నాయట. నకిలీ వే బిల్లులతో సాగుతున్న ఈ వ్యవహారంపై ఈడీ దర్యాప్తులో ఇంకెన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తాయోనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- ఆ రెండూ పోయాయి.. ఇప్పుడు ఇంకొకటి











