ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న కేసుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ దఫా కోర్టు మెట్లెక్క తప్పదన్న వాదనలు కలకలం రేపుతున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల్లో భారీ ఎత్తున సొమ్ములు చేతులు మారాయన్న వ్యవహాల్లో సీబీఐ చేసిన ఆరోపణల ఆధారంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఏడు కేసుల్లో ఈడీ చార్జిషీట్లను కోర్టుకు సమర్పించగా.. రెండు రోజుల క్రింత వాన్‌పిక్, లేపాక్షి నాలెడ్జి కేసుల్లోనూ చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిని స్వీకరించిన సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. సమన్లు జారీ అయిన వారిలో ఏ1గా ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఏ2గా ఉన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిలతో పాటు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఆర్టీఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాశ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు శామ్మూల్, మన్‌మోహన్ సింగ్ లు ఉన్నారు.
మినహాయింపు దక్కేలా లేదు
సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో విచారణను ఎలాగోలా వాయిదా వేసేలా చర్యలు చేపడుతున్న జగన్ అండ్ కో.. ఇప్పుడు ఈడీ కేసుల్లో వాయిదాలు కోరే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే.. ఈ నెల 22న తమ ముందు హాజరు కావాలని కోర్టు జగన్ అండ్ కోకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కోర్టు జారీ చేసిన సమన్లు కూడా నిందితులకు చేరినట్టే. ప్రత్యేకించి వాన్ పిక్ కేసు కీలకమైనదిగానే భావిస్తున్నారు. వేలాది కోట్ల రూపాయల మేర అక్రమాలు సాగాయని, తాము పెట్టిన పెట్టుబడులను వెనక్కి ఇప్పించాలని నిమ్మగడ్డ ప్రసాద్ తో ఒప్పందం చేసుకున్న రస్ ఆల్ ఖైమా ఇప్పటికే కోర్టులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో కొంతకాలం క్రిత విదేశాలకు వెళ్లిన నిమ్మగడ్డ ప్రసాద్ ను విదేశాల్లోనే అరెస్టైపోయారు. అక్కడి నుంచి ఆయన విడుదలయ్యారో, లేదో కూడా తెలియని పరిస్థితి. మొత్తంగా విదేశీ కంపెనీల ప్రమేయం ఉన్న ఈ కేసు విచారణను వాయిదా వేయించేలా జగన్ కు ఇప్పుడు అవకాశమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కేసుల విచారణలకు వ్యక్తిగత మినహాయింపులను కూడా కోరేందుకు జగన్ కు సరిపడినంత సమయం లేదనే చెప్పాలి. వెరసి ఈ దఫా జగన్ కోర్టు మెట్లు ఎక్కక తప్పదు.. కోర్టు బోనులో నిలబడకా తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మిగిలిన వారి పరిస్థితేంటో?
సీబీఐ కేసుల విచారణలను పలు కారణాలు చెప్పి వాయిదా వేయించుకున్న జగన్.. ఈ వ్యవహారాల్లో దాఖలు అవుతున్న కొత్త పిటిషన్ల విచారణకు సంబంధించి వ్యక్తిగత విచారణల నుంచి మినహాయింపు దక్కేలా కోర్టులను అభ్యర్థించి విజయం సాధించారు. అయితే అటు విజయసాయిరెడ్డి గానీ, ఇతర నేతలు, అధికారులు మాత్రం తరచూ జరుగుతున్న కోర్టు విచారణలకు హాజరవుతున్నారు. సర్వీసులో ఉండగా.. అధికారులు ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలన్న దిశగా పరిపరి విధాలుగా ఆలోచించి.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లభించలేదు. ఈ క్రమంలో శామ్యూల్ తో పాటు మన్ మోహన్ సింగ్ లు సర్వీసు నుంచి రిటైరైపోయారు. సర్వీసు నుంచి రిటైరైనా వీరిద్దరూ వాన్ పిక్ కేసు విచారణకు తప్పనిసరిగా హాజరు కాక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఇక ఎప్పుడో మంత్రిగా పనిచేసిన పాపానికి.. ఇప్పుడు జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కకపోగా.. జగన్ పై నమోదైన కేసుల విచారణకు హాజరుకాక తప్పదా? అన్నట్లుగా ధర్మాన ప్రసాదరావు ఒకింత ఆగ్రహంతో ఉన్నట్లుగా సమాచారం. ఇక నిమ్మగడ్డ పరిస్థితి అయితే వర్ణించడానికే సాధ్యం కానంతగా ఉంది. జగన్ తో కలవనంత వరకు ఆయన మకిలి అంటని పారిశ్రామికవేత్తే. అయితే ఎప్పుడైతే జగన్ తో కలిశారో.. అప్పుడే అవినీతి మకిలి అంటించుకుని జైలు జీవితం గడుపుతూ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అయినా కూడా ఇప్పుడు వాన్ పిక్ కేసులో కోర్టుకు ఆయన హాజరు కాక తప్పని పరిస్థితి నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ధిక్కారం జగన్‌ది.. జైలు ఎవరికో?











