ఆ ప్రాంతంలో ఆయన కుటుంబానికి ఎదురే లేదు. ఆయన సోదరుడు ముఖ్యమంత్రి అవడమే కాదు.. రాష్ట్రమంతా ఇమేజ్ ఉన్న నాయకుడు. ఆయన సైతం ఎంపీగా, మంత్రిగా పని చేశారు. ఆయన అన్న కొడుకే నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ఆయన చావుకు కారణం తెలియడం లేదు. చంపిందెవరో తెలియడం లేదు. సారీ.. తెలియకపోవడం కాదు.. తెలిసినా తేల్చడం లేదు. అందుకే ఆయన కుమార్తె రోడ్డెక్కి ఆవేదనతో న్యాయం కోసం అడుక్కోవాల్సి వస్తోంది. ఇది నిజంగా బాధాకరం. అధికారంలో ఉంటే ఏమైనా చేయగలరని.. వ్యవస్ధను తొక్కిపారేసి మరీ.. తామనుకున్నట్లు చేసుకోగలరని మరోసారి నిరూపించబడింది. చట్టం, న్యాయం ఏ వ్యవస్ధ అయినా సరే అధికారం ముందు ఏమీ చేయలేవని తేలిపోతోంది.
ఢిల్లీలో తన బాధను చెప్పుకున్న సునీతారెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ తన బాధను చెప్పుకున్నారు. ఆమె ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాలనే కుదిపేశాయి. తమ బంధువులే చంపారని.. రాజకీయ కారణాలే దీని వెనక ఉన్నాయని స్పష్టంగా చెప్పారు. దీంతో ఇప్పటి వరకు అనుమానాలుగాను, రూమర్లుగాను చెప్పుకుంటున్నవన్నీ నిజాలేనని అనుకోవాల్సి వస్తోంది. కడప ఎంపీ టిక్కెట్‌పై ఏర్పడ్డ వివాదమే కారణమా? ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డే దీని వెనక ఉన్నాడా? అనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. ఇప్పుడు సునీతారెడ్డి కామెంట్లతో ఆ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. పోలీసులు ఎందుకు సరిగా విచారణ చేయలేదో.. సాక్షులు ఎందుకు చనిపోతున్నారో.. జగన్ సీబీఐ విచారణ అడిగిమరీ.. తర్వాత వద్దని ఎందుకు అన్నారో.. అన్నిటికి సమాధానాలు దొరికినట్లే అనిపిస్తోంది.
మంత్రి కొడాలి నాని ఒక విచిత్ర వాదన
మంత్రి కొడాలి నాని ఒక విచిత్ర వాదనను తీసుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఈ హత్య జరిగిందని.. ఈ ఆరోపణలే నిజమైతే చంద్రబాబు అప్పుడే కేసు పెట్టి అరెస్టులు చేయించేవారని.. అలా ఎందుకు జరగలేదని ఆయన ప్రశ్నించారు. పాపం నానిగారు.. జనం ఫ్లాష్ బ్యాక్ మర్చిపోతారనుకుని ఏదంటే అది మాట్లాడేస్తున్నారు. ఆ హత్య జరిగిన సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కేంద్రంలోని బీజేపీ సహకారంతో వైసీపీ దాదాపు అధికార పార్టీగా అప్పటికే మారిపోయింది. చీఫ్ సెక్రటరీని మార్చేశారు.. ఎస్పీలు, కమిషనర్లను బదిలీలు చేసేశారు.
ముందు గుండెపోటు అంటూ..
వివేకా హత్య జరగగానే ముందు గుండెపోటు అని ఎందుకు చెప్పారు? ఆ తర్వాత గంటకే అన్ని విషయాలు పోలీసులు బయటపెట్టడంతో.. హత్య జరిగిందని.. దీనికి చంద్రబాబే కారణమని.. ఆదినారాయణరెడ్డి హస్తముందని ఆరోపణలు ఎందుకు చేశారు? సీబీఐ విచారణ చేయాలని ఎందుకు డిమాండ్ చేశారు? అంటే ముందు కవర్ చేయాలనుకున్నారు.. అది కుదరకపోవడంతో.. టీడీపీపై ఆ బురద వేయాలనుకున్నారు. అన్ని విషయాలు తెలిసిన పోలీసు అధికారులను వెంటనే ఎందుకు బదిలీ చేయించారు? అధికారంలోకి వచ్చాక జగన్ సీబీఐ విచారణ అవసరం లేదని ఎందుకన్నారు? డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యక్షంగా విచారణలో ఇన్‌వాల్వ్ అయినా ఎందుకు తేల్చలేకపోయారు? సవాంగ్ వెళ్లొచ్చి జగన్‌కు బ్రీఫింగ్ ఇచ్చాక.. జగన్ సునీతారెడ్డితో ప్రత్యేకంగా ఎందుకు భేటీ అయ్యారు? అప్పటి నుంచి సునీతారెడ్డి ఎందుకు జగన్‌కు దూరంగా ఉంటున్నారు? ఇవన్నీ సమాధానాలు ఉన్న ప్రశ్నలే.. కాని ఎవరూ పైకి చెప్పలేరు. అంతే..
Must Read ;- రాజకీయ ప్రమేయంతోనే వివేకానందరెడ్డి హత్య.. సునీతారెడ్డి