మాస్ ఎంటర్ టైనర్ చిత్రాలకు రవితేజ పెట్టింది పేరు. అందుకే ఆయనను మాస్ మహారాజాగా అభివర్ణిస్తుంటారు. తాజాగా ఆయన ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం “ఖిలాడి”. .’ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్‌లైన్. రమేష్ వర్మ దర్శకుడు. జయంతీలాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. చకా చకా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన ఓ భారీ జైలు సెట్‌లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో రవితేజ పాల్గొంటున్నారు.

దక్షిణాది సినీరంగంలోని నలుగురు టాప్ ఫైట్ మాస్టర్లు పనిచేస్తుండటంతో యాక్షన్ లవర్స్‌కు ఈ చిత్రం మంచి ట్రీట్ కానున్నదని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. ఇప్పటికే ఈ చిత్రానికి రామ్, లక్ష్మణులు ఫైట్ మాస్టర్లుగా పనిచేస్తుండగా, కొత్తగా మరో ఇద్దరు ఫైట్ మాస్టర్లు అన్బు-అరివు ఈ చిత్ర బృందంలో చేరారు. ప్రత్యేకించి వీరిద్దరూ తీస్తున్న భారీ యాక్షన్ సీక్వెన్సులు చిత్రానికి చాలా పెద్ద ఆకర్షణ అవుతాయని దర్శక, నిర్మాతలు తెలిపారు.

గతంలో ‘కేజీఎఫ్’, ‘ఖైదీ’ లాంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు హై ఓల్టేజీ ఫైట్స్ సమకూర్చిన అన్బు-అరివు “ఖిలాడి”.చిత్రానికి ఒళ్లు గగుర్పాటు కలిగించే యాక్షన్ సీన్లను కంపోజ్ చేస్తున్నారని వారు చెప్పారు.
రవితేజ సరసన మీనాక్షి చౌధరి మొదటి హీరోయిన్ గా నటిస్తుండగా, డింపుల్ హయతి రెండో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్ విస్సా, సాగర్, పాటలు: శ్రీమణి, సంగీతం: దేవి శ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, ఎడిటింగ్: అమర్ రెడ్డి, ఆర్ట్: గాంధీ నడికుడికర్, నిర్మాత: సత్యనారాయణ కోనేరు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ వర్మ.
Must Read ;- ‘ఎఫ్ 3’లో మాస్ మహారాజా నటిస్తున్నాడా.? లేదా.?











