ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ‘రాధేశ్యామ్’ సినిమాపైనే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన విషయాలను .. విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాళ్లు ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అందమైన ప్రేమకథా చిత్రంగా తీర్చిదిద్దుతున్న ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

‘సంక్రాంతి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి టీజర్ రావొచ్చునని అభిమానులంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దాంతో అభిమానులంతా కూడా అసంతృప్తికి లోనయ్యారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చే నెలలో టీజర్ రానుందనే ఒక టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. ప్రపంచ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నట్టు చెప్పుకుంటున్నారు. ‘రాధేశ్యామ్‘ రొమాంటిక్ లవ్ స్టోరీ కావడం వలన, ఇది కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేయలేం.
ప్రభాస్ సరసన నాయికగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాలో, భాగ్యశ్రీ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. యూవీ క్రియేషన్స్ వారితో కలిసి కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ సినిమా, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల కానుంది. ‘సాహో’ పరాజయం కారణంగా డీలాపడిన ప్రభాస్ అభిమానులు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఆశపడుతున్నారు. వాళ్ల ముచ్చటను ఈ సినిమా తీరుస్తుందేమో చూడాలి మరి.
Must Read ;- ప్రభాస్ ‘సలార్’ లో నైఫ్ లాంటి హీరోయిన్.. ?











