అమరావతి రాజధాని భూసేకరణ వ్యవహారంలో దళితులకు సంబంధించిన భూములు నిబంధనలకు విరుద్దంగా తీసుకున్నారని, దళితులకు నష్టం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం స్టే ఇచ్చింది. కేసు విచారణలో భాగంగా హైకోర్టులో ప్రభుత్వం చెప్పిన వాదన ప్రకారం చూస్తే.. ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాలేమైనా ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నకు.. విచారణ ప్రాథమిక దశలో ఉన్న సమయంలో వివరాలు ఇవ్వలేమని, పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తే..వివరాలు ఇవ్వడం సాధ్యం అవుతుందని చెప్పారు. ఇక మరోవైపు అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతుల నుంచి వివరాలు సేకరిస్తోంది సీఐడీ. తాడేపల్లి, మందడం మండలాల్లో దళిత రైతులతో సీఐడీ అధికారులు మాట్లాడుతున్నారు. ఇక్కడే రాజకీయపక్షాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దళిత రైతుల ఫిర్యాదులను బయట పెట్టకపోవడంతో..
ఇప్పటి వరకు దళిత రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదునూ బయట పెట్టకపోవడంపైనా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుని టార్గెట్ చేసిందన్న విమర్శలు వచ్చాయి. అంతేకాదు… వాస్తవానికి రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు సర్కారు ఏపీ సీఆర్‌డీఏ చట్టం-2014 కోసం 2015 జనవరి 1వ తేదీన భూసేకరణ నిబంధనలు పొందుపరుస్తూ జీవో నంబర్ 1 విడుదలైంది. అయితే అసైన్డ్ భూములకు సంబంధించి 1954కి ముందువా, తరువాత భూములకూ నిబంధనలు వర్తిస్తాయా లేదా అనే అనుమానాలతో 26 గ్రామాల్లో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అప్పట్లో కొన్ని ఆందోళనలూ జరిగాయి. చివరికి… సీఆర్డీయే అధికారుల సూచనల మేరకు మున్సిపల్ యాక్ట్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ 2016 ఫిబ్రవరి 17వ తేదీన జీవో 41 విడుదలైంది. భూసేకరణ ప్రక్రియకు ఈ జీఓనే ముఖ్యమైందని చెబుతున్నారు. కాగా భూసేకరణకు సంబంధించి సీఆర్డీఏ నుంచి గతంలో వచ్చిన సూచనల మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ సీఆర్డీఏ కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ తరువాత 32 రోజులకు (2016 మార్చి 22న) అప్పటి సీఎం కార్యాలయం ఆమోదం లభించింది. ఈ విషయాన్నే మంత్రి నారాయణ తరఫు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. వీటితోపాటు చంద్రబాబుపై పెట్టిన కేసులు చెల్లవని వాదించారు.
Must Read ;- అవీ అసైన్డ్ భూములేగా.. జగన్‌పై కూడ కేసు పెట్టాలన్న హర్షకుమార్
ఫిర్యాదు మేరకే హడావుడి
ఇలాంటి వ్యవహారంలో కేసు విచారణ చేయాల్సి వస్తే తొలుత ప్రాథమిక ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. ఆ ఆధారాల్లేకుండా కేవలం ఫిర్యాదు మేరకు ఇలాంటి కేసుల్లో హడావుడి చేయడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. నోటీసుల జారీ, సోదాలు చేయడాన్ని బట్టి వేధింపులుగానే భావించాల్సి ఉంటుందని పలువురు నాయకులు అభిప్రాయ పడుతున్నారు. తీరా నోటీసులు జారీ చేశాక ఆధారాల కోసం సమాచారం సేకరించడం ఏంటనే ప్రశ్నకూడా తలెత్తుతోంది. అలా విచారణ చేసే క్రమంలో ఈ జీఓతో, చట్టంతో సంబంధం ఉన్న అధికారులందరినీ ఈ కేసు పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. అలాంటిది జరగకపోవడం, కొంతమందిని టార్గెట్ చేసుకున్ని విచారణకు పిలిపిస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది.
రైతులపై ఒత్తిళ్లు చేస్తారా..
ఇక తాడేపల్లి, మందడంలో దళిత రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాల సేకరణను వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. అయితే పరోక్షంగా ముందుగానే చంద్రబాబుకు వ్యతిరేకంగా చెప్పాలనే ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనే సందేహం కూడా కలుగుతోందనే చర్చ నడుస్తోంది. ఈ జీఓపై అప్పట్లో లేని అభ్యంతరం ఇప్పుడెందుకనే ప్రశ్న తలెత్తుతుండగా, అభ్యంతరాలు ఉంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి న్యాయపోరాటం చేయవచ్చని, గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు రూపొందించారనే కారణంతో అప్పటి సీఎంని నేర బాధ్యుడిగా పేర్కొనడం ఏంటనే ప్రశ్న కూడా తలెత్తోంది.
ఈ కేసులో అప్పటి జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారులు విచారించారు. గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల జాబితాను కూడా సేకరిస్తున్నారు. అదే సమయంలో జీఓ 41ను జారీ చేసిన అజయ్ జైన్‌ను కూడా విచారిస్తారా లేదా అనేది చూడాలి. మొత్తం మీద ఆర్కే ఫిర్యాదు చేయడం, సీఐడీ నోటీసులు జారీ చేయడం..ప్రభుత్వ స్పందన.. ఈ పరిణామాలు చూస్తే.. ఉద్దేశపూర్వకంగానే ఇరికించే యత్నం చేస్తున్నారని పార్టీల్లో చర్చ నడుస్తోంది.
Also Read ;- కేసులు వెనక్కు తీసుకోకుంటే ఆళ్లపై అట్రాసిటీ కేసులు పెడతాం : మార్టిన్