జియో రాకతో దేశంలో టెలికం రంగం స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఒక్కొక్కటిగా అన్ని నెట్ వర్క్ లనూ తొక్కేసుకుంటూ అతిపెద్ద టెలికం నెట్ వర్క్‌గా అవతరించింది జియో. ఇంతటి పోటీని తట్టుకుని అంతో ఇంతో నిలబడ్డ నెట్ వర్క్ ఏదైనా ఉందంటే.. అది ఎయిర్ టెల్ మాత్రమే. 4జీ నెట్వర్క్‌లో మొదలైన ఈ పోటీ ఇప్పుడు 5జీకి పాకింది. వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి 5జీని తీసుకురాబోతున్నట్టు రిలయన్స్ జియో గత సంవత్సరం డిసెంబరులో ప్రకటించగా, ఇప్పుడు ఎయిర్‌టెల్ ఓ అడుగు ముందుకు వేసి ఏకంగా 5జీని ప్రదర్శించి మరీ చూపించేసింది. గురువారం హైదరాబాద్ లో వాణిజ్య నెట్వర్క్ పై డెమో ఇచ్చింది. నాన్-స్టాండ్ ఎలోన్ (ఎన్ఎస్ఏ) నెట్‌వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌పై 5జీ, 4జీని లైవ్‌లో సమాంతరంగా పనిచేయించి చూపించింది.
ఎయిర్‌టెల్ 5జీ
ఎయిర్‌టెల్ 5జీ వేగం ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్ టెక్నాలజీస్ కంటే పదింతలు ఎక్కువగా ఉంటుంది. అంటే.. ఓ సినిమాను 5జీ ఫోన్లలో సెకన్లలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డీవోటీ) కనుక అనుమతి ఇస్తే 5జీ, 4జీ నెట్వర్క్ ను ఒకే స్పెక్ట్రమ్ బ్లాక్ నుంచి ఆపరేట్ చేస్తామని ఎయిర్‌టెల్ పేర్కొంది. అంతేకాదు, కొన్ని నెలల్లోనే 5జీని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఈ 5జీ డెమో కోసం ఎయిర్‌టెల్.. ‘ఒప్పో రెనో 5 ప్రొ’, ‘ఒప్పో ఫైండ్ ఎక్స్2 ప్రొ’ స్మార్ట్‌ఫోన్లను వినియోగించింది.
Must Read ;- అంబానీ సామ్రాజ్యంలో నవతరం ఆరంభమైంది










