ఒక్క మార్క్ విలువ విద్యార్థికి తెలుస్తుంది.. ఒక్క సెకను విలువ క్రీడాకారుడికి తెలుస్తుంది.. అలాగే సంపద పట్టిక అగ్రస్థానానికి చేరడానికి కేవలం ఒక్కరోజు చాలని నిరూపించాడు ‘ఎలెన్ మస్క్’. దాదాపు దశాబ్ద కాలం పైగా కష్టపడుతున్నా దక్కని అపర కుబేర పదవి ఒక్క రోజులో అతనిని శిఖరాగ్రాన నిలబెట్టింది. కానీ, షేర్స్ అనేవి వైకుంఠపాళి ఆట వంటిదే.. ఎప్పుడు నిచ్చెనలు ఎక్కిస్తుందో.. ఏ సమయాన పాము నోటికి బలిచేస్తుందో తెలియదు. అగ్రస్థానానా కొనసాగుతున్న జెఫ్ బెజోస్.. నేడు ఆ స్థానాన్ని ఎలెన్‌కి అప్పగించక తప్పలేదు. ఒకానొక సమయంలో ముకేష్ అంబానీ సంపద లక్ష కోట్లు ఆవిరైపోయింది. తిరిగి అదే షేర్స్‌తో తన స్థానాన్ని అందుకున్నాడు అంబానీ. మరి ఎలెన్ స్థానం ఎంత కాలం? ఈ మురిపెం నిలబడుతుందా? తన అగ్రస్థానాన్ని కొనసాగించగలడా? ఈ అంకెల గారడిలో తన స్థానాన్ని నిలుపుకుంటారా?
2002 మొదలైన వ్యాపార ప్రస్థానం
2002 సంవత్సరం ‘స్పేస్ ఎక్స్’ని స్థాపించడంతో తన వ్యాపార ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు ఎలాన్. ఆపై 2004లో విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా మోటార్స్‌తో చేతులు కలిపి.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం ప్రారంభించాడు. నిజంగా అది ప్రారంభం మాత్రమే అని చెప్పాలి. వాళ్లతో తన వ్యాపార సంబంధాలు మొదలుపెట్టిన ఏడాదిలోనే.. ఆ కంపెనీ ప్రాడక్ట్స్ ఆర్కిటెక్ట్‌గా పదోన్నతి పొందాడు. అక్కడ ఎలాంటివి ఉత్పత్తి జరగాలి.. వాటి డిజైనింగ్ ఎలా ఉండాలి అనే విషయాల పైన కూడా అధిపత్యాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత, అనతి కాలంలోనే.. 2008లో టెస్లా సిఇఓ పదివిని అందుకున్నారు ఎలాన్.
Must Read ;- రతన్ టాటా: సామాన్యుడి కలల సారధి
అద్భుతమైన కాలం 2015-2016
ఇక ఆపై తన వ్యాపార విస్తరణ ప్రణాళికలు మొదలుపెట్టాడు. తన ఆలోచనలకు రూపం దాల్చడానికి 7 ఏళ్ల సమయం తీసుకున్నా.. ఏడాది కాలంలో మూడు కంపెనీలు స్థాపించి తన సత్తా చాటాడు ఎలాన్. 2015 డిసెంబర్‌లో ‘ఓపెన్ ఎఐ’ కంపెనీ సహవ్యవస్థాపకుడిగా మాత్రమే కాకుండా కో-ఛైర్మన్‌గా బాధ్యతలను తీసుకున్నాడు. ఆపై 8 నెలల వ్యవధిలోనే 2016, జులైలో ‘బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ’కి సంబంధించిన ‘న్యూరాలింక్’ అనే కంపెనీ సహవ్యవస్థాపకుడిగా మారాడు. అంతటితో తన ప్రస్థానం ఆగిపోయిందనుకోకండి.. 6 నెలలు తిరక్కుండానే.. అదే సంవత్సరం 2016 డిసెంబర్ లో జియో టెక్నాలజీకి సంబంధించిన ‘ద బోరింగ్ కంపెనీ’ పేరుతో ఒక సంస్థను స్థాపించాడు. ఇన్ని కంపెనీలు.. ఎన్నో బాధ్యతులు.. అయినా ఎక్కడా తొణకకుండా అన్నింటీనీ నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు ఎలాన్.
కేవలం ఒక్కరోజులో తారుమారైన పరిస్థితి..
టెస్లా అధినేత.. నేడు ప్రపంచ కుబేరుడిగా మారాడు. ఇదంతా షేర్ మార్కెట్ మాయజాలం. గురువారం టెస్లో షేరు విలువ 48 శాతం పెరగడంతో ఎలాన్ అపర సంపన్నుడిగా అవతరించాడు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ షేర్ల ధరల ప్రకారం.. ప్రతి ట్రేడింగ్ రోజు ముగిశాక ప్రపంచ కుబేరుల నికర సంపదను బ్లూమ్‌బర్గ్ ప్రకటిస్తుంటుంది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం, గురువారం ఉదయం అమెరికా సమయం ప్రకారం10:15 గంటలకు ఎలాన్ మస్క్ నికర సంపద 188.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14.13 లక్షల కోట్ల) కు చేరింది. దీని ప్రకారం గురువారం ఉదయం ట్రేడింగ్‌లో టెస్లా షేర్ల దూకుడుతో సంపన్నుల స్థానాలు తారుమారయ్యాయి.
బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి జెఫ్ బెజోస్ 184 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో 181 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ ఉన్నారు. కేవలం తర్వాతి రోజు ఉదయం ట్రేడింగ్ మొదలయిన కొద్ది సమయంలోనే ఎలాన్ అగ్రస్థానానికి ఎగబాకారు.
Also Read ;- రిలయన్స్ కొనదట.. కాని ఆ ‘సరఫరా’దారు ఎవరు?
ఒకప్పటి వారి స్థానాలు ఏమయ్యాయి
ప్రపంచంలో సంపన్నుడు ఎవరు అంటే వెంటనే బిల్ గేట్స్ అంటారు. నేటి జనరేషన్ వాళ్లకు సంపన్నుడంటే మార్క్ జుకర్ బర్గ్ అనే పేరు వస్తుంది. మరి వారేమయ్యారు.. ఇప్పుడు వారి స్థానాలు పడిపోయాయి. బిల్ గేట్స్ (132 బి.డాలర్లు) మూడో స్థానంలో ఉంటే, మార్క్ జుకర్ బర్గ్ (99.9 బి.డాలర్లు) 5 వ స్థానంలో ఉన్నాడు. ఇవి కూడా శాశ్వతాలు కాదు. అక్కడి నుండి ఇంకా దిగజారవచ్చు.. లేదా అనూహ్యంగా ఎగబాకి అత్యంత సంపన్నులుగా మారవచ్చు.
ఏడాది కాలంలో..
2004లో మొదలైన టెస్లా కంపెనీ.. గత ఏడాది కాలంలో అగ్రపథాన దూసుకుపోతుంది. టెస్లా షేర్లు ఏడాది కిందటితో పోలిస్తే ఏకంగా 743 శాతం మేర దూసుకెళ్లడంతో ఏడాది వ్యవధిలోనే ఎలాన్ మస్క్ సంపద విలువ 150 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఈ షేర్ల అంకెల గారడీతో ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేగంగా ఇంతటి సంపద సృష్టించిన రికార్డు సొంతం చేసుకున్నారు ఎలాన్.
ఈ స్థానం నిలిచేనా?
ఈ అగ్రస్థానం నిలబెట్టుకుంటాడా అనే మాటకు ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే.. అగ్రస్థానం అందుకోవడం వారి చేతిలో ఎలా ఉండదో.. దాన్ని కొనసాగించడం.. నిలబెట్టుకోవడం కూడా వారి చేతిలో లేదు. కానీ ఏ కంపెనీ అయినా మదుపర్ల పైనే ఆధారపడి ఉంటుంది. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుని.. కంపెనీ భవిషత్తులో అభివృద్థి పథంలో దూసుకుపోతుంది.. మన షేర్లు పెరుగుతాయి అనే నమ్మకం కలిగించగలిగితే.. షేర్లు అగ్రపథానా దూసుకుపోతాయి. సంపద విలువ పెరిగినంత కాలం మాత్రమే ఈ అగ్రస్థానం. అలాగనీ.. ఇన్నీ చేసినా కూడా అగ్రస్థానం ఉంటుందనే నమ్మకం లేదు. మరో కంపెనీ దూసుకుపోవడం ఖాయం.. ఇలాంటి అంకెల గారడిలో ఎవరు.. ఎప్పుడు అగ్రస్థానాన్ని అందుకుంటారో.. పాతాళానికి చేరుకుంటారో చెప్పడం కష్టమైన పనే.
Also Read ;- ప్రముఖ డార్డన్ కంపెనీలో అత్యున్నత స్థాయిలో తెలుగువాడు ‘రాజేష్ వెన్నం’