ఏపీ, తెలంగాణల్లో రెండు రోజుల నుంచి రాజకీయంగా ఓ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె , ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ చెల్లెలు షర్మిల కొత్త రాజకీయ పార్టీపెట్టేందుకు అంతా సిద్ధమైందన్న కథనం ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ప్రచురితమైంది. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టేందుకు సిద్ధమైనట్టు సదరు కథనం చెప్పింది. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టేవిషయంతోపాటు అసలు ఆంధ్రజ్యోతి ఆ కథనం రాసేందుకు ఉన్న సోర్స్ ఏంటనే అంశంపై చర్చ నడుస్తోంది.
ఈ కథనంపై స్పందించిన వైఎస్ షర్మిల..‘తాను పార్టీ పెడుతున్నట్లు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త ప్రచురితమైన విషయం ఆలస్యంగా తన దృష్టికి వచ్చిందని, కుటుంబాల్లో చిచ్చుపెట్టేలా కథనం రాసినందుకు అవసరమైతే పరువునష్టం దావా వేయాల్సి వస్తుందని, న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోము’ అని ఖండించారు. సదరు ఖండనకూడా ప్రచురితమైంది.
కథనంలోని అంశం, ఆ కథనంపై వైఎస్ షర్మిల ఖండన విషయం పక్కన బెడితే.. ఆంధ్రజ్యోతికి ఉన్న సోర్స్ ఏంటనే విషయంపై చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయి స్ట్రింగర్ గా పాత్రికేయం మొదలుపెట్టిన ఆ పత్రిక యజమానికి బలమైన సోర్స్ లేదా విశ్వసనీయ సమాచారం రానిదే కథనం ఎలా రాస్తారనే ప్రశ్నే అందరికీ వస్తోంది. అందులోనూ ఏకంగా ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఆమె సోదరి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పార్టీ పెట్టే వార్తను రాసే ధైర్యం చేస్తుందా.. ఒక వేళ ఆ కథనం తప్పైతే, లేదా షర్మిల పరువునష్టం దావా వేస్తే సదరు పత్రిక విశ్వసనీయత కోల్పోవడంతోపాటు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే సోర్స్ ఏంటనే చర్చ మొదలైంది.
Must Read ;- జగనన్న వదిలిన బాణమా? వదిలించుకున్న బాణమా?
సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ సోర్స్ డైరెక్ట్ సోర్స్ కాకపోయినా.. చాలా ‘ముఖ్య’మైన సోర్స్ అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యల ప్రకారం చూస్తే.. బ్రదర్ అనిల్ వర్గంనుంచి సమాచారం లీక్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు.. ఆ సమాచారం పొరపాటున లీక్ చేసింది కాదని, ఉద్దేశపూర్వకంగానే లీక్ చేసి ఉండవచ్చనే చర్చ జరుగుతోంది. బ్రదర్ అనిల్ కుమార్ డైరెక్ట్ గా కాకుండా.. పక్క రాష్ట్రానికి చెందిన ‘ముఖ్య’వ్యక్తి ద్వారా పావులు కదిపినట్టు సమాచారం. అందుకు కారణాలనూ కొందరు నాయకులు చెబుతున్నారు.
ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశాక ఒకటిరెండు సార్లు మినహా వైఎస్ షర్మిల తన సోదరుడైన జగన్ ఇంటికి రాలేదు. రాఖీపౌర్ణమి సందర్భంగా ఎంతో ఆప్యాయంగా రాఖీ కట్టినట్టు కూడా ఎక్కడా బయటకు రాలేదు. బెంగళూరులో మినహా పెద్దగా మాట్లాడుకునే అవకాశం కూడా రాలేదని తెలుస్తోంది. ఆ మధ్య సీఎం జగన్ తో బ్రదర్ అనిల్ మాట్లాడేందుకు ప్రయత్నించగా జగన్ అవకాశం ఇవ్వలేదని, అప్పటికే జగన్ వ్యవహారశైలితో అసహనంగా ఉన్న అనిల్ కు, షర్మిలకు ఆ ఎపిసోడ్ ఆగ్రహం కలిగించిందని చెబుతున్నారు. అయితే ఇదంతా బయటనుంచి వస్తున్న సమాచారమే. ఇక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలేమైనా ఉన్నాయా అనే సమాచారం మాత్రం బయటకు రాలేదు.
పార్టీని నిలబెట్టడం కోసం షర్మిల వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం, ఇక జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా షర్మిల పార్టీకోసం కష్టపడిన విషయం కూడా తెలిసిందే. అంత కష్టపడి పార్టీని నిలబెట్టిన తరవాత తమకు కనీస విలువ ఇవ్వకపోవడంతో ఇగో హర్టైనట్లు తెలుస్తోంది. ఇక గతంతో పలువురు నాయకులు అంతర్గతంగా చర్చించుకున్న విషయం కూడా ఇక్కడ ప్రస్తావించవచ్చు. వాస్తవానికి వైఎస్ జగన్ కంటే.. షర్మిల పట్టుదల కలిగిన వ్యక్తిగా, తాను అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టని వ్యక్తిగా పేరుంది. ఈ నేపథ్యంలో సదరు కథనం, సోర్స్ కి సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా బయట, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే. ఈ కథనంలో వాస్తవం ఎంత.. సోర్స్ విశ్వసనీయత ఎంత అనేది రానున్న కాలంలో తేలనుంది.
Also Read ;- జగనన్న బాణం.. తెలంగాణలో గురి తప్పితే..











