పురుషులకు ఎందులోనూ తీసిపోమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ.. దూసుకెళుతున్న మహిళా మణులు.. ఇప్పుడు తాజాగా మరో ఫీట్ సాధించనున్నారు. ఎయిరిండియాకు చెందిన మహిళా పైలెట్లు.. చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఓ సుదూర నాన్ స్టాప్ విమానాన్ని సుదీర్ఘ సమయం పాటు నడపనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బెంగుళూరుకు రానున్న తొలి సుదూర నాన్ స్టాప్ కమర్షియల్ విమానాన్ని మొత్తం మహిళలే నడపనున్నారు.
ఎయిరిండియాకు చెందిన ఈ విమానం.. ఉత్తర ధృవం మీదుగా అట్లాంటిక్ మార్గంలో ప్రయాణించి బెంగుళూరుకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా ఎయిరిండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఎయిరిండియా నడుపుతున్నఅత్యంత సుదూర కమర్షియల్ విమానం ఇదే. ఈ మార్గంలో ప్రయాణం మొత్తం 17 గంటలకు పైగానే ఉంటుంది. ఆ సమయం.. గాలి వేగంపై ఆధారపడి ఉంటుంది’ అని తెలిపారు. ఈ రెండు నగరాల మధ్య దూరం 13,993 కిలోమీటర్లు ఉంటుందని, టైమ్ జోన్‌లో మార్పు 13.50 గంటలు ఉంటుందని ఆయన చెప్పారు.
Also Read ;- ఇండోనేషియా విమానం అదృశ్యం
కెప్టెన్ జోయా అగర్వాల్, కెప్టెన్ పపగారి తన్మయి, కెప్టెన్ ఆకాన్ష సోనావర్, కెప్టెన్ శివాని మన్హస్.. ఈ చారిత్రక విమానాన్ని నడపనున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి ట్విటర్ లో పేర్కొన్నారు. అలాగే, ఈ మహిళా పైలెట్లకు అభినందనలు తెలిపారు. కాగా, ఈ ఏఐ 176 విమానం.. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి శనివారం రాత్రి 8:30 (స్థానిక కాలమానం) గంటలకు బయలుదేరి.. సోమవారం ఉదయం 3:45 (స్థానిక కాలమానం) గంటలకు బెంగుళూరు చేరుకుంటుంది.
చరిత్రలో తమకంటూ సరికొత్త అధ్యాయాన్ని లిఖించుకోవడానికి సిద్ధపడుతున్న ఈ మహిళామణులు విజయం సాధించాలని ఆశిద్దాం.
Must Read ;- ఎన్డీఆర్‌ఎఫ్ లోకి తొలిసారిగా నారీ దళం!