ప్రణయం.. ప్రళయంగా మారితే ఒంటరి జీవితమే మిగులుతుందనడానికి అమృత జీవితమే ఓ ఉదాహరణ. అలా అని జీవితాన్ని నిరాశామయం చేసుకోకుండా ఆశతో అడుగు ముందుకు వేస్తున్నఈ అమృత ప్రణయ గాథను తెలుసుకుందాం. అమృత అంటే బహుశా తెలియని వారు ఉండరేమో. మిర్యాల గూడలో 2018లో పరువు హత్యతో వెలుగు చూసిన ఆమె ప్రేమ కథ సినిమాగానూ వచ్చింది.
అమృత ప్రేమించిన ప్రణయ్ ను ఆమె తండ్రి మారుతీరావు హత్య చేయించడం, ఆ తర్వాత మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడ లాంటి వరుస ఘటనలను జనం అంత తేలికగా మరచిపోలేరు. అమృత ప్రణయ్ ల ప్రేమకు గుర్తుగా ఆమె జీవితంలోకి నిహాన్ అనే బుడతడు కూడా వచ్చేశాడు. మరి ఆ అమృత ఇప్పుడు ఏంచేస్తోందన్న ప్రశ్న ఉదయించకమానదు. ఆమె ఏడాది క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించింది. ప్రేనం పేరుతో సొంతంగా క్లాతింగ్ వ్యాపారాన్ని కూడా చేపట్టింది.
ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆమె ప్రారంభించిన అమృతాప్రణయ్ ఛానెల్ సబ్ స్క్రయిబర్స్ కూడా దాదాపు మూడు లక్షలకు చేరువయ్యారు. దుస్తుల బ్రాండింగ్ వీడియోలు, రకరకాల వంటల వీడియోలకు మంచి క్రేజ్ సంపాదించింది అమృత. తన ఛానెల్ ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా తన కుమారుడు నిహాన్ తో కలిసి కేకు కట్ చేసి ఆ వీడియోను కూడా షేర్ చేసింది. ఆమె ఛానెల్ లోకి వెళితే నాటు కోడి కూర ఎలా చేయాలి, జొన్న రొట్టెలు చేయడం ఎలా, అల్లం ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలి లాంటి విషయాలెన్నో తెలుస్తాయి.
ప్రాణంలా చూసుకుని పెంచి పెద్ద చేసిన తండ్రినీ, ప్రాణ ప్రదంగా ప్రేమించిన భర్తను కోల్పోయినా ఆమె మాత్రం తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. తన వ్యాపారాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ‘ప్రణయ్.. నువ్వచ్చిన చిరునవ్వును ఇప్పటికీ దరిస్తున్నా’ అంటూ కామెంట్ చేసింది. తండ్రినీ, భర్తనూ తన కొడుకులోనే చూసుకుంటూ ఆమె జీవితాన్ని నెట్టుకొస్తోందని అర్థమవుతోంది. ఆమె యూట్యూబ్ ఛానెల్ లోని వీడియోలకు కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం నెటిజన్ల మనసు దోచుకునే ప్రయత్నాన్ని ఆమె చేస్తోంది.
Must Read ;- ప్రేమ పేరుతో కోరిక తీర్చుకొని.. మహిళా టెక్కీని మోసం చేసి!











