‘బిగ్ బాస్ 4’ రియాలిటీ షో అనూహ్యమైన మలుపులతో ముందుకువెళుతోంది. హౌస్ లో ఎప్పటికప్పుడు ఆశ్చర్యచకితులను చేసే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ‘లాస్య’ బయటికి రావడం కూడా అలాంటిదే. ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటికి వచ్చిన ‘లాస్య’ .. అక్కడ తనకి ఎదురైన అనుభవాలను గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె ‘నోయెల్’ గురించి ప్రస్తావించింది. “నేను ‘బిగ్ బాస్’ హౌస్ కి వెళ్లకముందు నుంచే నాకు నోయెల్ తో పరిచయం వుంది. అతనితో కలిసి ఒక సినిమా చేశాను. ఆ తరువాత నాకు తెలిసిన వ్యక్తి అవినాశ్. కొన్ని ఈవెంట్స్ లో ఇద్దరం కలిశాం .. కొన్ని స్కిట్స్ చేశాము. ఇక మిగతావాళ్లంతా ‘బిగ్ బాస్’ హౌస్ కి వెళ్లిన తరువాత పరిచయమైన వాళ్లే.
నోయెల్ అనారోగ్య కారణాల వలన హౌస్ నుంచి బయటికి వెళ్లవలసి వచ్చింది. మళ్లీ ఆయన తిరిగి వస్తాడని అనుకున్నాను .. కానీ అలా జరగలేదు. హౌస్ లో నుంచి వెళ్లడానికి ముందు నోయెల్ తన అనారోగ్య కారణంగా చాలా బాధపడ్డాడు. డాక్టర్లు వచ్చి అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది చూశారు. అత్యవసర చికిత్స నిమిత్తం అతను బయటికి వెళ్లవలసిందేనని తేల్చి చెప్పారు. మొదటి నుంచి కూడా హౌస్ లో నోయెల్ చాలా ఇబ్బంది పడేవాడు. హాఫ్ డే బాగానే ఉండేవాడు .. ఆ తరువాత నుంచి ఆయన కాలునొప్పి ఎక్కువవుతూ వచ్చేది. అలా కాలునొప్పితో ఇబ్బంది పడుతూ బయటికి వెళ్లిన నోయెల్, వారం .. పది రోజులో రావొచ్చునని అనుకున్నాం. కానీ హఠాత్తుగా నాగ్ సార్ తో స్టేజ్ పై ప్రత్యక్షమై తాను లోపలికి రావడం లేదని చెప్పాడు. అప్పుడు మాత్రం నాకు చాలా బాధ అనిపించింది.
ఇక అంతకంటే ఎక్కువగా నన్ను బాధపెట్టిన సంఘటన ‘బిగ్ బాస్’ హౌస్ లో మరొకటి జరిగింది. ‘బాహుబలి’లో ‘కట్టప్ప’ మాదిరిగా వెన్నుపోటు పొడిచేదెవరు? అనే ప్రశ్నకి సమాధానంగా హౌస్ లోని కొంతమంది నా ఫేస్ పై స్టాంప్ వేశారు. బయటికి నేను నవ్వుతూనే కనిపించానుగానీ .. లోపల మాత్రం చాలా బాధపడ్డాను. వాళ్లంతా నన్ను ఎందుకు ఇంతగా అపార్థం చేసుకున్నారు? అనే ఆలోచనలే బుర్రనిండుగా ఉండేవి. నిజానికి నేను కొన్ని టాస్కుల కోసం చాలా కష్టపడ్డాను .. బాగా ఆడాను. అవి టెలీకాస్ట్ కాలేదు .. అందువలన నా కష్టానికి తగిన గుర్తింపు లభించలేదని భావిస్తున్నాను. అక్కడ ఏం చేశామనేది అలా ఉంచితే .. బయటికి ఏం వచ్చిందనేదానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది.
టాస్కుల విషయానికొస్తే మెహబూబ్ గట్టిపోటీ ఇచ్చేవాడు. అఖిల్ .. అభిజిత్ .. సోహెల్ అందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్లు బాగానే ఆడుతున్నారు. ఈ మధ్య కాలంలో మోనల్ కూడా దార్లో పడిందనే నాకు అనిపించింది. కానీ నాకంటే ముందే మోనల్ బయటికి రావలసిందనే టాక్ నేను బయటికి వచ్చాక వినిపించింది. అఖిల్ .. మోనల్ .. అభి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతున్నట్టుగా బయట చెప్పుకుంటున్నారుగానీ, లోపల అలాంటిదేం లేదు. అఖిల్ .. మోనల్ మధ్య మంచి స్నేహం వుంది. ఇక అభిజిత్ .. మోనల్ మధ్య అసలు ప్రేమ వ్యవహారానికి అవకాశమే లేదనే విషయం నాకు తెలుసు” అని చెప్పుకొచ్చింది.
Must Read ;- అఖిల్ సరసన కన్నడ బ్యూటీ ఖాయమైందా?











