హిజ్రా అనే పేరు విన్నా, వాళ్లను చూసినా, అసహ్యించుకంటూ పక్కకు తప్పుకెళ్లే వారు ఇంకా మన సమాజంలో లేకపోలేదు. మరికొందరు వారిని ఎగతాళి చేస్తూ చులకన చేస్తుంటారు. వాళ్లు కేవలం భిక్షమెత్తుకుని బతకాలని, ఇంకే పనులకు వారు అర్హులు కారు అన్నట్లుగా చూస్తుంది మన సమాజం. కానీ అటువంటి ఆలోచనలను పటాపంచలు చేస్తూ, భిక్షమెత్తుకునే దుస్థితి నుండి లాయర్ గా కోర్టు మెట్లెక్కే స్థాయికి చేరుకుందీ పాకిస్థానీ ట్రాన్స్ జెండర్. అంతేకాదు, దేశంలోనే లాయర్ వృత్తిని చేపట్టిన మొదటి ట్రాన్స్ జెండర్ గా చరిత్ర సృష్టించింది నిషా రావు.
18 ఏళ్ల వయసులో ఇంటి నుండి పారిపోయా
నాపేరు నిషా రావు. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. నాకంటూ ఒక గుర్తింపు సాధించుకోవాలనే తపనతో ఇంటి నుండి పారిపోయాను. నాలాంటి వాళ్లను కలుసుకున్నాను, వారి సలహాతో భిక్షమెత్తుకోవడం మొదలుపెట్టాను. పొట్టగడవడానికి ఆ పనిచేయక తప్పలేదు. కానీ, నాకు అది నచ్చలేదు. అలా జీవితాంతం ఎలా బతకాలి అనే ఆలోచనతో సతమతమయ్యాను. అందుకు పరిష్కారం ఒకటే, చదువు. ఉన్నత చదువులు చదివి స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నాను. పూటగడవడానికే కష్టపడుతుంటే చదువెలా సాగేది?
రాత్రి క్లాసులకు హాజరయ్యాను
అలా భిక్షమెత్తుకున్న డబ్బుతోనే నైట్ క్లాసులలో చదువుకోవాలని నిర్ణయించుకున్నాను. చదువే కాదు, నాలాంటి ట్రాన్స్ జెండర్ లకు న్యాయం చేయడానికి లాయర్ వృత్తి సరైన నిర్ణయంగా భావించాను. అందుకు అనుగునంగా కష్టపడి చదివి నేడు లాయర్ గా కోర్టులో కేసులు వాదించే స్ధాయికి చేరుకున్నాను. దేశంలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్ గా గుర్తింపు తెచ్చుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా ప్రయాణం కొందరిలోనైనా మార్పు తీసుకురాగలిగితే చాలు.
ట్రాన్స్ జెండర్లకు అండగా నిలబడతా
మా దేశంలో 2009 లో సుప్రీం కోర్టు తీర్పుతో మాలాంటి ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు జారీ చేశారు. అయినా, ప్రభుత్వ మద్ధతు లభించడానికి ఇంకో 9 ఏళ్లు పట్టింది. ట్రాన్స్ జెండర్లని కూడా సమాన పౌరులుగా గుర్తించాలంటూ పార్లమెంట్ లో 2018 లో బిల్ పాస్ చేశారు. 2019 లెక్కల ప్రకారం దేశంలో దాదాపు 5 లక్షల మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నట్లు అధికారకంగా గుర్తించారు. వారందరికీ నేను చెప్పేదొకటే, ప్రతి ఒక్కరికీ చదువుకునే వీలుండకపోవచ్చు. కానీ, భిక్షమెత్తుకోవడం మాత్రమే మార్గం అని ఆత్మగౌరవాన్ని చంపుకోకండి. ట్రాన్స్ జెండర్ల న్యాయం కోసం ఎటువంటి పోరాటం చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను అని వెల్లడించిందీ పాక్ లాయర్.
Must Read ;- ఈ దేశంలో శ్యానిటరీ న్యాప్ కిన్లు ఉచితం