బుల్లితెరపై యాంకర్ గా ‘లాస్య’కి మంచి క్రేజ్ వుంది. ఆ క్రేజ్ ఆమెను ‘బిగ్ బాస్ 4’ హౌస్ కి తీసుకెళ్లింది. ‘బిగ్ బాస్ 4’ హౌస్ లో ఆమెకి గట్టిపోటీనే ఎదురైంది. తనపై తనకి గల నమ్మకంతో ఆ పోటీని తట్టుకుంటూ ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించింది. చివరివరకూ ఆమె హౌస్ లోనే ఉండటం ఖాయమని అభిమానులు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆమె ‘క్రితం వారమే హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. లాస్య అభిమానులకు ఇది నిరాశను కలిగించే విషయమే. లాస్య కూడా ఈ విషయంలో ఆ రోజున కాస్త అసంతృప్తిగానే కనిపించింది. అలాంటి లాస్య ‘బిగ్ బాస్ 4’ హౌస్ లో తన 77 రోజుల ప్రయాణాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించింది.
‘బిగ్ బాస్’ సీజన్ 1 సమయంలో నన్ను అడిగారు .. బిజీగా ఉండటం వలన కుదరలేదు. తరువాత సీజన్ 2 సమయంలో మళ్లీ అడిగారు .. కానీ చేయలేకపోయాను. సీజన్ 3 సమయానికి నాకు చిన్నబాబు .. వాడిని చూసుకోవడం అవసరం కనుక చేయలేదు. ‘బిగ్ బాస్ 4’ లో చేయమని అప్పుడే నన్ను అడిగారు. 2017లో నాకు పెళ్లి అయింది .. అప్పుడు నేను నా కెరియర్ కి బ్రేక్ ఇచ్చాను .. అలా మూడేళ్లపాటు బ్రేక్ వచ్చేసింది. మళ్లీ నేను రీ ఎంట్రీ ఇవ్వాలంటే నాకు ఒక పెద్ద షో కావాలి. ‘బిగ్ బాస్ 4’ నాకు పెద్ద ఫ్లాట్ ఫామ్ అనిపించింది. అందువల్లనే ఆ షో చేయడానికి ఒప్పుకున్నాను.
‘బిగ్ బాస్’ హౌస్ ఒక ప్రత్యేకమైన ప్రపంచం .. ఆ ప్రపంచంలో ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. అయినా అందరిని కలుపుకుపోతూ వాళ్లతో కలిసి ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు అక్కడి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. మానసికంగా వాటిని ఎదుర్కుంటూ ముందుకువెళ్లవలసి ఉంటుంది. సాధారణంగా నేను ఎక్కువగా నా కుటుంబ సభ్యులతోనే వుంటాను. ఒంటరిగా వున్న సందర్భాలు చాలా తక్కువ. ‘బిగ్ బాస్’ హౌస్ లో ఒంటరిగా వుండే సమయం కూడా ఉంటుంది. అలాంటి సమయంలో నా గురించి నేను ఆలోచించుకున్నాను .. నన్ను నేను తెలుసుకున్నాను. ఇదివరకూ చాలా సున్నితంగా వుండే దానిని .. కానీ బిగ్ బాస్ హౌస్ ఇచ్చిన అనుభవంతో చాలా స్ట్రాంగ్ అయ్యాననే అనుకుంటున్నాను.
మా అబ్బాయి ‘జున్ను’ను వదిలేసి నేను ‘బిగ్ బాస్’ హౌస్ కి వెళ్లలేదు. మా అబ్బాయి బాధ్యతను మా అత్తగారికి అప్పగించే వెళ్లాను. మూడు నెలల ముందుగానే మా అత్తగారిని రప్పించి, ‘జున్ను’ను ఆమెకి పూర్తిగా అలవాటు చేశాను. నేను కొన్ని రోజుల పాటు దూరమైనా వాడు ఉండగలడు అనే నమ్మకం వచ్చిన తరువాతనే ‘బిగ్ బాస్’ హౌస్ లోకి అడుగుపెట్టాను. నేను గెలవకుండా తిరిగి వచ్చినందుకు మా వాళ్లు బాధపడలేదు. ప్రేక్షకుల్లో మంచి పేరును సంపాదించుకుని తిరిగి వచ్చినందుకు సంతోషపడ్డారు. ‘టాప్ 5’లో వుంటే బాగుండేదని నేను అనుకున్నట్టుగానే వాళ్లు అనుకోవడంలో తప్పులేదు కదా” అంటూ చెప్పుకొచ్చింది.
Must Read ;- ప్రేమవ్యవహారంపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్











