(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి నూరు శాతం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామని కేంద్రం పదే పదే స్పష్టం చేస్తున్న వేళ… ఇటీవల కొందరు రాజకీయ ప్రముఖులు చేస్తున్న ప్రకటనలతో ఈ ప్లాంట్ రాష్ట్రప్రభుత్వం ఖాతాలోకి చేరుతుందా అన్న ఆశ కార్మిక వర్గాల్లో మొదలైంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విధానపరమైన నిర్ణయంలో భాగమేనని, సంస్థల అభివృద్ధి కోసమే ప్రైవేటీకరిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చేసిన ప్రతిపాదనపై కేంద్రం ఆలోచన చేస్తోందని ఆయన వెల్లడించారు. అదే జరిగితే కార్మిక వర్గాల ఆనందానికి అంతే ఉండదు. తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ సంచలన ప్రతిపాదన చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం.. కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని కేంద్రం హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అనుమతుల దశలోనే ఉందని, దీంతో కొత్తగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే బదులు.. ఇప్పటికే ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్రానికి కేటాయించొచ్చు కదా..? అని భరత్ పార్లమెంట్‌లో కేంద్రాన్ని కోరారు.
రాష్ట్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చంటూ..
ఇలా చేయడం ద్వారా విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతోపాటు.. ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడొచ్చని రాజమండ్రి ఎంపీ కేంద్రానికి సూచించారు. ఒకవైపు వైసీపీ ఎంపీలు, మరోవైపు బీజేపీ నేతలు చేస్తున్న ఈ ప్రకటనలతో కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కానీ గత చరిత్రను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరిన రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించిన దాఖలాలు లేవని, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇలానే వ్యవహరిస్తుందని ట్రేడ్ యూనియన్ నేతలు చెబుతున్నారు. మరి వాటికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందా? లేదా? అన్నది కూడా తేలాల్సి ఉంది.
Also Read ;- విశాఖ ఉక్కు పరిరక్షణకు పోరాడతాం.. సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ప్రకటన
మరిన్ని ప్రతిపాదనలు కేంద్రం ముందు..
స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడంతో పాటు నష్టాల బారి నుంచి గట్టెక్కించేందుకు అనేక ప్రతిపాదనలు చేసి కేంద్రానికి సమర్పిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు ప్రతిపాదనలు చేసింది. దాంతోపాటు స్టీల్ ప్లాంట్ మాజీ సీఎండి శివసాగర్ రావు, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి లక్ష్మీనారాయణ పలు ప్రతిపాదనలు చేసి ప్రధాని మోదీకి లేఖ పంపారు. అన్ని ప్రైవేటు స్టీల్ ప్లాంట్లను ఒకటిగా చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉక్కు పరిశ్రమ గుర్తింపు పెరుగుతుందని వారు సూచించారు. ఆయా ప్రతిపాదనలు కూడా కేంద్రంపై ఎటువంటి ఆర్థిక భారాన్ని మోపే అవకాశం లేదు. దీంతో ఆయా ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తుందా? లేక తాము అనుకున్నది చేస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం కోరికలను మన్నిస్తుందా? అన్నది కేంద్రం స్పష్టం చేయాల్సి ఉంది.
రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు..
కాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఒక్క రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా నష్టాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను క్షుణ్నంగా పరిశీలించామని, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ఆమె చెబుతున్న దాన్ని బట్టి ఇటువంటి అనేక ప్రతిపాదనలను పరిశీలించిన తరువాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అన్నది కేంద్ర విధానం. మరి ఇక్కడి నుంచి వెళుతున్న ప్రతిపాదనల్లో కొన్ని మాత్రమే కేంద్రానికి ఆదాయం సమకూరేలా ఉన్నాయి మిగిలిన వాటి వల్ల కేంద్రానికి ఉపయోగం లేదు. కాకలు తీరిన మేధావులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నారు. వారి కన్నా విలువైన సూచనలు, వారికి కూడా తట్టని ప్రతిపాదనలు ఇక్కడ నుంచి వెళ్లి ఉంటే కేంద్రం కాస్త ఆలోచిస్తుందేమో!.
Must Read ;- విశాఖ ఉక్కు పరిరక్షణకు ఉద్యోగి బలిదానం?